ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Patna High Court : 50 శాతం మించొద్దు!

ABN, Publish Date - Jun 21 , 2024 | 04:52 AM

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.

  • బిహార్‌ ప్రభుత్వ రిజర్వేషన్ల పెంపు కొట్టివేత

  • 65 శాతం కుదరదన్న పట్నా హైకోర్టు

  • కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచాం

  • కులాల శాతం ప్రకారం కాదు

  • హైకోర్టులో రాష్ట్ర సర్కారు వాదన

  • సుప్రీంను ఆశ్రయిస్తామన్న డిప్యూటీ సీఎం

బిహార్‌ రిజర్వేషన్ల పెంపు కొట్టివేత.. 65ు కుదరదన్న పట్నా హైకోర్టు

పట్నా, జూన్‌ 20: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు 50% దాటరాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం భిన్నంగా ఉండటంతో జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నితీశ్‌ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా కుల గణన చేపట్టి, వాటి ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీల రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది నవంబరు 21న రిజర్వేషన్లను 50% నుంచి 65 శాతానికి పెంచుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ డబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు పదిశాతంతో కలిపితే రిజర్వేషన్లు 75 శాతానికి చేరాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 16లను రిజర్వేషన్‌ల పెంపు నిర్ణయం ఉల్లంఘిస్తోందంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. హైకోర్టు గత మార్చిలో ఇరు వర్గాల వాదనలు విని తీర్పును వాయిదా వేసింది. గురువారం పిటిషనర్ల వాదనను హైకోర్టు సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెంచి న రిజర్వేషన్లను కొట్టేసింది. చట్టం ముందు అందరూ సమానులే(ఆర్టికల్‌14), సమాన అవకాశాలు(ఆర్టికల్‌ 16) అనే రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘనకు గురైనట్లు హైకోర్టు అంగీకరించింది. కులగణన ఆధారంగా రిజర్వేషన్లను పెంచామన్న వాదనను హైకోర్టు అంగీకరించలేదు. తాము జనాభాలో కులాల శాతాన్ని బట్టి రిజర్వేషన్‌ పెంచలేదని, తగిన ప్రాతినిధ్యం లభించని కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకే రిజర్వేషన్లను పెంచామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ వాదనను పిటిషనర్లు తోసిపుచ్చారు. కులాల శాతాన్ని బట్టే పెంచారని పిటిషనర్లు అన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు 10% కల్పించినపుడే 50% దాటినందున తాము కొత్తగా ఏమీ సుప్రీంతీర్పును ఉల్లంఘించలేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.


తమిళనాడులో 50 శాతానికి మించి

రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని 1992లో ఇంద్రా షానే కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు భిన్నంగా తమిళనాడులో ఎప్పటి నుంచో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమిళనాట దశాబ్దాలుగా అమలవుతున్న రిజర్వేషన్లను కాపాడేందుకు అప్పట్లో కేంద్రం తమిళనాడు రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చింది. తొమ్మిదో షెడ్యూల్‌లోని అంశాలపై న్యాయ సమీక్షకు అవకాశం లేదు. దాంతో కొన్నాళ్లపాటు సుప్రీంకోర్టు తమిళనాడు రిజర్వేషన్ల జోలికి పోలేదు. తర్వాత కాలంలో సుప్రీంకోర్టు తొమ్మిదో షెడ్యూల్‌లోని అంశాలనూ అవసరమైతే సమీక్షిస్తామని స్పష్టం చేసింది. దాంతో తమిళనాడు రిజర్వేషన్లపై అనేక పిటిషన్లు దాఖలై సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. 50% నిబంధన వచ్చిన తర్వాత మహారాష్ట్రలో మరాఠాల కోసం, రాజస్థాన్‌, హరియాణాల్లో జాట్‌ల కోసం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచే ప్రయత్నం చేయగా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు తాజాగా కుల గణన ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచేందుకు బిహార్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అక్కడి హైకోర్టు కొట్టేసింది. తాము అధికారానికి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, వాటి ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని ఇండీ కూటమి హామీ ఇచ్చిన నేపథ్యంలో బిహార్‌ హైకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.


సుప్రీంకోర్టుకు వెళతాం: డిప్యూటీ సీఎం

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి అన్నారు. బీజేపీ బిహార్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా అయిన సామ్రాట్‌ చౌదరి తమ పార్టీ రిజర్వేషన్ల పెంపును పూర్తిగా సమర్థిస్తోందని చెప్పారు. తమ మద్దతుతోనే నితీశ్‌ ప్రభుత్వం కుల గణన చేపట్టి, ఆయా కులాలకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమిళనాడుకు 69% రిజర్వేషన్‌ ఉన్నపుడు బిహార్‌కు ఎందుకు ఉండరాదని ప్రశ్నించారు. హైకో ర్టు తీర్పు తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌ అన్నారు. హైకోర్టు తీర్పుపై సీఎం నితీశ్‌ మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తాము ఈ రిజర్వేషన్లను కాపాడుకొనేందుకు సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. బిహార్‌ సర్కారు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? అని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జయరాం రమేశ్‌ ప్రశ్నించారు.

Updated Date - Jun 21 , 2024 | 04:54 AM

Advertising
Advertising