Bandi Sanjay: హైడ్రా బుల్డోజర్లు మా పైనుంచే వెళ్లాలి

ABN, Publish Date - Sep 30 , 2024 | 03:19 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదలకు చుక్కలు చూపిస్తోందని.. నిరుపేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యామా..? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Bandi Sanjay: హైడ్రా బుల్డోజర్లు మా పైనుంచే వెళ్లాలి

  • పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా: సంజయ్‌

బర్కత్‌పుర, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదలకు చుక్కలు చూపిస్తోందని.. నిరుపేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యామా..? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. హైడ్రా బుల్డోజర్లు ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలపై నుంచే పేదల ఇళ్ల వద్దకు వెళ్లాలని అన్నారు. హైడ్రాపై ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగరానికి వచ్చిన తర్వాత ప్రణాళికలు రూపొందిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తామని చెప్పారు.


ప్రధాని మోదీ 74వ జన్మదినం సందర్భంగా ఆదివారం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా పక్వాడ ఫొటో ఎగ్జిబిషన్‌ను సంజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైడ్రా వల్ల రియల్‌ ఎస్టేట్‌, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. కలెక్టరేట్లు, ఫైర్‌ స్టేషన్ల నిర్మాణం పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల స్థలాలను గుంజుకుందని.. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని సంజయ్‌ మండిపడ్డారు. ఈ నెల 17న ప్రధాని మోదీ జన్మదినం నుంచి అక్టోబరు 2 గాంధీ జయంతి వరకు పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు.

Updated Date - Sep 30 , 2024 | 03:19 AM