Share News

India vs Bangladesh: కలిసికట్టుగా కదం తొక్కగా..

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:29 AM

టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌ అజేయ ఆటతీరు కొనసాగుతోంది. అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో శనివారం గ్రూప్‌ 1లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టోర్నీలో జట్టుకిది వరుసగా ఐదో విజయం కాగా.. సూపర్‌-8లో రెండోది. దీంతో తమ గ్రూప్‌లో 4 పాయింట్లతో టాప్‌లో నిలవడంతో పాటు

India vs Bangladesh: కలిసికట్టుగా కదం తొక్కగా..

టీ20 వరల్డ్‌కప్‌

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయం

నార్త్‌ సౌండ్‌: టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌ అజేయ ఆటతీరు కొనసాగుతోంది. అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో శనివారం గ్రూప్‌ 1లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టోర్నీలో జట్టుకిది వరుసగా ఐదో విజయం కాగా.. సూపర్‌-8లో రెండోది. దీంతో తమ గ్రూప్‌లో 4 పాయింట్లతో టాప్‌లో నిలవడంతో పాటు సెమీఫైనల్‌ బెర్త్‌ను కూడా దాదాపు ఖాయం చేసుకుంది. మరోవైపు ఆస్ర్టేలియా జట్టు అఫ్ఘాన్‌పై గెలిస్తే భారత్‌తో పాటు ఆసీస్‌ కూడా సెమీస్‌ చేరుతుంది. ఇక రెండు ఓటములతో ఉన్న బంగ్లాదేశ్‌ సాంకేతికంగా టోర్నీలోనే ఉన్నా ముందుకెళ్లడం అసాధ్యమే. మ్యాచ్‌లో ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్‌), కోహ్లీ (28 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 37), పంత్‌ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36), దూబే (24 బంతుల్లో 3 సిక్సర్లతో 34) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. తన్‌జీమ్‌, రిషాద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేసి ఓడింది. షంటో (40), తన్‌జీద్‌ (29), రిషాద్‌ (24) మాత్రమే రాణించారు. కుల్దీ్‌పనకు మూడు.. బుమ్రా, అర్ష్‌దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హార్దిక్‌ పాండ్యా నిలిచాడు.

పోరాటమే లేదు..: భారీ ఛేదనలో బంగ్లా బ్యాటర్లను భారత్‌ బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. ముఖ్యంగా స్పిన్నర్‌ కుల్దీప్‌ మధ్య ఓవర్లలో తడాఖా చూపించడంతో మిడిలార్డర్‌ కుదేలైంది. ఓపెనర్లు లిట్టన్‌ (13), తన్‌జీద్‌ ఓ మాదిరి ఆటతీరుతో తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. ఐదో ఓవర్‌లో లిట్టన్‌ను హార్దిక్‌ అవుట్‌ చేశాడు. కానీ కుల్దీప్‌ తన వరుస ఓవర్లలో తన్‌జీద్‌, తౌహీద్‌ (4), షకీబ్‌ (11) వికెట్లను తీయడంతో 98/4తో బంగ్లా ఆట పూర్తిగా లయ తప్పింది. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. 19వ ఓవర్‌లో రిషాద్‌ను బుమ్రా అవుట్‌ చేయడంతో బంగ్లాకు భారీ ఓటమి తప్పలేదు.

సమష్టిగా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో ఈసారి బ్యాటింగ్‌ విభాగం అదరగొట్టింది. సూర్య మినహా క్రీజులోకి వచ్చిన ప్రతీ ఆటగాడు బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు 200 చేరువకు వచ్చింది. విఫలమవుతున్న విరాట్‌, దూబే సైతం ఆకట్టుకోగా.. హార్దిక్‌ ధనాధన్‌ ఆటతో అజేయ హాఫ్‌ సెంచరీతో నిలిచాడు. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్‌ (23), విరాట్‌ జోరును చూపారు. నాలుగో ఓవర్‌లోనూ రోహిత్‌ 6,4తో ధాటిని ప్రదర్శించినా షకీబ్‌ వేసిన ఫుల్లర్‌ బంతికి క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తాజా టోర్నీలో ఈ వికెట్‌కు భారత్‌ నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. అటు ముస్తాఫిజుర్‌ ఓవర్‌లో కోహ్లీ సిక్సర్‌తో పవర్‌ప్లేలో జట్టు 53/1 స్కోరు సాధించింది. ఇక వచ్చీ రాగానే సిక్సర్‌ బాదిన సూర్యకుమార్‌ (6)ను తన్‌జీమ్‌ పెవిలియన్‌ చేర్చాడు. పంత్‌ మాత్రం తన ధాటిని కొనసాగించినా, ఆ తర్వాత స్పిన్నర్‌ రిషాద్‌కు చిక్కడంతో నాలుగో వికెట్‌కు దూబేతో 31 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో హార్దిక్‌ దూకుడుతో తిరిగి స్కోరు గాడిన పడింది. ఇక ఆరంభంలో నిదానంగా ఆడిన దూబే తర్వాత భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలువకుండా రిషాద్‌ ఓవర్‌లో బౌల్డయ్యాడు. అప్పటికే ఐదో వికెట్‌కు వీరి మధ్య 34 బంతుల్లోనే 53 పరుగులు జత చేరాయి. అటు ఆఖరి ఓవర్‌లో పాండ్యా ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. చివరి ఐదు ఓవర్లలో జట్టు 62 రన్స్‌ సాధించడం విశేషం.

టీ20 ప్రపంచక్‌పలో 50 వికెట్లు పూర్తి చేసిన

తొలిబౌలర్‌గా షకీబ్‌

వరల్డ్‌క్‌పల్లో (టీ20, వన్డే) 3వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్‌

ఈ మైదానంలో జరిగిన టీ20ల్లో ఇదే అత్యధిక

స్కోరు (196)

టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలోని ఓ మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు (13) బాదిన జట్టుగా భారత్‌.

స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) జాకర్‌ (బి) షకీబల్‌ 23, కోహ్లీ (బి) తన్‌జీమ్‌ 37, పంత్‌ (సి) తన్‌జీమ్‌ (బి) రిషాద్‌ 36, సూర్యకుమార్‌ (సి) లిట్టన్‌ (బి) తన్‌జీమ్‌ 6, దూబే (బి) రిషాద్‌ 34, హార్దిక్‌ (నాటౌట్‌) 50, అక్షర్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 196/5; వికెట్ల పతనం: 1-39, 2-71, 3-77, 4-108, 5-161; బౌలింగ్‌: మెహ్దీ హసన్‌ 4-0-28-0, షకీబల్‌ 3-0-37-1, తన్‌జీమ్‌ 4-0-32-2, ముస్తాఫిజుర్‌ 4-0-48-0, రిషాద్‌ 3-0-43-2, మహ్మదుల్లా 2-0-8-0.

బంగ్లాదేశ్‌: లిట్టన్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 13, తన్‌జిద్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 29, షంటో (సి) అర్ష్‌దీప్‌ (బి) బుమ్రా 40, హ్రిదయ్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 4, షకీబల్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 11, మహ్మదుల్లా (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 13, జాకర్‌ అలీ (సి) కోహ్లీ (బి) అర్ష్‌దీప్‌ 1, రిషాద్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 24, మెహ్దీ హసన్‌ (నాటౌట్‌) 5, తన్‌జీమ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 146/8; వికెట్ల పతనం: 1-35, 2-66, 3-76, 4-98, 4-109, 6-110, 7-138, 8-145; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-30-2, బుమ్రా 4-0-13-2, అక్షర్‌ పటేల్‌ 2-0-26-0, హార్దిక్‌ 3-0-32-1, జడేజా 3-0-24-0, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-19-3.


Untitled-7.jpg

Updated Date - Jun 23 , 2024 | 06:48 AM