Hyderabad: ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యాసంస్థల్లో.. దివ్యాంగులకు 5ు రిజర్వేషన్లు
ABN, Publish Date - Jun 27 , 2024 | 03:55 AM
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ మెమో జారీ చేశారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ మెమో
వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు
ప్రత్యేక అవసరాలు కలిగిన
విద్యార్థుల గురించి మెమోలో లేదంటున్న బాధితులు
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ మెమో జారీ చేశారు. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతూ (ఎయిడెడ్) నడుస్తున్న ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లతో పాటు ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఐదేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు కూడా ఇవ్వాలని మెమోలో పేర్కొన్నారు. అయితే.. పాఠశాలల స్థాయిలో ప్రవేశాల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అలాగే.. గుర్తించిన అంగవైకల్యాల జాబితాలో శారీరక, మానసిక సమస్యలతో బాధపడేవారితో పాటు, అంధులు, చెవిటి, మూగ సహా దాదాపు 21 రకాల సమస్యలతో సతమతమయ్యేవారు ఉన్నారు. మరి ఈ 21 రకాల దివ్యాంగులకూ ప్రవేశాలు ఇస్తారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. వీరిలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు 5 లక్షల మంది దాకా ఉండగా.. చెవిటి మూగ వారు 2 లక్షల మంది ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం పాఠశాలల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో శారీరక వైకల్యం ఉన్నవారికి ప్రవేశాలను కల్పిస్తూ విద్యను అందిస్తున్నారు. అంధులకు బ్రెయిలీ లిపిలో విద్య అందుతోంది.
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులకు మాత్రం విద్యాసంస్థల్లో ప్రవేశాలు అందడంలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ జారీ చేసిన మెమోలో.. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులు, పాఠశాలల విషయంలో స్పష్టతలేదని ‘వికలాంగుల హక్కుల జాతీయ వేదిక’ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం దీనిపై స్పందించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాఠశాలల స్థాయి నుంచి ఉన్నత విద్యా సంస్థల వరకు.. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులకు బోధించగలిగే సిబ్బందిని కూడా నియమించాలని అభ్యర్థించారు.
Updated Date - Jun 27 , 2024 | 03:55 AM