Magha Masam 2024: మాఘ మాసం వచ్చేసింది.. మంచి ముహూర్తాలు ఎప్పుడెప్పుడున్నాయంటే..?
ABN , Publish Date - Feb 11 , 2024 | 11:26 AM
Magha Masam : ‘శ్రీరస్తూ.. శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’. ప్రతీ ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఘట్టం పెళ్లి.. అటువంటి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే.. ఎవరైనా వెంటనే చెప్పే మాసం.. మాఘమాసం.. ఎందుకంటే పెళ్లిళ్లకు పెట్టింది పేరు మాఘ మాసం ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలోను ఉండవని పండితులు, పురోహితులు చెబుతున్నారు..
‘శ్రీరస్తూ.. శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’. ప్రతీ ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఘట్టం పెళ్లి.. అటువంటి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే.. ఎవరైనా వెంటనే చెప్పే మాసం.. మాఘమాసం.. ఎందుకంటే పెళ్లిళ్లకు పెట్టింది పేరు మాఘ మాసం ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలోను ఉండవని పండితులు, పురోహితులు చెబుతున్నారు. అందుకే అందరూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ మాసంలోని ముహూర్తాల్లో పెళ్లిళ్లు చేసుకుంటే.. దాంపత్య జీవితం నిండు నూరేళ్ల పాటు సుఖ, సంతోషాలతో ఉంటుందని పురోహితులు చెబుతున్నారు.
ఎదురుచూపులు ఇక వద్దు!
పూజలు.. ఇళ్లలో శుభకార్యాలు వంటివాటికి పెట్టిందిపేరు మాఘమాసం. వీటిలో ప్రధానంగా వివాహాలకు శుభప్రదమైన మాసంగా పేర్కొంటుంటారు. పురాణాల్లోనూ మాఘమాసానికి విశేష ప్రాశస్త్యం ఉంది. త్రేతాయుగంలో రామసేతును మొదలుపెట్టింది, ద్వాపర యుగం ఆరంభమైంది కూడా ఈ మాసంలోనేనని పురాణాలు చెబుతున్నాయి. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమినాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు వర్తిస్తుంది. పౌర్ణమినాడు మఘ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది. శూన్య పుష్యమాసం తర్వాత వచ్చే కల్యాణకారక మాసం ఇది. అందుకే ఈ మాసంలో వివాహాలు నిర్వహించేందుకు అనేకమంది నెలలతరబడి ఎదురుచూస్తుంటారు. వైశాఖ, కార్తీక మాసాల తరహాలోనే ఈ మాఘమాసంలోనూ స్నానాదులకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. శనివారం నుంచి మాఘమాసం ఆరంభమైన నేపథ్యంలో ప్రతి ఇల్లు సందడిగా మారనుంది. ఈ మాసంలో శుభముహూర్తాలుండడంతో వేలాది వివాహాలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, నామకరణం వంటి శుభాకార్యాలూ జరగనున్నాయి.
మాఘస్నానాలు శుభప్రదం..
తెలిసీ తెలియక చేసిన పాపదోషాలు తొలగించుకునేందుకు మాఘస్నానాలు శుభప్రదం. ఈ మాసంలో చేసే నదీస్నానం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో వచ్చే ప్రతిరోజూ ఒకో విశిష్ఠతను కలిగి ఉన్నాయి. ఈ నెల 11, 12, 14, 16, 21, 22, 28, 29, మార్చి 6, 8వ తేదీలు వివాహాలకు అత్యంత శుభప్రదమైన రోజులు. వీటిలో మరీ ముఖ్యంగా 14, 29వ తేదీలు బలమైన ముహుర్తాలున్నందున ఈ తేదీల్లో వేలసంఖ్యలో వివాహాలు జరిగే అవకాశముంది. - ఆలూరు లక్ష్మీనరసింహశాస్త్రి, పురోహితుడు.