Supreme Court: కేజ్రీవాల్‌కు బెయిల్..
ABN , Publish Date - May 11 , 2024 | 05:14 AM
మద్యం విధానం కేసులో యాభై రోజులుగా తిహాడ్ జైల్లో మగ్గుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల తుది దశ జూన్ 1న ముగియనున్న నేపథ్యంలో.. జూన్ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది.
జూన్ 1 వరకూ మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం
సీఎంవో, సెక్రటేరియట్‌కు వెళ్లొద్దని, 2న లొంగిపోవాలని బెయిల్ షరతులు
కేజ్రీపై నేరం ఇంకా రుజువు కాలేదని.. నేరనేపథ్యం లేదని వ్యాఖ్య
సామాన్యుడికీ సీఎంకూ ఒకే న్యాయం వర్తింపజేయాలన్న ఈడీ
ఏకీభవించని సుప్రీం.. పోలికలు వర్తింపజేయలేమని స్పష్టీకరణ
చంద్రబాబుకూ ఎన్నికల సభల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినట్టు వెల్లడి
హనుమంతుడి ఆశీస్సులతోనే జైలు నుంచి బయటకొచ్చా: కేజ్రీవాల్
బెయిల్ షరతులు
50వేల పూచీకత్తు, అంతే మొత్తానికి ఒకరి ష్యూరిటీ సమర్పించాలి
సీఎం కార్యాలయానికి, ఢిల్లీ సచివాలయానికి వెళ్లకూడదు.
ఆమోదం తప్పనిసరి అయిన సందర్భాల్లో తప్ప అధికారిక పైళ్లపై సంతకం చేయరాదు.
మద్యం విధానం కేసులో తన పాత్ర గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు.
ఈ కేసుకు సంబంధించిన సాక్షులను కలుసుకోకూడదు. కేసు ఫైళ్లను పరిశీలించకూడదు.
న్యూఢిల్లీ, మే 10 (ఆంధ్రజ్యోతి): మద్యం విధానం కేసులో యాభై రోజులుగా తిహాడ్ జైల్లో మగ్గుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల తుది దశ జూన్ 1న ముగియనున్న నేపథ్యంలో.. జూన్ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆయన నేరం ఇంకా రుజువు కాలేదని, ఆయనకు ఎలాంటి నేర నేపథ్యం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేజ్రీవాల్ వల్ల సమాజానికి ఎలాంటి ప్రమాదమూ వాటిల్లదని.. ఆయన ఢిల్లీ సీఎం, ఒక జాతీయ పార్టీ అధినేత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం తమ తీర్పులో పేర్కొంది. ప్రజాస్వామ్యంలో సార్వత్రిక ఎన్నికలు అత్యంత ముఖ్యమైన ఘట్టమని.. ఈ ఎన్నికలకున్న ప్రాధాన్యం దృష్ట్యా, ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయనకున్న బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మఽధ్యంతర బెయిల్ ఇవ్వాలని నిర్ణయించామని స్పష్టం చేసింది.
కేజ్రీకి బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఈడీ ఈ కేసులో ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)ను నమోదు చేసింది 2022 ఆగస్టులో. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది ఈ ఏడాది మార్చి 21న. ఆయన ఈ ఏడాదిన్నరకాలం బయటే ఉన్నారు. ఆయన్ను అంతకుముందూ(మార్చి 21కి ముందు).. ఆ తర్వాతా అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడీ 21 రోజుల బెయిల్‌తో ఏమంత తేడా రాదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘సామాన్యుడికైనా, సీఎంకైనా ఒకే న్యాయం వర్తించాలి. ఒక రైతు, కిరాణా వ్యాపారి అరెస్టయితే వ్యవసాయం చేసేందుకు, దుకాణం నడిపేందుకు బెయిల్ ఇస్తారా?’’ అని ఈడీ న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. అసలు కేజ్రీవాల్ ఉన్న పరిస్థితులకు ఈ పోలికలు వర్తింపజేయలేమని స్పష్టీకరించింది. కేజ్రీవాల్‌కున్నప్రత్యేక పరిస్థితుల రీత్యా ఆయనకు సామాన్య పౌరుడితో పోలిస్తే ప్రాఽధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని, ఈ పరిస్థితులను విస్మరించడం సరైంది కాదని న్యాయస్థానం పేర్కొంది. చంద్రబాబు కేసులో కూడా ఆయనను రాజకీయ కార్యక్రమాల్లోనూ, ఎన్నికల సభలు, సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతించిన విషయాన్ని గుర్తుచేసింది. అలాగని తాము ఈ కేసులో ఇస్తున్న తీర్పు.. రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రత్యేకాధికారాలనూ ఇవ్వదని స్పష్టం చేసింది.
సంబరాలతో స్వాగతం..
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత.. కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి బయటకొచ్చారు. ఆ సమయానికే కేజ్రీ భార్య సునీత, కుమార్తె హర్షిత, ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మంత్రులు ఆతిషీ, సౌరభ్ భరద్వాజ్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు సైతం జైలు బయట పెద్దసంఖ్యలో గుమిగూడారు. నీలి, పసుపు రంగు జెండాలు పట్టుకుని.. ‘జైల్ కే తాలే టూట్‌గయే.. కేజ్రీవాల్ జీ ఛూట్ గయే (జైలు తాళాలు బద్దలయ్యాయి-కేజ్రీవాల్ బయటికొచ్చారు) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. డోళ్లు వాయిస్తూ.. పూల వర్షం కురిపిస్తూ.. సంబరాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. ‘‘మీకు ముందే చెప్పాను.. నేను త్వరలోనే బయటకు వస్తానని. నియంతృత్వానికి వ్యతిరేకంగా నేను శాయశక్తులా పోరాడుతున్నాను. కానీ, 140 కోట్ల మంది ప్రజలూ ఈ పోరాటంలో నాతో కలిసి రావాలి’’ అన్నారు. హనుమంతుడి ఆశీస్సులతోనే తాను బయటకు వచ్చానన్న కేజ్రీవాల్.. ఆ స్వామికి ప్రార్థనలు చేసేందుకు శనివారం ఉదయం కన్నాట్‌ప్లే్‌స(ఢిల్లీ)లోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లనున్నట్టు చెప్పారు.
ప్రజాస్వామ్య విజయం- సునీతా కేజ్రీవాల్
కేజ్రీవాల్ బెయిల్ పై విడుదల కావడం ప్రజాస్వామ్య విజయమని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తదితర పార్టీలు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కూడా ఇదే విధంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడం ఈ ఎన్నికల్లో ఎంతో దోహదం చేస్తుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం నిలదొక్కుకుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు.
కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, మే 10(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై స్పందించాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, నితేష్ రాణా వాదనలు వినిపించారు. ఈడీ తరఫున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుేస్సన్ వాదనలు వినిపించారు.