IND vs BAN: భారత్, బంగ్లా టెస్ట్, T20 సిరీస్‌లు రద్దు అవుతాయా.. కొనసాగుతున్న బహిష్కరణ ట్రెండ్
ABN , Publish Date - Sep 08 , 2024 | 02:54 PM
బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ భారత పర్యటనకు ముందు జట్టుపై భారీ వ్యతిరేకత మొదలైంది. బంగ్లాదేశ్ బహిష్కరణ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

భారత్-బంగ్లాదేశ్(bangladesh) జట్ల మధ్య మొదట 2 టెస్టు మ్యాచ్‌లు, ఆ తర్వాత మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 19 (గురువారం) నుంచి చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టు వచ్చే వారం భారతదేశానికి రానుంది. బంగ్లాదేశ్ భారత పర్యటనకు ముందు జట్టుపై భారీ వ్యతిరేకత మొదలైంది. బంగ్లాదేశ్ బహిష్కరణ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా బంగ్లాదేశ్ జట్టు భారత్ పర్యటనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ భారత పర్యటనను హిందూ మహాసభ వ్యతిరేకించింది.
బహిష్కరణ
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకూడదని పలువురు సోషల్ మీడియా వేదికగా #BoycottBangladesh అని కోరుతున్నారు. బంగ్లాదేశ్ జట్టు భారతదేశానికి రావాలని చూస్తుంది. ఈ నిరసనల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి. మరోవైపు IND vs BAN టెస్ట్ సిరీస్‌లో బుమ్రా భారత్‌కు గైర్హాజరు కావచ్చని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ విజయం సాధించినప్పటి నుంచి విరామంలో ఉన్న బుమ్రా, శ్రీలంక పర్యటనలో కూడా పాల్గొనలేదు. బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత భారతదేశం ప్యాక్ షెడ్యూల్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో నాలుగు మ్యాచ్‌ల T20I సిరీస్, ఈ సంవత్సరం చివర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఉంటుంది. కాబట్టి బుమ్రా గైర్హాజరు కావచ్చని అంటున్నారు. ఆ షెడ్యూల్ కోసం విశ్రాంతి తీసుకోవచ్చని చెబుతున్నారు.
ఆటకు దూరం
IND vs BAN సిరీస్‌కు దూరమయ్యే మరో కీలక ఆటగాడు మహ్మద్ షమీ. ఆయన మడమ గాయంతో 2023 ODI ప్రపంచ కప్‌లో ఆడాడు. తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి నుంచి దూరంగా ఉన్నాడు. షమీ ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటన, ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్, టీ20 ప్రపంచ కప్‌తో సహా కొన్ని ముఖ్యమైన సిరీస్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో షమీ న్యూజిలాండ్ సిరీస్‌కు తిరిగి వస్తాడని ఆశ ఉన్నప్పటికీ, IND vs BAN సిరీస్‌కు మాత్రం రావడం కష్టమనే చెప్పవచ్చు.
శ్రేయాస్ కూడా..
ఈ సిరీస్‌లో మనం చూడలేని మరొక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా సీకి వ్యతిరేకంగా ఇండియా డీ తరపున మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేయగలిగాడు. అతని నిలకడ లేని ఆటతీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. అయ్యర్ కంటే టెస్టు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న కేఎల్ రాహుల్‌కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.