సాధన అంటే...
ABN , Publish Date - Aug 29 , 2024 | 11:18 PM
‘‘ఎంతకాలం సాధన చేసినా... ఎక్కడికీ చేరుకోలేనట్టు అనిపిస్తోంది’’ అనే ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానం ఏమిటంటే... మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఎక్కడికీ వెళ్ళలేరు. వెళ్ళలేకపోవడం కాదు... అస్సలు వెళ్ళలేరు. ఎందుకంటే యోగం, ధ్యానం తదితర సాధనలు
‘‘ఎంతకాలం సాధన చేసినా... ఎక్కడికీ చేరుకోలేనట్టు అనిపిస్తోంది’’ అనే ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానం ఏమిటంటే... మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఎక్కడికీ వెళ్ళలేరు. వెళ్ళలేకపోవడం కాదు... అస్సలు వెళ్ళలేరు. ఎందుకంటే యోగం, ధ్యానం తదితర సాధనలు చేయడం వెనుక ఉన్న అంతరార్థం... ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇక్కడ ఉండగలిగే స్థితికి రావడం. ‘ఇక్కడ ఉన్నది ప్రతిచోటా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు’ అని అర్థం చేసుకోవడం. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరాన్ని దాటి వెళ్ళడమే సాధన. నిజానికి వెళ్ళేందుకు మరొక చోటంటూ ఏదీ లేదు. ఉన్నదల్లా ఇక్కడే... ఈ క్షణం మాత్రమే. మిగిలినదంతా మీ ఆలోచనల్లోనే ఉంది.
సాధన అనేది ఒక ఉపకరణం. మీలో పరిపక్వత తీసుకువచ్చి, మరెక్కడికో వెళ్ళాల్సిన అవసరాన్ని పోగొట్టే ఒక పద్ధతి. మీరు ఇక్కడ కూర్చుంటారా?, హిమాలయాల్లో లేదా ఆఫ్రికాలో, అమెరికాలో, ఉత్తర ధృవంలో, దక్షిణ ధృవంలో కూర్చుంటారా? అనేది ముఖ్యం కాదు. బహుశా కొన్ని ప్రదేశాలు అనుకూలంగా ఉండొచ్చు. కానీ అది ప్రధానం కాదు. సాధనలో... మీలో జరిగేదాన్ని మాత్రమే మీరు అనుభూతి చెందుతారు. ఉన్నది ఉన్నట్టుగా చూసే పరిపక్వ స్థాయికి మిమ్మల్ని చేర్చేదే సాధన.
సద్గురు జగ్గీ వాసుదేవ్