ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court : ఎన్నారై కోటా.. ఓ మోసం

ABN, Publish Date - Sep 25 , 2024 | 03:36 AM

విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్నారై కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

  • డబ్బులు దండుకునే ఎత్తుగడ: సుప్రీంకోర్టు

  • వైద్యకళాశాలల్లో ప్రవేశాలపై పంజాబ్‌ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్నారై కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది పూర్తిగా మోసమని, దీనికి తక్షణమే ముగింపు పలకాల్సి ఉందని పేర్కొంది. ప్రతిభావంతులను కాదని డబ్బు ఇచ్చేవారికి దొడ్డి దారిన ప్రవేశాలు కల్పించడానికి ఇది అవకాశం ఇస్తోందని మౌఖికంగా వ్యాఖ్యానించింది. చట్టవ్యతిరేకమైన ఈ పద్ధతిని సమర్థించలేమని తెలిపింది. వైద్య కళాశాలల ప్రవేశాల్లో ఎన్నారై కోటాపై పంజాబ్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టివేస్తూ పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థికి ఇచ్చిన నిర్వచనాన్ని విస్తరిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం ఆగస్టు 20న నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీని ప్రకారం ఎన్‌ఆర్‌ఐల దూరపు బంధువులు కూడా సీట్లు పొందడానికి అర్హులేనని తెలిపింది. తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, కజిన్స్‌ తదితరుల ‘సంరక్షణ’లో ఉన్నారన్న కారణం చూపి సీట్లు పొందే అవకాశం ఉంది. అయితే దుర్వినియోగానికి దారి తీస్తుందని పేర్కొంటూ హైకోర్టు దానిని కొట్టివేసింది.


ఇది ఎన్నారై కోటా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు భారతదేశంలో తమ పిల్లలను చదివించడానికి ఈ కోటాను ప్రవేశ పెట్టారని గుర్తు చేసింది. నిజమైన ఎన్నారై విద్యార్థులే దీని ప్రయోజనం పొందాల్సి ఉందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, మరో ఇద్దరు పిటిషనర్లు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు.

ఈ మూడు పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం విచారణ జరిపింది. పంజాబ్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నారై అభ్యర్థి విషయంలో హిమాచల్‌ ప్రదేశ్‌, యూపీ ఇతర రాష్ట్రాలు కూడా ఎప్పటి నుంచో ‘విస్తృత నిర్వచనా’న్నే ఉపయోగిస్తున్నాయని తెలిపారు. దీనిపై జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందిస్తూ ‘‘ఈ వాదనను తిరస్కరిస్తున్నాం. ఈ మోసానికి మూత పెట్టాల్సిన అవసరం ఉంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సంపూర్ణంగా సరైనవే. ఈ ఎన్నారై కోటా వ్యవహారం మోసం తప్ప ఇంకేమీ కాదు. పంజాబ్‌ ప్రభుత్వ చర్యలను చూడండి. ఆగస్టు 9న ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేసింది. 19న దాని గడువు ముగిసింది.


20న నోటిఫికేషన్‌ ఇచ్చి ‘సంరక్షకుల’ నిర్వచనాన్ని విస్తరించింది. దాని దుష్పరిణామాలను పరిశీలించండి. మూడు రెట్లు అధికంగా వచ్చిన అభ్యర్థులకు సీట్లు రావు. దొడ్డిదారిలో మాత్రం కొందరు ప్రవేశిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఎన్నారైల బంధువులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటారా? ఇది సొమ్ము పిండుకునే చర్య కాకపోతే ఇదేమిటిది? విద్యా వ్యవస్థను ఏమి చేయాలనుకుంటున్నారు? ఏ కేసును పరిశీలిస్తున్నారో న్యాయమూర్తులకు తెలుసు.

అందరికీ తెలిసిన విషయాన్నే హైకోర్టు పరిశీలించింది’’ అని అన్నారు. నిజమైన ఎన్నారైలకే సీట్లు ఇవ్వాలని, ఈ సందర్భంలోనూ మెరిట్‌ను విస్మరించకూదంటూ గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. జస్టిస్‌ పార్టీవాలా మాట్లాడుతూ ‘‘ఈ కోటా కింద దరఖాస్తు చేసిన వారంతా భారతీయులే. పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మల వంటి చుట్టరికాల పేర్లు చెప్పి దరఖాస్తు చేస్తున్నార’’ని అన్నారు. ‘విస్తృత నిర్వచనాన్ని’ ‘డబ్బు పిండే ఎత్తుగడ’గా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అంతకుముందు ఓ పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిమన్యు భండారి వాదనలు వినిపిస్తూ 700 మార్కులకుగాను 637 మార్కులు వచ్చిన అభ్యర్థికి సీటు రాలేదని, కానీ 202 మార్కులు వచ్చిన వారికి ఎన్నారై కోటాలో ప్రవేశం లభించిందని చెప్పారు. పంజాబ్‌లో ప్రతి ఒక్కరికీ ఎన్నారై బంధువులు ఉంటారని, వారి పేరుతో సీట్లు పొందే ప్రమాదం ఉందని తెలిపారు. దీనికి ముగింపు పలకాల్సి ఉందని కోరారు. పంజాబ్‌లోని మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 185 సీట్లు ఉండడం గమనార్హం.

Updated Date - Sep 25 , 2024 | 03:40 AM