Share News

India vs South Africa: రాణించిన విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - Jun 29 , 2024 | 09:46 PM

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం భారీ స్కోరు చేయలేదు కానీ, గౌరవప్రదమైన స్కోరు...

India vs South Africa: రాణించిన విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం భారీ స్కోరు చేయలేదు కానీ, గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (76) అర్థశతకంతో రాణించడంతో పాటు అక్షర్ పటేల్ (47), శివమ్ దూబే (27) చితక్కొట్టడంతో.. భారత్ అంత స్కోరు చేసి, సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టుకి ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. 23 పరుగుల వద్ద రోహిత్ శర్మ (9) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే రిషభ్ పంత్ (0), సూర్యకుమార్ (3) కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగినట్లయ్యింది. అలాంటి సమయంలో.. కోహ్లీతో కలిసి అక్షర్ పటేల్ (47) మెరుగైన ఇన్నింగ్స్ ఆడి జట్టుని ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు. ఓవైపు కోహ్లీ నిదానంగా రాణిస్తే, మరోవైపు అక్షర్ అవకాశం దొరికినప్పుడల్లా భారీ షాట్లతో చెలరేగి ఆడాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.


అక్షర్ ఔట్ అయ్యాక కోహ్లీ తన బ్యాట్ ఝుళపించడం మొదలుపెట్టాడు. అప్పటివరకూ ఆచితూచి ఆడిన కోహ్లీ.. చివర్లో ఉగ్రరూపం దాల్చాడు. సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు. కానీ.. అదే దూకుడు భారీ షాట్ కొట్టబోయి, క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు పడినా, స్కోరు కూడా వచ్చింది. దీంతో.. భారత్ 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. ఇది మంచి స్కోరే అయినా.. సౌతాఫ్రికా లాంటి పెద్ద జట్టుకి పెద్ద స్కోరైతే కాదు. కాబట్టి.. దీనిని డిఫెంట్ చేసుకోవాలంటే, భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. మరి.. బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి.

Updated Date - Jun 29 , 2024 | 09:46 PM