Elections : ముంబై ఓటు ఎటువైపు?
ABN, Publish Date - Nov 18 , 2024 | 02:56 AM
ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన స్వీప్.. 36 స్థానాలకు గాను 30 చోట్ల ఎన్డీఏ గెలుపు
లోక్‌సభ ఎన్నికల్లో భిన్నంగా ఫలితాలు
6 ఎంపీ సీట్లలో బీజేపీకి రెండే..
ప్రస్తుతం 2 కూటములుగా ఆరు పార్టీలు
ఓట్లు చీల్చనున్న ఒవైసీ, రాజ్‌థాకరే పార్టీలు
ముంబై, నవంబరు17: ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది. ముంబైలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి అభ్యర్థులతో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన, శరద్ పవార్ వర్గం ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘాడీ(ఎంవిఏ) కూటమి అభ్యర్థులు తలపడుతున్నారు. వీరికి తోడు రాజ్‌థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎ్‌స), ప్రకాశ్ అంబేడ్కర్ సారథ్యంలోని వించిత్ బహుజన్ అఘాడీ, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లి్‌స అభ్యర్థులు కూడా ముంబైలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
2019లో బీజేపీ-శివసేన హవా
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 36 సీట్లకు గాను బీజేపీ, ఉమ్మడి శివసేన ఎన్డీయే కూటమిగా 30 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇందులో బీజేపీ 16, శివసేన 14 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో మహాయుతి కూటమిలోని బీజేపీ 18, షిండే శివసేన 16, అజిత్ పవార్ ఎన్సీపీ 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాయి. ఎంవిఏ కూటమిలోని యూబీటీ 22, కాంగ్రెస్ 11, శరద్ పవార్ వర్గం ఎన్సీపీ 2 చోట్ల అభ్యర్థులను పోటీకి దించాయి. శివసేన రెండు ముక్కలై పరస్పరం పోటీపడుతుండటంతో తాజా ఎన్నికల్లో ముంబై ఓటర్లు ఏ వర్గాన్ని ఆదరిస్తారనేది ఉత్కంఠగా మారింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో మారిన సీన్
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ముంబైలోని ఆరు ఎంపీ సీట్లకు గాను బీజేపీ రెండింటినే గెలుచుకోగలిగింది. మిగతా నాలుగింటిలో మూడింటిని ఉద్ధవ్ శివసేన గెలుచుకోగా ఎంవిఏ కూటమిలో భాగంగా కాంగ్రెస్ మరో స్థానాన్ని గెలుచుకుంది. మెజార్టీ నియోజకవర్గాలను గెలుచుకున్న ఎంవీఏ అదే ఊపు తో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతోంది.
రాజ్‌థాకరే పార్టీ ఓట్లను చీలుస్తుందా?
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరే ముంబైలో 25 నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దించారు. దీంతో సంప్రదాయ ఓట్లు చీలే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబైలో సంప్రదాయ ఓట్లను నమ్ముకున్న బీజేపీ, శివసేనలకు ఎం ఎన్‌ఎ్‌స సవాలుగా మారనుంది. వర్లీలో ఉద్ధవ్ థాకరే తనయుడు, సిటింగ్ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే పోటీ చేస్తున్నారు. శివసేన తరఫున మిలింద్ దేవరా బరిలో ఉండగా, ఎంఎన్‌ఎ్‌స సందీప్ దేశ్‌పాండేను పోటీకి దించింది. దీంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటి మూడ్‌లోనే ఓటర్లు కొనసాగి తే ముంబైలో 4 సీట్లు గెలుచుకున్న ఎంవిఏ కూటమి మరోసారి స్వీప్ చేసే అవకాశం ఉంది. అయితే తాము అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ముంబై నగర వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పట్టం కడతారని మహాయుతి కూటమి ఆశాభావంగా ఉంది.
ముస్లిం ఓట్లలో చీలిక తప్పదా?
మజ్లిస్ అభ్యర్థులు బరిలో నిలుస్తోన్న వెర్సోవా, శివాజీనగర్ తదితర నియోజకవర్గాల్లో ఎంవీఏ కూటమికి దక్కే ముస్లిం ఓట్లలో చీలిక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఎంవీఏ కూటమికి మింగుడు పడని విషయంగా మారనుంది. గత ఎన్నికల్లో 44 చోట్ల పోటీ చేసిన మజ్లిస్ డజనుకు పైగా నియోజకవర్గాల్లో కాంగ్రె్‌స-ఎన్సీపీ కూటమి అభ్యర్థులను ఓడించడంలో కీలకంగా మారింది.
Updated Date - Nov 18 , 2024 | 03:03 AM