BB Nagar: తోకతో చిన్నారి.. ఎయిమ్స్‌లో తొలగింపు
ABN, Publish Date - Jul 16 , 2024 | 04:35 AM
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తోకతో పుట్టిన చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు.
బీబీనగర్, జూలై 15: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తోకతో పుట్టిన చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు. తెలంగాణకు చెందిన ఓ దంపతులకు తొమ్మిది నెలల క్రితం తోకతో బాబు పుట్టగా ఈ ఏడాది జనవరి నెలలో బాబును తల్లిదండ్రులు ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి.. గర్భం దాల్చే సమయంలో సమస్య తలెత్తి స్పైనల్ కార్డ్ సరిగా ఏర్పడక బాబు తోకతో జన్మించాడని, దీనిని వైద్య పరిభాషలో స్పినా బిఫిడగా పరిగణిస్తారని తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు.
వెన్నెముకతో తోక అనుసంధానమై ఉందని గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న నిమ్స్ వైద్యులు జనవరిలో చిన్న పిల్లల వైద్య విభాగం సీనియర్ వైద్యులు డాక్టర్ శశాంక్ పండ నేతృత్వంలో రెండున్నర గంటలకు పైగా శ్రమించి 15 సెంటీమీటర్ల పొడవున్న ఆ తోకను బాబు శరీరం నుంచి వేరు చేశారు. ఐదు రోజుల పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితులను గమనించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఆరు నెలలుగా బాబును పర్యవేక్షించిన వైద్యులు సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి బాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని నిర్ధారించారు.
Updated Date - Jul 16 , 2024 | 07:21 AM