Amrut Path Scheme: అమృత్ పథకంలో కోట్లు కొట్టేశారు
ABN, Publish Date - Jul 12 , 2024 | 03:05 AM
కేంద్ర ప్రభుత్వ యోజన అయిన అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ.3 వేల కోట్లను చీకటి టెండర్ల ద్వారా తమ అనుయాయులకు కట్టబెట్టి తెలంగాణ సర్కారు తీవ్ర అవినీతికి పాల్పడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
రేవంత్ బంధువు, మరో సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చారు
అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ కోరతా: ఏలేటి
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ యోజన అయిన అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ.3 వేల కోట్లను చీకటి టెండర్ల ద్వారా తమ అనుయాయులకు కట్టబెట్టి తెలంగాణ సర్కారు తీవ్ర అవినీతికి పాల్పడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌కు దగ్గరి బంధువు ఇందులో రూ.కోట్ల పనులు చేస్తున్నారని, మరో ప్రముఖ సంస్థకు కూడా భారీ ఎత్తున పనులు అప్పగించారని పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించిన అంచనాలన్నీ కాంట్రాక్టర్లే రూపొందించుకున్నారని, అధిక ధరలకు అంచనాలను తయారు చేసుకున్నారని విమర్శించారు. గురువారం బీజేఎల్పీ కార్యాలయంలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఒక్క జీవోను, ఒక్క టెండరు డాక్యుమెంటును కూడా పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ సర్కారు బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోందని విమర్శించారు. గత 7 నెలల్లో ఈ ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందాలు, టెండర్లపై విచారణకు సిద్ధమా..? అని సవాల్ చేశారు. హెటెరో డ్రగ్స్ భూమి విషయంలో, పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో చీకటి కోణంలో చీకటి పాలన కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై సీబీఐ, ఈడీ విచారణ చేయాలని కోరతానని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాగా, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలతో ఖజానాపై అదనపు భారం పడుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్ అన్నారు. వీరి పదవులు రద్దుచేయాలని గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు.
Updated Date - Jul 12 , 2024 | 03:08 AM