Share News

విలక్షణం... ఈ భగీరథ వృత్తాంతం

ABN , Publish Date - May 02 , 2024 | 11:06 PM

కృత్తివాస రామాయణం ప్రకారం... నాలుగు అంశలుగా ఉద్భవించాలని నారాయణుడు కోరుకున్నాడు. ఆ ప్రకారం ఆయన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా మారిపోయాడు. లక్ష్మీదేవి నారాయణుడికి ఎడమవైపు సీతగా ప్రత్యక్షమయింది.

విలక్షణం...  ఈ భగీరథ వృత్తాంతం

‘కృత్తివాస రామాయణం’ బెంగాలీలో కృత్తివాస ఓఝా రచించిన కావ్యం. ఆయన క్రీస్తుశకం పదిహేనో శతాబ్దానికి చెందిన కవి, పండితుడు.

ఈ కావ్యాన్ని ‘శ్రీరామా పాచాలీ’ (పాకాలీ) అని కూడా పిలుస్తారు. దీన్ని ‘గంగానదీ లోయ ప్రాంత బైబిల్‌’గా బెంగాలీ రచయిత, పరిశోధకుడు దినేశ్‌ చంద్రసేన్‌ అభివర్ణించారు. ఆధునిక బెంగాలీ సాహిత్యానికి పూర్వ యుగంలో... అత్యంత ప్రచారం పొందిన కావ్యంగా కృత్తివాసరామాయణాన్ని విమర్శకులు పరిగణిస్తారు. ఇందులోవర్ణితమైన భగీరథుడి కథ విలక్షణమైనది, వేరెక్కడా కనిపించనిది.

కృత్తివాస రామాయణం ప్రకారం... నాలుగు అంశలుగా ఉద్భవించాలని నారాయణుడు కోరుకున్నాడు. ఆ ప్రకారం ఆయన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా మారిపోయాడు. లక్ష్మీదేవి నారాయణుడికి ఎడమవైపు సీతగా ప్రత్యక్షమయింది.

అదే సమయంలో... నారాయణ మంత్రం జపిస్తూ వైకుంఠానికి వచ్చిన నారదుడు... ఆ అద్భుత దృశ్యాన్ని చూసి పరమానందభరితుడయ్యాడు. నారాయణుడి ప్రతి లీల వెనుకా ఒక రహస్యం ఉంటుందనే సంగతి నారదుడికి బాగా తెలుసు.

‘ఈ నాలుగు రూపాల వెనుక ఉన్న రహస్యం ఏమై ఉంటుంది?’ అని ఆలోచించాడు. కానీ ఆ కారణమేమిటో నారదుడికి అంతుపట్టలేదు. ‘నాకు తెలియకపోతేనేం? ఆ ముక్కంటికి తెలిసే ఉంటుంది’ అనుకుంటూ నేరుగా కైలాసానికి చేరుకున్నాడు. తనతోపాటు తన తండ్రి బ్రహ్మను కూడా తీసుకువెళ్ళాడు. వారిద్దరినీ చూసి ప్రసన్నుడైన శివుడు... ‘‘మీ రాకకు కారణమేమిటి?’’ అని అడిగాడు.

వైకుంఠంలో తను చూసిన దృశ్యాన్ని నారదుడు వివరించాడు. ఒక అంశ నాలుగు అంశలుగా ఎలా మారిందో తెలియజేయమన్నాడు. శంకరుడు చిరునవ్వు చిందిస్తూ ‘‘అరవై వేల ఏళ్ళ తరువాత... త్రేతాయుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం నారాయణుడు రఘు వంశంలో దశరథుడి పెద్ద కుమారునిగా జన్మిస్తాడు.

రావణాది రాక్షసులను సంహరించడానికి అవతరిస్తాడు. ఆ దృశ్యాన్నే నువ్వు ముందుగా చూశావు’’ అని చెప్పాడు. సగరుడి మునిమనుమడైన దిలీపుడు సంతానహీనుడిగా స్వర్గస్తుడవడం, భగీరథుడి జననం... శంకరుని ఈ భవిష్యవాణితో ముడిపడి ఉంది.

రఘువంశానికి చెందిన, అయోధ్యకు రాజైన సగరుడు అశ్వమేధ యాగాన్ని చేపట్టాడు. యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు తరలించుకుపోయి... పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమంలో కట్టిపడేశాడు. సగరుడి ఆదేశంతో అతని అరవైవేల మంది కుమారులు యజ్ఞాశ్వాన్ని వెతుకుతూ... భూమిని తవ్వి పాతాళానికి చేరుకుంటారు.

కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేసి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి, దాన్ని కపిలుడే దొంగిలించాడనుకొని, ఆయనను నిందిస్తారు. ఆ మహర్షి కోపాగ్నికి భస్మమైపోతారు. వారితో పాటు యజ్ఞాశ్వాన్ని వెతికి తెమ్మని తన పెద్దకొడుకైన అసమంజసుణ్ణి సగరుడు ఆదేశిస్తాడు. అన్ని చోట్లా గాలిస్తున్న అసమంజసుడు పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకొని, యజ్ఞాశ్వాన్ని చూసి, జరిగిందంతా తెలుసుకుంటాడు. తన సోదరులకు పుణ్యగతులు ఎలా ప్రాప్తిస్తాయో చెప్పాల్సిందిగా కపిలుణ్ణి వేడుకుంటాడు. అసమంజసుడిపై దయతలచిన కపిలుడు..... దివిలో ప్రవహించే గంగానది ఆ అరవై వేలమంది సగర పుత్రుల మీద ప్రవహిస్తే... వారికి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని చెబుతాడు.

గంగను కిందకు తీసుకువచ్చే ప్రయత్నంలో అసమంజసుడు, అతని కుమారుడు అంశుమంతుడు మరణిస్తారు. అనంతరం అంశుమంతుడి కుమారుడు దిలీపుడు సంతానం లేకుండానే మరణిస్తాడు. దీనితో రఘు వంశానికి వారసుడు కరువవుతాడు.

తాను రఘువంశంలో దశరథుడి కుమారుడిగా జన్మించి, భూభారాన్ని తగ్గిస్తానని కొన్ని వేల ఏళ్ళ క్రితమే దేవతలకు నారాయణుడు మాట ఇచ్చాడు. వారసుడు లేకపోతే... నారాయణుడి మాట అసత్యం అవుతుంది. అలా జరిగితే భూమి నాస్తికమయం అవుతుంది. ధర్మం పట్ల ప్రజల మనసులో విశ్వాసం తగ్గుతుంది. దీనికి తరుణోపాయం తెలపాలని బ్రహ్మాది దేవతలు పరమశివుణ్ణి వేడుకుంటారు.


శంకరుడు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. తన ప్రణాళిక ప్రకారం అయోధ్యకు చేరుకుంటాడు. దిలీపుడి భార్యలు చంద్ర, మాల... శివుడికి స్వాగతం చెబుతారు. భక్తి శ్రద్ధలతో పరిచర్యలు చేస్తారు.

సంతృప్తుడైన శివుడు... ‘‘మీలో ఒకరు త్వరలో గర్భం దాల్చి, పండంటి కుమారుడికి జన్మనిస్తారు’’ అని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీస్సు విని వాళ్ళు దిగ్ర్భాంతి చెందుతారు. ‘‘స్వామీ! ఇది ఎలా సంభవం?’’ అని అడుగుతారు. ‘‘ఇది దైవ సంకల్పం. మీ ఇద్దరి మధ్య జరిగే కలయిక కారణంగా పుత్రుడు జన్మిస్తాడు’’ అని చెప్పి, శివుడు కైలాసానికి చేరుకుంటాడు.

అప్పటికే ఋతుస్రావం ఆగిపోయిన మాలకు ... శివుడి ఆశీస్సుల కారణంగా నెలసరి అవుతుంది. చంద్ర, మాలల కలయిక జరిగి, మాల గర్భం దాలుస్తుంది. పది నెలల తరువాత... ఎముకలు లేని పిండానికి జన్మనిస్తుంది. ఎముకలు లేకపోవడం వల్ల ఆ పిండం నడవలేకపోతుంది. ఆ మాంసం ముద్దను చూసి చంద్ర, మాల విలపిస్తారు. ‘శివుడు వరమిచ్చాడా, శాపమిచ్చాడా’ అనేది తేల్చుకోలేకపోతారు. పిండం పెరిగి పెద్దదైతే అభాసుపాలవుతామని భయపడతారు.

ఆ పిండాన్ని కొంగుచాటున దాచుకొని సరయూ నదీ తీరానికి చేరుతారు. దాన్ని నదిలో పారేయాలనుకుంటున్న వారిద్దరినీ వశిష్టుడు చూస్తాడు. దివ్యదృష్టితో అంతా తెలుసుకుంటాడు. ఆ పిండం రఘువంశ వారసుడని గ్రహిస్తాడు.

రఘువంశ పురోహితుడిగా... ఆ వంశ వారసుణ్ణి కాపాడడం తన విద్యుక్త ధర్మంగా భావించి... ‘‘మీరు ఆ పిండాన్ని ఒడ్డునే వదిలిపెట్టండి. దారిన పోయేవారెవరైనా దాన్ని కాపాడగలరు’’ అని చెప్పి వెళ్ళిపోతాడు. చంద్ర, మాల ఆ విధంగా చేస్తారు.


అప్పుడు సరయూ నదిలో స్నానం చేయడానికి అష్టావక్ర మహర్షి వస్తాడు. అష్టావక్రుడి శరీరంలోని ఎనిమిది వంకరల కారణంగా... ఆయన వంకరటింకరగా నడుస్తూ ఉంటాడు. ఎముకలు లేని పిండం కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. ఆ పిండం తన నడకను అనుకరిస్తోందని అష్టావక్రుడు అనుమానిస్తాడు. ‘అది నన్ను వెక్కిరిస్తూ ఉంటే భస్మం అవుతుంది. అలా కాకుండా... జన్మతః అలాగే ఉంటే... నా తపోబలం వల్ల సుందర రూపం దాల్చుతుంది’ అనుకుంటాడు. పుట్టుకతోనే ఎముకలు లేని ఆ పిండం... అష్టావక్రుడి తపోబలం వల్ల సుందరమైన బాలుడిగా మారుతుంది. ఆ బాలుడు తన తల్లులను కలిసి, జరిగిన విషయం తెలియజేస్తాడు.

అయిదేళ్ళ వయసులో... ఆ బాలుణ్ణి విద్యాభ్యాసం కోసం వశిష్టుడి ఆశ్రమంలో చేరుస్తారు. ఆశ్రమంలోని కొందరు బాలురు అతని పుట్టుకను ఎగతాళి చేస్తారు. కోపంతో ఇంటికి చేరిన కుమారుడి ద్వారా... జరిగింది తెలుసుకున్న ఆ తల్లులు... అతని జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తారు. రెండు భగాల మధ్య కలయిక కారణంగా జన్మించిన వాడు కాబట్టి అతను భగీరథుడయ్యాడనేది... కృత్తివాస రామాయణంలోని భగీరథ వృత్తాంతం.

డాక్టర్‌ ఎ.బి సాయిప్రసాద్‌

9980567541

మూలాలు బెంగాలీ పద్మ పురాణంలో...

‘భగీరథుడు ద్వియోనిజుడు’ అనే అంశాన్ని బెంగాలీ లిపిలో ఉన్న ‘పద్మ పురాణం’ నుంచి కృత్తివాసుడు తీసుకున్నాడు. రెండు భగాల మధ్య సంభోగం సంభవం అనే విషయాన్ని గురించి రుత్‌ వనిత, సలీం కిద్వాయ్‌ అనే ఇద్దరు విద్యావేత్తలు ప్రధానంగా పరిశోధన చేశారు. పధ్నాలుగో శతాబ్దానికి చెందిన బెంగాలీ ధార్మిక గ్రంథాలలో... ఇద్దరు మహిళల మధ్య కలయిక సంభవమని సూచించే గ్రంథాలు ఉన్నాయని అమెరికా మోన్‌టానా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ అయిన రత్‌ వనిత ‘సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ అండ్‌ హిందూ ట్రెడిషన్స్‌’ అనే గ్రంథంలో వివరించారు.

కృత్తివాసుడు దీన్ని ‘పద్మ పురాణం’ నుంచి గ్రహించాడనీ, ‘సుశ్రుత సంహిత’లో ఇద్దరు స్త్రీల మధ్య జరిగే కలయిక కారణంగా ఒకరిలో ఫలదీకరణ జరుగుతుందనీ రాసి ఉందనీ ఆమె పేర్కొన్నారు.

కవిరాజ్‌ కుంజాలాల్‌ భిషగ్రత్న ఆంగ్లంలోకి అనువదించిన ‘సుశ్రుత సంహిత’ (చౌకంబా సంస్కృత సిరీస్‌-39, 135వ పేజీ) నుంచి కొన్ని పంక్తులను ఉదాహరణగా కూడా చూపించారు. ద్వియోని సంభవుడైన భగీరథ వృత్తాంతాన్ని చర్చిస్తున్న సందర్భంలోనే... మరో విషయం గురించి కుడా రుత్‌ వనిత ప్రస్తావిస్తూ ‘‘మేము వితంతువులం.

మాకు సంతానం ఎలా కలుగుతుందని శివుణ్ణి చంద్ర, మాల ప్రశ్నించినట్టే... మేరీ మాత కూడా ‘‘నేను పురుషుణ్ణి ఎరుగను, ఇదెలా జరుగుతుంది?’’ అని దేవదూతను ప్రశ్నిస్తుంది.

అప్పుడు దేవదూత ‘‘పరిశుద్ధాత్మ నీపైకి వస్తుంది. సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకుంటుంది’’ అని (బైబిల్‌, లూకా- 1:34, 35) చెబుతాడు’’ అని పేర్కొన్నారు.

భగీరథుడు ద్వియోని సంభవుడనే వృత్తాంతం నాకు తెలిసినంతవరకూ ఏ భారతీయ రామాయణంలోనూ లేదు. అవధి భాషలో రామాయణాన్ని ‘రామచరితమానస్‌’ అనే పేరుతో రచించిన తులసీదాసు... బెంగాలీ కృత్తివాస రామాయణం నుంచి కొంతవరకూ ప్రభావితుడయ్యాడనేది విమర్శకుల అభిప్రాయం. (ఆధారం: కృత్తిపాస రామాయణం, ఆదికాండం, హిందీ అనువాదం. అనువాదకులు: యోగేశ్వర త్రిపాఠి యోగి, ప్రబంధ్‌కుమార్‌ మజుందార్‌, నవారుణ వర్మ)

Updated Date - May 03 , 2024 | 06:19 AM