Share News

Nampalli Court: ప్రభాకర్‌రావుపై అరెస్టు వారెంట్‌..

ABN , Publish Date - May 11 , 2024 | 05:55 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌, ఎస్‌ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్‌ డిస్క్‌ల విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు అరె్‌స్టకు వారెంట్‌ జారీ అయింది. ప్రభాకర్‌రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్‌పై కూడా నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

Nampalli Court: ప్రభాకర్‌రావుపై అరెస్టు వారెంట్‌..

  • అజ్ఞాతంలో ఉన్న శ్రవణ్‌కుమార్‌పైనా

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఉత్తర్వులు జారీ చేసిన నాంపల్లి కోర్టు

  • విదేశాల్లో తలదాచుకున్న ప్రభాకర్‌రావు

  • ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీకి అధికారుల యత్నం

  • ప్రణీత్‌రావు, టీంపై మరిన్ని కేసులు

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌, ఎస్‌ఐబీ ప్రధాన కార్యాలయంలో హార్డ్‌ డిస్క్‌ల విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు అరె్‌స్టకు వారెంట్‌ జారీ అయింది. ప్రభాకర్‌రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్‌కుమార్‌పై కూడా నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ ఇద్దరిపై సీఆర్‌పీసీ సెక్షన్‌-73 కింద అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లారు. విదేశాల్లో తలదాచుకొంటున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రభాకర్‌రావు కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు.


విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావును భారత్‌కు రప్పించి అరెస్ట్‌ చేసి విచారిస్తేనే కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఈ కేసులో ప్రభాకర్‌రావుపై హైదరాబాద్‌ పోలీసులు ఇప్పటికే లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఆయన్ను విదేశాల నుంచి రప్పించేందుకు దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌ సహకారంతో రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఫోన్‌ ట్యాపింగ్‌కు సహకారం అందించిన ప్రైవేటు వ్యక్తి శ్రవణ్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ కావడంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సమాయత్తమవుతోంది. ట్యాపింగ్‌ పరికరాలను ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేయడంలో శ్రవణ్‌ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే నలుగురు పోలీస్‌ అధికారులను దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసింది. సుమారు 40 మందికిపైగా పోలీస్‌ అధికారులు, సిబ్బందిని విచారించి వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రభాకర్‌రావు నేతృత్వంలో పనిచేసిన ప్రణీత్‌రావు అండ్‌ టీంపై మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఐబీ అడిషనల్‌ ఎస్పీ రమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ హోదాలో రాధాకిషన్‌రావు ఇబ్బందులకు గురిచేశారని పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ఇతరులు ఫోన్‌ ట్యాపింగ్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇవి కాకుండా కేసు దర్యాప్తులో భాగంగా గత ప్రభుత్వ హాయాంలో ప్రణీత్‌ రావు అండ్‌ టీం ట్యాపింగ్‌ చేసిన ఫోన్‌ నెంబర్ల వివరాలను సేకరించిన దర్యాప్తు అధికారులు వారిని విచారిస్తున్నారు. ఎవరైనా అప్పుడు ట్యాపింగ్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెబితే వారి నుంచి విడిగా ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసే పనిలో ఉన్నారు. ఒకే అంశానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు చేయడం వల్ల నిందితులపై మరింత బలంగా అభియోగాలు మోపి న్యాయస్థానంలో వారికి చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు.


ఉన్నతాధికారుల్లో ఆందోళన

గత ప్రభుత్వ హాయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ప్రస్తుత ప్రభుత్వంలో కీలక విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులను భయపెడుతోంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, డీజీపీ, హైదరాబాద్‌ సీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇలా... వివిధ స్థాయిల్లో నిర్ణయాలు, అనుమతుల మేరకు ట్యాపింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతా నిబంధనల మేరకే జరిగినా, ప్రభాకర్‌రావు నేతృత్వంలో పనిచేసిన ప్రణీత్‌ రావు బృందం గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా పలువురు రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, వ్యాపారుల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. దీంతో అప్పుడు ఆయా విభాగాల్లో ఉండి ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు.. ఈ కేసు ఎటు తిరిగి ఎటు వస్తుందోనని, ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - May 11 , 2024 | 05:55 AM