PM Modi : మనమంతా ఒక్కటే!
ABN, Publish Date - Jun 27 , 2024 | 03:35 AM
ఎన్డీయే సభ్యులమైన మనమందరం ఒకటేనని.. తనను కలవాలనుకుంటే ఎప్పుడైనా నిరభ్యంతరంగా కలవొచ్చని ప్రధాని మోదీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా..
రాష్ట్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా: మోదీ
సమస్యలుంటే నాతో చెప్పండి
లోక్‌సభలో చర్చల్లో పాల్గొనండి
టీడీపీ ఎంపీలకు ప్రధాని సూచన
అరగంట భేటీ, సరదా సంభాషణ
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక తర్వాత
మోదీని కలిసి సత్కరించిన ఎంపీలు
న్యూఢిల్లీ, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే సభ్యులమైన మనమందరం ఒకటేనని.. తనను కలవాలనుకుంటే ఎప్పుడైనా నిరభ్యంతరంగా కలవొచ్చని ప్రధాని మోదీ టీడీపీ ఎంపీలతో అన్నారు. అందరూ కలిసి వచ్చినా.. లేదంటే విడివిడిగా వచ్చినా పర్వాలేదన్నారు. బుధవారం లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనంతరం మధ్యాహ్నం టీడీపీ ఎంపీలు ప్రధానితో భేటీ అయ్యారు. సుమారు అరంగంట పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. రామ్మోహన్‌నాయుడు ఎంపీలను మోదీకి పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని కుశల ప్రశ్నలు వేశారు. చాలా సరదాగా మాట్లాడారు. తనను కలిసేందుకు కుటుంబ సభ్యులతో రావచ్చొని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తనతో ఓపెన్‌గా చెప్పాలన్నారు. దేశ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పార్లమెంటు చర్చల్లో పాల్గొనాలని హితవు పలికారు. ఎంపీలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలసి ఉండాలని ఆకాంక్షించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారని తెలుసుకుని అభినందించారు.
కుటుంబ నేపథ్యం గురించి ఆరాతీశారు. కేంద్ర మాజీ మంత్రి ఆశోక్ గజపతిరాజు ప్రాతినిధ్యం వహించిన విజయనగరం నుంచి ఆయన ఎన్నికయ్యారని తెలుసుకుని.. అశోక్ ఆరోగ్యం గురించి రామ్మోహన్‌నాయుడిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానిని టీడీపీ ఎంపీలు సన్మానించారు. రామ్మోహన్ ఆయనకు తిరుమల శ్రీవేంకటేశ్వరుడి విగ్రహాన్ని బహూకరించారు.
బాబు నేతృత్వంలో 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయ్
భారతదేశ పురోగతికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రధాని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు. ఎన్టీయే ఎంపీలు లోక్‌సభలో వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ కోసం కృషి చేస్తారన్నారు.
నా నియోజకవర్గానికి ఎయిర్‌పోర్టు కావాలి: స్పీకర్
అంతకుముందు.. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను టీడీపీ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు బాలాజీ విగ్రహాన్ని ఆయనకు బహూకరించారు. టీడీపీ నుంచి 16 మంది సభ్యులు లోక్‌సభకు ఎంపికయ్యారని, తమకు సభలో తగినంత సమయం ఇవ్వాలని కోరారు. బదులుగా స్పీకర్ నవ్వుతూ.. తన నియోజకవర్గ కేంద్రం కోటా (రాజఽస్థాన్)కు ఎయిరుపోర్టు కావాలన్నారు. పరిశీలిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
రాజస్థాన్‌లోని బన్స్వారా నియోజకవర్గం నుంచి గెలిచి లోక్‌సభ సమావేశాల తొలిరోజున ఒంటెపై వచ్చిన ఎంపీ రాజ్‌కుమార్ రౌత్.. అదే రోజు సైకిల్‌పై పార్లమెంటుకు వచ్చిన ఎంపీ కలిశెట్టి పార్లమెంటు లాబీలో పరస్పరం ఎదురయ్యారు. వారు సరదాగా మాట్లాడుకోవడం అందరినీ ఆకర్షించింది.
బుధవారం లోక్‌సభ ప్రారంభానికి ముందు 50-అశోకా రోడ్‌లో రాష్ట్ర టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై చర్చించారు.
Updated Date - Jun 27 , 2024 | 03:35 AM