Lok Sabha Polls: ఓ వైపు మండుతున్న ఎండలు.. మరోవైపు యువ హవా!!
ABN, Publish Date - May 02 , 2024 | 03:55 PM
ఎండలు మండిపోతుండడంతోపాటు మరోవైపు గ్రేటర్‌లో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ సమీపిస్తుండడంతో అభ్యర్థులు తీవ్రంగా చెమటోస్తున్నారు. మండే ఎండను లెక్క చేయకుండా గెలుపునకు శ్రమిస్తున్నారు..
ప్రధాన పార్టీలకు అండగా యువజన సంఘాలు
సోషల్ మీడియా, ఇంటింటి ప్రచార జోరు
ప్రచారంలో అనుబంధ సంఘాల దూకుడు
తమ పార్టీకే మద్దతు తెలపాలని వేడుకోలు
కష్టపడిన వారికి భవిష్యత్తుపై నేతల హామీలు
అసంతృప్తులను కలుపుకుని మరింత ముందుకు
గ్రేటర్‌లో పెరిగిన పార్టీల ప్రచార వే‘ఢీ’
సాధారణ ప్రజలు, మహిళలు ప్రభావితం
హైదరాబాద్ సిటీ, మే 2 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతుండడంతోపాటు మరోవైపు గ్రేటర్‌లో పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ సమీపిస్తుండడంతో అభ్యర్థులు తీవ్రంగా చెమటోస్తున్నారు. మండే ఎండను లెక్క చేయకుండా గెలుపునకు శ్రమిస్తున్నారు. పార్టీలో అసంతృప్తులను కలుపుకొని పోవడంతోపాటు అనుబంధ, యువజన సంఘాల నాయకులను ప్రచారంలో భాగస్వాముల్ని చేస్తున్నారు. దీంతో ప్రచారంలో ఎక్కడ చూసినా యువత హవా కనిపిస్తోంది. వీరు ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. భగభగలను సైతం తట్టుకొని భవిష్యత్తు మీద ఆశలతో శ్రమిస్తున్నారు.
గ్రేటర్‌పై పట్టు బిగించేలా..
ఓటరు జాబితా ప్రకారం వివిధ సామాజిక వర్గాలను కలుసుకుంటూ, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన అనుబంధ సంఘాలకు చెందిన యువతీ, యువకులు ఉత్సాహంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుండడం ఆసక్త్తికరంగా మారింది. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఎదుటి పార్టీ విధానాలను ఎండగట్టడంతోపాటు కరపత్రాలతో గడపగడపకు తిరుగుతున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ స్థానాన్ని బీజేపీ, మల్కాజిగిరిలో కాంగ్రెస్, చేవెళ్ల స్థానాన్ని బీఆర్‌ఎస్, హైదరాబాద్‌ను మజ్లిస్ కైవసం చేసుకుంది. గ్రేటర్ ఓటర్లు నాలుగు పార్టీలకు ఒక్కో సీటును ఇవ్వడంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రధానంగా ఆ సమయంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఒకే స్థానానికి పరిమితం కావడం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలకు చెందిన యువతీ, యువకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
సాధారణ ప్రజలు, మహిళలే లక్ష్యంగా..
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎ్‌సలకు చెందిన యువతీ, యువకులు 20 రోజుల నుంచే సోషల్ మీడియా ద్వారా తమ పార్టీని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేసేందుకు మీరంతా సహకరించాలంటూ బీజేవైఎం, ఏబీవీపీకి చెందిన యువ నాయకులు కోరుతున్నారు. కాగా, రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రంలో మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రె్‌సకు మరింత మద్దతు ఉండాలంటే.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉండాలని యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు ఓటు అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకొచ్చినా పార్లమెంట్‌లో తెలంగాణ గొంతును వినిపించేందుకు బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, లేకుంటే మన హక్కులను పూర్తిగా కోల్పోవాల్సి వస్తోందని బీఆర్‌ఎ్‌సవీ నేతలు ప్రచారంలో వివరిస్తున్నారు. సాధారణ ప్రజలు, మహిళలు, కూలీలే లక్ష్యంగా ఓట్లను అభ్యర్థిస్తుండడం విశేషం. ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 8 మందితో కూడిన మూడు, నాలుగు బృందాలు తిరుగుతూ ఓట్ల వేటలో నిమగ్నమయ్యాయి.
భవిష్యత్‌లో ఉన్నత పదవులకు హామీ
ఆయా పార్టీల అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థుల ప్రచారంతో ఏ పార్టీకి నష్టం ? ఎవరికి లాభం ? అన్నదానిపై స్థానికంగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ ఓట్లను దక్కించుకునేలా వారు ముందుకు సాగుతున్నారు. కాగా, పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషిచేసే వారికి ‘భవిష్యత్’లో ఉన్నత పదవులు కల్పిస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్య నాయకులు హామీ ఇస్తుండడంతో యువత ఉత్సాహంగా దూసుకపోతున్నారు. కొంతమంది మండే ఎండలను తట్టుకొని తిరుగుతూ అభ్యర్థుల మన్ననలు పొందుతున్నారు.
Updated Date - May 02 , 2024 | 04:41 PM