Share News

Kolkata: పిల్లలు లేని ఆమెకు.. మా బాధ ఎలా తెలుస్తుంది.. మమతపై మండిపడిన అభయ తల్లి

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:31 AM

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అభయ(పేరు మార్చాం) హత్యాచార ఘటనపై మండిపడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలపై సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

Kolkata: పిల్లలు లేని ఆమెకు.. మా బాధ ఎలా తెలుస్తుంది.. మమతపై మండిపడిన అభయ తల్లి

కోల్‌కతా: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అభయ(పేరు మార్చాం) హత్యాచార ఘటనపై మండిపడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలపై సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్లు తమ ఆందోళన విరమించి వెంటనే విధుల్లోకి హాజరు కావాలని కోరారు. సమ్మె చేస్తున్న డాక్టర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై కేసులు నమోదు చేయడం తనకు ఇష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను బెదిరింపుగా భావించిన డాక్టర్లు విధుల్లోకి చేరడానికి నిరాకరించారు.

అయితే దీదీ వ్యాఖ్యలపై బాధితురాలు అభయ తల్లి మండిపడ్డారు. మమతా కామెంట్స్ తనకు నచ్చలేదని పేర్కొన్నారు. "ఆడబిడ్డను కోల్పోయిన మా కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నేను నిరసనకారులు విన్నవిస్తున్నా. మాకు న్యాయం అక్కర్లేదని ముఖ్యమంత్రి అంటున్నారు. మమతకు పిల్లలెవరూ లేరు. ఒక తల్లి తన బిడ్డను కోల్పోతే ఉండే బాధ ఆమెకు అర్థం కాదు. అర్థం చేసుకోలేరు కూడా. మమత వ్యాఖ్యలతో మా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు" అని అభయ తల్లి భావోద్వేగానికి గురయ్యారు.


ప్రజాస్వామ్యాన్నే బెదిరిస్తున్నారు..

దీదీ మాట్లాడుతూ... “ బీజేపీకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో డాక్టర్లు ప్రజాస్వామ్యాన్నే బెదిరిస్తున్నారు. అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా నా గొంతు పెంచాను” అని పేర్కొన్నారు. దీదీ కామెంట్స్‌పై బీజేపీ మండిపడింది. ఆమె విపక్షాలను బెదిరిస్తున్నారని విమర్శించింది.

మరోపక్క.. బెంగాల్‌ తగలబడితే అసోం, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కూడా కాలిపోతాయంటూ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన మమత బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్‌ డిమాండ్‌ చేశారు. మమత వ్యాఖ్యలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ కూడా తీవ్రంగా ఖండించారు.


ఇంకా మిస్టరీగానే..

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడటం లేదు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నా అసలు విషయం బయటకు రావడంలేదు. ఇప్పటికే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి విచారణ ప్రారంభించింది. అభయ చనిపోవడానికి ముందు రోజు రాత్రి తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ సమయంలో ఇదే చివరి కాల్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. మరింత లోతుగా దర్యాప్తు చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 01:05 PM