Kaaleshwaram Project: ప్రమాణాలను పట్టించుకోలేదు..
ABN, Publish Date - Jul 06 , 2024 | 04:30 AM
బ్యారేజీల నిర్మాణంలో ప్రమాణాలకు ఉద్దేశించిన భారతీయ ప్రమాణాల సంస్థ (ఇండియన్ స్టాండర్డ్) కోడ్-7349ను కాళేశ్వరం నిర్మాణంలో పాటించలేదని, నిర్వహణకు ఉద్దేశించిన క్లాజులను కూడా అమలు కాలేదని సంబంధిత నిపుణులు గుర్తించారు.
ఐఎస్ కోడ్‌ను పక్కనపెట్టారు
గేట్ల నిర్వహణపై కమిటీ వేయలేదు
దీనివల్లే మేడిగడ్డ కుంగిపోయింది
జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలతోనే కారణాలేమిటో తెలుస్తాయి
జస్టిస్ పీసీ ఘోష్‌కు నిపుణుల అఫిడవిట్
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): బ్యారేజీల నిర్మాణంలో ప్రమాణాలకు ఉద్దేశించిన భారతీయ ప్రమాణాల సంస్థ (ఇండియన్ స్టాండర్డ్) కోడ్-7349ను కాళేశ్వరం నిర్మాణంలో పాటించలేదని, నిర్వహణకు ఉద్దేశించిన క్లాజులను కూడా అమలు కాలేదని సంబంధిత నిపుణులు గుర్తించారు. ఈ మేరకు జస్టిస్ పినాకి చంద్రఘో్‌షకు ఆఫిడవిట్ల రూపంలో ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు.. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం ప్రారంభం కాగా... 2019 జూన్‌లో పనులు పూర్తయ్యాయి. 2019 తొలి వరదల అనంతరం మూడు బ్యారేజీ గేట్లను దించిన సమయంలో సీసీ బ్లాకులు చెల్లాచెదరయ్యాయి. ఐఎస్ కోడ్‌లోని క్లాజు 5.1 ప్రకారం, వరదల అనంతరం నవంబరులో గేట్లన్నీ ఎత్తి బ్యారేజీని ఖాళీ చేసి, బ్యారేజీ ఏమైనా దెబ్బతిన్నదా అని సమగ్ర పరిశీలన చేయాల్సి ఉంది. కానీ, ఆ పని చేయలేదు. క్లాజు 5.3 ప్రకారం అప్‌స్ట్రీమ్ (ఎగువభాగం)తో పాటు దిగువభాగంలోని అఫ్రాన్లు ఏ విధంగా ఉన్నాయో గుర్తించాల్సి ఉండగా ఆ పని కూడా జరగలేదు. గేట్ల నిర్వహణకు సంబంధించి కూడా ఒక కమిటీ వేయాల్సి ఉండగా... అదీ కార్యరూపం దాల్చలేదు.
అన్ని గేట్లు ఒకేసారి కాకుండా ఒక్కో గేటును ఎత్తడం వల్ల నీటి ఒత్తిడి పడి డౌన్‌స్ట్రీమ్‌లో సీసీ బ్లాకులు చెల్లాచెదురు కావడం, అఫ్రాన్ దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. బ్యారేజీకి ఎగువతోపాటు దిగువ భాగంలో వరద సజావుగా ప్రవహించేలా ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా ఆ వరద కూడా బ్యారేజీని దెబ్బతీసింది. ఐఎస్ ప్రమాణాల ఆధారంగా పనులు జరుగకపోవడంతో క్రమంగా బ్యారేజీలు దెబ్బతింటూ... 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. బ్యారేజీల నిర్వహణ వైఫల్యంతో సీకెంట్ ఫైల్స్ దెబ్బతిని...ఇసుకంతా బ్యారేజీ పునాదుల నుంచి జారి అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఏర్పడి మేడిగడ్డ కుంగిపోయింది.
బ్యారేజీల వైఫల్యాలకు కారణాలన్నీ బయటపడాలంటే జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు జరగాలి. కాగా, బ్యారేజీ నిర్మాణంలో ఉండగానే దెబ్బతిన్నదని, దీనికి నిర్మాణలోపంతో పాటు డిజైన్ లోపం కూడా ఒక కారణమని మరికొందరు నిపుణులు కమిషన్‌కు గుర్తు చేశారు. 2019 నవంబరులోనే సీసీ బ్లాకులు దెబ్బతిన్న తర్వాత నిర్మాణ సంస్థ అప్పటి అఽధికారులకు లేఖ రాసి సరైన డిజైన్ ఇస్తే, మరమ్మతులు చేస్తామని చెప్పినా కూడా.. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఎలాంటి డిజైన్ ఇవ్వలేదని ఆక్షేపించారు.
త్వరలో నోటీసులు
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు 10 రోజుల పాటు ఆయన హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న ఆయన... కమిషన్‌కు చేరిన అఫిడవిట్లను పరిశీలించి, ఎవరె వరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Updated Date - Jul 06 , 2024 | 04:30 AM