Somesh Kumar: పని తెలంగాణలో.. చెల్లింపులు ఏపీలో!
ABN, Publish Date - Oct 05 , 2024 | 03:42 AM
తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వీఆర్‌ఎస్ తీసుకున్న సోమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించింది.
మాజీ ఐఏఎస్ సోమేశ్ కుమార్‌కు లబ్ధి
అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వీఆర్‌ఎస్ తీసుకున్న సోమేశ్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించింది. తాజాగా ఆయనకు ప్రభుత్వం రూ.3 లక్షల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను మంజూరు చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి సోమేశ్‌కుమార్ విభజిత ఏపీలో ఒక్క గంట కూడా పని చేయలేదు. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను ఏపీకి కేటాయించారు. అయినా ఆయన డీవోపీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లగా వెళ్లిపోవాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన 2023, జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్(వీఆర్‌ఎస్) తీసుకుని వెళ్లిపోయారు. ఒక్క గంట కూడా ఆయన ఏపీలో పని చేయలేదు. ఆయన వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు పెట్టిన వెంటనే నాటి జగన్ ప్రభుత్వం క్షణాల్లో ఆమోదించింది. ఆ మరుసటి రోజునే ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. తాజాగా సోమేశ్‌కు ఏపీ ప్రభుత్వం లక్షల రూపాయిల ప్రజాధనాన్ని చెల్లిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. అదేవిధంగా ఆయన పదవీ విరమణ ప్రయోజనాలు కూడా లక్షల్లో ఉండనున్నాయి.
వీటితో పాటు పెన్షన్, ఇతర బెనిఫిట్స్ మొత్తం ఏపీనే ఇవ్వాల్సి ఉంది. ఒక ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్ తర్వాత ఏడాది పాటు ఉద్యోగం చేయకూడదు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కల్పించే బాధ్యతను భుజాన వేసుకోకూడదు. అలా చేసిన వారికి పెన్షన్ కట్ చేయడంతో పాటు పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ, సోమేశ్ వీఆర్‌ఎస్ తీసుకున్న తర్వాత నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారులో సలహాదారుగా చేరిపోయారు. ఈ నేపథ్యంలో సోమేశ్ తెలంగాణలో పెన్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందడం నైతికత. కానీ,. ఏపీ ఇప్పుడు చెల్లింపులు చేయడం పట్ల అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
Updated Date - Oct 05 , 2024 | 03:42 AM