CV Anand: అవినీతి కేసుల్లో కోర్టు విచారణకు ఏడేళ్ల సమయం
ABN, Publish Date - Aug 01 , 2024 | 03:18 AM
అవినీతి కేసుల్లో కోర్టు విచారణ ప్రారంభం కావడానికి కనీసం 6-7 ఏళ్లు పడుతుందని ఏసీబీ చీఫ్ సీవీ ఆనంద్ తెలిపారు.
ఏసీబీ చీఫ్ సీవీ ఆనంద్
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అవినీతి కేసుల్లో కోర్టు విచారణ ప్రారంభం కావడానికి కనీసం 6-7 ఏళ్లు పడుతుందని ఏసీబీ చీఫ్ సీవీ ఆనంద్ తెలిపారు. 2013లో ఆదిలాబాద్ జిల్లా వాంఖిడి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన లచ్చన్న ఓ కేసు విషయంలో రూ.10వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కాడు. విచారణ అనంతరం కరీంనగర్ ఏసీబీ కోర్టు లచ్చన్నకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.12వేల జరిమానా విధిస్తు బుధవారం తీర్పు వెలువరించింది. దీనిపై సీవీ ఆనంద్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అవినీతి కేసుల్లో నిందితుడికి ఐదేళ్లు శిక్ష పడటం అరుదైన విజయం అన్నారు.
సాధారణంగా 3 సంవత్సరాల వరకు శిక్ష పడుతుందన్నారు. అయితే ట్రాప్ చేసి, ప్రభుత్వ ఉద్యోగుల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్న చాలా మందికి ఈ సందర్భంగా ఏసీబీ పనితీరును ఆనంద్ వివరించారు. ‘నిందితుడైన ఉద్యోగికి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఏసీబీ అన్ని సాక్ష్యాలు సేకరిస్తుంది. తర్వాత ప్రాసిక్యూషన్ అనుమతి కోసం విజిలెన్స్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి లేఖ వెళ్తుంది. ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత అన్ని ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తారు. కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి 6-7 సంవత్సరాలు పడుతుంది. విచారణ పూర్తి చేసుకుని శిక్ష పడేందుకు 10 సంవత్సరాలు పడుతుంది’ అని ఏసీబీ చీఫ్ సీవీ ఆనంద్ ‘ఎక్స్’ వేదికగా వివరించారు.
సాయి వెంకట కిషోర్ సస్పెన్షన్ కొనసాగింపు
ఇన్‌స్పెక్టర్ ఎం.సాయి వెంకట కిషోర్ సస్పెన్షన్ కొనసాగిస్తూ ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సంగారెడ్డి సీసీఎ్‌సలో పనిచేస్తూ సస్పెండ్ అయిన సాయి వెంకట కిషోర్ గత జూలై 23న ఏసీబీ అధికారులకు పట్టుబడి అరెస్ట్ అయ్యారు. గతంలో సస్పెండ్ అయినప్పటికీ పద్ధతి మారకపోవడం, లంచం కేసులో అరెస్ట్ కావడం వల్ల ఆయనపై విశ్వసనీయత కోల్పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐజీ వెల్లడించారు. సాయి వెంకట కిషోర్ విషయంలో తదుపరి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Aug 01 , 2024 | 03:18 AM