రక్షణశాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్
ABN , Publish Date - Sep 28 , 2024 | 03:32 AM
రక్షణశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి సభ్యత్వం లభించింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీలో చోటు దక్కింది. ఇదే కమిటీలో తృణమూల్‌కు చెందిన ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రాకు స్థానం లభించడం విశేషం.
కమ్యూనికేషన్ల కమిటీలో కంగన, మహువా
కొత్తగా 24 పార్లమెంటరీ స్థాయీ సంఘాలు
పలువురు తెలుగు ఎంపీలకు కమిటీల్లో చోటు
విదేశాంగ వ్యవహారాలు- డీకే అరుణ, లక్ష్మణ్, ఒవైసీ
రసాయనాలు-ఈటల, ఆరోగ్యం- కడియం కావ్య
గృహ, పట్టణ కమిటీ చైర్మన్‌గా మాగుంట
శ్రీనివాసులురెడ్డి, రైల్వే సారథిగా సీఎం రమేశ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రక్షణశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి సభ్యత్వం లభించింది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు కమ్యూనికేషన్లు, ఐటీ కమిటీలో చోటు దక్కింది. ఇదే కమిటీలో తృణమూల్‌కు చెందిన ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రాకు స్థానం లభించడం విశేషం. పార్లమెంటరీ స్థాయీ సంఘాలను పునర్ వ్యవస్థీకరిస్తూ 24 కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ వివరాలను శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. కీలకమైన రక్షణశాఖ కమిటీ చైర్మన్‌గా రాఽధామోహన్ సింగ్, కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ కమిటీ చైర్మన్‌గా నిశికాంత్ దూబే, హోం కమిటీ చైర్మన్‌గా రాధామోహన్ దాస్, ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా భర్తృహరి నియమితులయ్యారు.
వీరందరూ అధికారపక్షమైన బీజేపీ ఎంపీలు. నాలుగు కమిటీలకు ప్రతిపక్ష కాంగ్రెస్ సారథ్యం వహించనుంది. వాటిలో మహిళలు, విద్య, యువజన క్రీడా వ్యవహారాల కమిటీ (దిగ్విజయ్ సింగ్), విదేశీ వ్యవహారాల కమిటీ (శశిథరూర్), గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ కమిటీ (సప్తగిరి శంకర్ ఉలాకా), వ్యవసాయం, పశుపోషణ, ఆహార ఉత్పత్తి కమిటీ (చరణ్‌జిత్‌సింగ్) ఉన్నాయి. కాగా తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఎంపీలకు వివిధ కమిటీల్లో సభ్యత్వంతోపాటు సారథ్య బాధ్యతలు కూడా లభించాయి.
టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ రైల్వే కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల కమిటీలో డీకే అరుణ, కే లక్ష్మణ్, అసదుద్దీన్ ఒవైసీలకు, వాణిజ్య కమిటీలో రేణుకాచౌదరికి, రసాయనాలు, ఎరువుల కమిటీలో ఈటల రాజేందర్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిటీలో కడియం కావ్యకు సభ్యత్వం లభించింది.
కమిటీల్లో తెలుగు ఎంపీలు
వాణిజ్యశాఖ- రేణుకా చౌదరి,శ్రీ భరత్; హోంశాఖ, రక్షణ శాఖ కమిటీలు- కేశినేని శివనాథ్; మహిళలు, పిల్లలు, యువజనులు, క్రీడలు- దగ్గుబాటి పురంధేశ్వరి; పరిశ్రమలు- గొల్లబాబూరావు, అరవింద్ ధర్మపురి, మల్లురవి, కొండావిశ్వేశ్వర్ రెడ్డి; సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, అటవీ శాఖ- వంశీకృష్ణ గడ్డం, దామోదర రావు దివకొండ, పరిమళ్ నత్వానీ; రవాణా, పర్యాటక రంగం, సాంస్కృతికం- తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సురేశ్ షేట్కర్, వి. విజయసాయిరెడ్డి; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం- డాక్టర్ కడియం కావ్య, బైరెడ్డి శబరి, బి. పార్షసారథి రెడ్డి; సిబ్బంది, ప్రజాసమస్యలు, న్యాయశాఖ- ఎం.రఘునందన్‌రావు, కె. ఆర్ సురేశ్‌రెడ్డి; కమ్యూనికేషన్లు, ఐటీ- రామసహాయం రఘురాం రెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి, కలిశెట్టి అప్పలనాయుడు; ఇంధనశాఖ- కుందూరు రఘువీర్; విదేశీ వ్యవహారాలు- డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీ, వైఎస్ అవినాశ్ రెడ్డి, కే లక్ష్మణ్; ఆర్థిక మంత్రిత్వశాఖ కమిటీ- లావు శ్రీ కృష్ణదేవరాయలు, సీఎం రమేశ్, పీవీ మిధున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వల్లభనేని బాలశౌరి, వైవీ సుబ్బారెడ్డి; కార్మిక, జౌళి, నైపుణ్యాభివృద్ధి- జీఎం హరీశ్ బాలయోగి, జి.లక్ష్మీనారాయణ; పెట్రోలియం, సహజవాయువు- వల్లభనేని బాలశౌరి, వద్దిరాజు రవిచంద్ర, ఎం గురుమూర్తి, పుట్టా మహేశ్‌కుమార్; రైల్వే కమిటీ- సీఎం రమేశ్, కే లక్ష్మణ్, గృహ, పట్టణ వ్యవహారాలు- మాగుంట శ్రీనివాసులు రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి; రసాయనాలు, ఎరువులు - ఈటల రాజేందర్, దగ్గుమళ్ల ప్రసాదరావు, మేడా రఘునాథ రెడ్డి, బలరాం నాయక్; బొగ్గు, గనులు, ఉక్కు - బీకే పార్థసారథి, అనిల్ కుమార్ యాదవ్ మందాడి; సామాజిక న్యాయం, సాధికారికత- గోడం నగేశ్; హోంశాఖ- తెన్నేటి కృష్ణ ప్రసాద్