Mumbai Local Train: మిరాకిల్.. రైలు కింద పడి.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ
ABN , Publish Date - Jul 08 , 2024 | 02:05 PM
అప్పుడప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చావు అంచులదాకా వెళ్లి బతికిపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
అప్పుడప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చావు అంచులదాకా వెళ్లి బతికిపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఒక మహిళ రైలు కింద పడి ప్రాణాలతో బయటపడింది. కానీ.. దురదృష్టవశాత్తూ ఆమె తన రెండు కాళ్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన ముంబైలో (Mumbai) జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఒక మహిళ ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ రైలు రద్దీగా ఉండటంతో, ఆమె ఎక్కే క్రమంలో కాలు జారింది. దీంతో.. రైలు కింద పడిపోయింది. అప్పటికే రైలు కదలడంతో.. ఒక కంపార్ట్‌మెంట్ ఆమె పై నుంచి వెళ్లింది. అప్పుడు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది అలారం మోగించడంతో.. రైలు వెనక్కు వెళ్లింది. ఈ ఘటనలో ఆ మహిళ తన రెండు పాదాల్ని కోల్పోవడంతో.. ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది. పోలీసు అధికారులు ట్రాక్‌లపై దిగి.. ఆమెను పైకి తీసుకొచ్చారు.
కాగా.. ముంబైలో ఆదివారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో.. ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోకల్ రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో.. మరో దారి లేక కొన్ని రైళ్లను రద్దు చేశారు. కేవలం కొన్ని రైళ్లు మాత్రమే నడుస్తుండటంతో.. అవి ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఫుట్‌బోర్డు వద్ద కూడా నిలబడేంత చోటు లేదంటే.. పరిస్థితులు ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. బేలాపూర్ స్టేషన్‌లో చాలాసేపు తర్వాత థానేకి వెళ్లే రైలు రావడంతో.. జనాలందరూ ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఆ మహిళ కాలుజారి కిందపడినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Latest National News and Telugu News