Lok Manthan: శిల్పారామంలో ఘనంగా లోక్ మంథన్
ABN , Publish Date - Nov 22 , 2024 | 08:48 AM
హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ 2024 పేరుతో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు కళాకారులు పాల్గొన్నారు. శిల్పారామంలో లోక్ మంథన్ భారతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగరం వేదిక అయింది.
జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో గురువారం శిల్పారామంలో జానపద జాతర ప్రారంభమైంది. ఆ ప్రాంగణమంతా దేశ, దేశాల ప్రతినిధులు, సంగీత, నృత్య కళా బృందాలతో కోలాహలంగా మారింది.
తండా జీవన కళాకృతులు, వివిధ సంస్కృతులకు ఆధారమైన పనిముట్లు, జానపద వస్తు ప్రదర్శనలు, గిరిపుత్రుల ఉత్పత్తుల స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 'లోక్ మంథన్' పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన 'జానపద జాతర' హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనుంది.
భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. రాతిలోనూ ప్రాణిలోనూ.. అలాగే గాలి, నీరు, నింగి, నేల, నిప్పులోనూ భగవంతుడిని చూస్తామని.. ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
‘‘చీమకు చక్కెరపెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు పసుపుపెట్టి, ప్రకృతికి దండం పెట్టే పవిత్రమైన జాతి మనది.. హిందూ ఽధర్మం మనది. దురదృష్టవశాత్తు పాశ్చాత్య వ్యామోహం వైపు వెళుతున్నాం’’ అని విచారం వ్యక్తం చేశారు.
ఇంగ్లిషు వాళ్లు దండయాత్ర చేసి.. బంగారం, వజ్రవైఢుర్యాల రూపంలో ఆర్థికంగా మనల్ని దోచుకెళ్లడమే కాకుండా మన మనసులనూ దోచుకెళ్లారని.. ఆ కారణంగా మన సాహిత్యం, సంగీతం, వాయిద్యం, భాష, సంస్కృతులను మరిచిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో మళ్లీ భారతీయ మూలాలకు మనం వెళ్లాలి అని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటుచేసిన లోక్‌మంథన్-2024లో భాగంగా గిరిజన సంప్రదాయ వాయిద్యాల ఎగ్జిబిషన్‌ను వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో కలిసి ప్రారంభించారు.
మన పూర్వీకులు అందించిన సంస్కృతిని పరిరక్షించుకోవాలన్నారు. ఒకప్పుడు సంగీతం, సాహిత్యం, వాయిద్యం ఉండేవని.. ఇప్పుడవి పోయి.. జింగిరి బింగిరి సాహిత్యం, సంగీతంతో పాటలు వస్తున్నాయని... మన సంస్కృతిని, భాషను మరచిపోవడమే దీనికి కారణమని వివరించారు.
ఇంగ్లిషుపై వ్యామోహం పనికిరాదన్నారు. తొలి ప్రాధాన్యం మాతృభాషకు ఇవ్వాలని.. అమ్మభాష కంటిచూపు అయితే ఇంగ్లిషు కళ్లజోడులాంటిందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ మాతృభాషలోనే చదువుకున్నారని, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తానూ వీధిబడిలో తెలుగులోనే చదువుకున్నానని చెప్పారు.
శక్తి సామర్థ్యాలు, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం ఉండాలిగానీ, పాశ్యాత్య వ్యామోహం కాదని హితవు పలికారు. తాను ఉపరాష్ట్రపతి అయ్యాక వేషఽధారణ (డ్రెస్) మార్చుకుంటారా? అని నన్ను అడిగితే, అది మార్చుకునే ప్రసక్తేలేదని, అడ్రస్ మాత్రమే మారిందని చెప్పినట్లు గుర్తుచేశారు. కుటుంబ వ్యవస్థ, పెళ్లిళ్లు విచ్ఛిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలని పిలుపునిచ్చారు.
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రజ్ఞావాహ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. లోక్‌మంథన్ భారతీయ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమమని.. రాజకీయాలకు అతీతమైనది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
ఆరెస్సెస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ మూడు రోజుల పాటు ఇందులో పాల్గొంటారని, కుటుంబ వ్యవస్థ, దాని ప్రాధాన్యం, సామాజిక సామరస్యం, స్వదేశీ తదితర అంశాలపై మార్గదర్శనం చేస్తారని చెప్పారు. లోక్ మంథన్‌లో ప్రముఖ కళాకారులు, మేధావులు, ఆర్టిస్టులు, ఆలోచనాపరులు, పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొంటారని తెలిపారు.
ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. మన సంస్కృతి, జీవనవిధానం ధ్వంసం కావడం వల్లే రోగాలు వస్తున్నాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
తెలంగాణ చరిత్ర సుసంపన్నమైనదని.. రాష్ట్రం మినీ ఇండియా. అన్ని రాష్ట్రాల పండుగలను, కళలను తెలంగాణ గౌరవిస్తూ. భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుసరిస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజ్ఞాప్రవాహ్ జాతీయ ప్రధాన కార్యదర్శి నందగోపాల్, లోక్‌మంథన్-2024 వర్కింగ్ ప్రెసిడెంట్, డాక్టర్ టి. హనుమాన్‌చౌదరి, మాడ్గుల నాగఫణిశర్మ, వివిధ రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు.
18 అడుగుల పొడవు, బరువేమో 37.23 కేజీలు.. పూర్తిగా ఇత్తడితో తయారుచేసిన బాల్‌పాయింట్ పెన్ను ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజామాబాద్‌కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మాకునూరి శ్రీనివాస ఆచార్య 2011లో ఈ పెన్నును కళాకారులు శ్రీనివాస్, రత్నం సహకారంతో రూపొందించారు.
అదే ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద కలంగా గుర్తింపు పొందడంతోపాటు గిన్నిస్ వరల్డ్ రికార్డుకు దక్కించుకుంది. పెన్నుతో పాటు ఒక అడుగు పొడవుగల రీఫిల్ కూడా తయారుచేశారు. దీనికోసం కెమెల్ కంపెనీ ప్రత్యేకంగా ఇంక్‌బాటిల్ పంపించినట్లు ఆచార్య చెప్పారు.
తలమీద నెమలీకల బొమిడికం ధరించి, మువ్వల దండ చేతపట్టి, ఒళ్లంతా రామనామం పచ్చబొట్టుతో కనిపిస్తున్న వీరంతా ఛత్తీ్‌సగఢ్‌లోని సారంగర్-బిలాయిగర్, బిలా్‌సపూర్ పరిసర ప్రాంతాలకు చెందిన రామనామి సమాజ్ గిరిజనులు. లోక్‌మంథన్‌లో వీరి ఆహార్యంతో పాటు రామనామ కీర్తనల ఆలాపన సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది.
ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన సంత్ పరుశురాం 1890లో రామనామి సమాజ్‌ను ప్రారంభించారు. అది ఆనాటి నుంచి భక్తి ఉద్యమంగా కొనసాగుతోంది.
నుదిటిపై ‘రామ’ నామాన్ని పచ్చబొట్టు వేయించుకోవడంతోపాటు రామాయణాన్ని ఆలపించడం రామనామి సమాజికుల జీవనవిధానంలో భాగం. దురలవాట్లకు దూరంగా ఉంటూ రామనామాన్ని స్మరించుకోవడమే వారి భక్తి మార్గం. కొందరు నుదిటి మీద, మరికొందరు ఒళ్లంతా రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుంటారని గురుమాత సేత్‌బాయిరామనామి తెలిపారు.
వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, దాదాపు 1500 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.
Updated Date - Nov 22 , 2024 | 02:30 PM