National : ఆధునిక పంథాలో సౌదీ
ABN , Publish Date - May 19 , 2024 | 04:41 AM
ఛాందసవాద ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా.. కొంతకాలంగా ఆధునిక పంథాలో పయనిస్తోంది. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ప్రగతిశీల ఆలోచనా ధోరణితో చేపట్టిన సంస్కరణలు, ఆ దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా మరో సంచలనానికి సౌదీ తెరతీసింది.
తొలిసారి స్విమ్‌సూట్ ఫ్యాషన్ షో నిర్వహణ
న్యూఢిల్లీ, మే 18: ఛాందసవాద ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా.. కొంతకాలంగా ఆధునిక పంథాలో పయనిస్తోంది. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ప్రగతిశీల ఆలోచనా ధోరణితో చేపట్టిన సంస్కరణలు, ఆ దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా మరో సంచలనానికి సౌదీ తెరతీసింది. మునుపెన్నడూ లేని విధంగా అక్కడ తొలిసారి ‘స్విమ్ సూట్ ఫ్యాషన్’ షో నిర్వహించారు.
నిన్నమొన్నటిదాకా మహిళలు కళ్లు మినహా ఆపాదమస్తకం బురఖా(అబయా)లోనే కనిపించాలన్న నిబంధన ఉన్న సౌదీలో స్విమ్ సూట్లలో మోడళ్లు తళుకులీనారు. ‘రెడ్ సీ ఫ్యాషన్ వీక్’ పేరుతో సౌదీలోని పశ్చిమ తీరంలో సెయింట్ రేగిస్ రెడ్ సీ రిసార్ట్‌లో స్విమ్‌సూట్ ఫ్యాషన్ షో శుక్రవారం ప్రారంభమైంది.
మొరాకోకు చెందిన డిజైనర్ యాస్మినా క్వాంజాల్ ప్రత్యేకంగా మోడల్స్ కోసం ఎరుపు, బీజ్, నీలం రంగుల్లో స్విమ్ సూట్లను రూపొందించారు. మోడళ్లలో కొందరు భుజాలు, నడుం భాగాలు కనిపించేలా వన్ పీస్ సూట్లలో హొయలుపోయారు.