Puducherry: పుదుచ్చేరి ప్రభుత్వంలో అసమ్మతి? బీజేపీ ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ
ABN, Publish Date - Jun 18 , 2024 | 12:09 PM
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry) ప్రభుత్వంలో అసమ్మతి రేగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నమశ్శివాయం పరాజయం ఈ కూటమిలో చిచ్చు రేపుతోంది.
- కాంగ్రెస్, డీఎంకే ఎమ్మెల్యేలకు సీఎం ఆహ్వానం
- డుమ్మాకొట్టిన ‘ఇండియా’ కూటమి ఎమ్మెల్యేలు
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry) ప్రభుత్వంలో అసమ్మతి రేగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నమశ్శివాయం పరాజయం ఈ కూటమిలో చిచ్చు రేపుతోంది. తమకు ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister Rangaswamy) సరిగ్గా సహకరించకపోవడమే తమ అభ్యర్థి ఓటమికి కారణమని బీజేపీ ఎమ్మెల్యేలు అనుమానిస్తుండగా, ఆది నుంచి తమ పట్ల చిన్నచూపు చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలతో తాడోపేడో తేల్చుకోవాలని ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరిలో 2021లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ 10, బీజేపీ 6, స్వతంత్రులు 6, డీఎంకే 6, కాంగ్రెస్ 2 స్థానాలు పొందాయి. ఆ సమయంలో స్వతంత్రులంతా బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బలం 12కి చేరినట్లయింది. దీంతో ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రిగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి వున్నప్పటికీ.. బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనకు సరిగ్గా సహకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. అంతేగాక కేంద్రప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదికూడా చదవండి: Chennai: ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ బాంబు బెదిరింపు.. రాత్రంతా కొనసాగిన తనిఖీలు
దీనికి తోడు సాక్షాత్తు ముఖ్యమంత్రే.. తనకు రూపాయి కూడా వ్యయం చేసే అధికారం లేకపోయిందంటూ పలుమార్లు వాపోవడం గమనార్హం. అంతేగాక బీజేపీ ఎమ్మెల్యేలు గానీ, ఆ పార్టీ అధిష్టానం గానీ తనకు సరైన మర్యాద ఇవ్వడం లేదని రంగస్వామి తీవ్ర మనస్థాపంతో వున్నారు. కాగా ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పుదుచ్చేరి మంత్రి నమశ్శివాయం పోటీ చేశారు. అయితే పుదుచ్చేరి నియోజకవర్గంలో ఆయన ఓటమి చెందారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్ సరిగ్గా సహకరించకపోవడం వల్లనే తమ అభ్యర్థి ఓటమిపాలయ్యారని బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఇటీవల ఓ రిసార్టులో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రావడంతో ముఖ్యమంత్రి రంగస్వామి కూడాప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ భేటీకి ఎన్‌ఆర్ కాంగ్రెస్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పంపించారు. దీంతో సీఎం భేటీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఆ హోటల్లో ఉన్నతాధికారులు కూడా వుండడంతో ఆశ్చర్యపోయారు. వారి ముందు రాజకీయాల గురించి ఏం మాట్లాడగలమని మిన్నకుండిపోయారు. అయితే విందు ముగిశాక అధికారులకు పంపించివేసిన సీఎం.. ఆ తరువాత ఆయన కూడా వెళ్లిపోయారు.
ఈ భేటీలో ఎలాంటి చర్చ గానీ, మంతనాలు గానీ లేకపోవడంతో బీజేపీతో పాటు ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దిగ్ర్భాంతి చెందారు. ఆ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం గాక వారు తలల బాదుకున్నారు. ఇదిలా వుండగా రంగస్వామి కాంగ్రెస్, డీఎంకే(Congress, DMK) ఎమ్మెల్యేలను ప్రత్యేక విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన నుంచి ఆహ్వానం అందుకున్న ‘ఇండియా’ కూటమి ఎమ్మెల్యేలు.. ముఖం చాటేశారని తెలిసింది. ఈ భేటీలు, ఆహ్వానాలపై పుదుచ్చేరి రాజకీయవర్గాల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. నిజానికి గతంలో బీజేపీతో దూరంగా జరిగితే తాము అండగా నిలబడతామంటూ కాంగ్రెస్-డీఎంకే పార్టీలు ప్రకటించాయి. అయితే అప్పట్లో వారి వినతిని రంగస్వామి పట్టించుకోలేదు. ఇప్పుడు బీజేపీ తనను ఇరుకునబెడుతోందని భావిస్తున్న రంగస్వామి.. ఇండియా కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీని వదిలేస్తేనే తాము అండగా నిలుస్తామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్తుందోనని పుదుచ్చేరి రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 18 , 2024 | 12:09 PM