Bhatti Vikramarka : ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధేసింది
ABN, Publish Date - Sep 15 , 2024 | 04:33 AM
ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ అనిపిస్తోందని, అతిగా ముందుకు పోతే ఎలా నియంత్రించాలో ప్రభుత్వానికి తెలుసని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
ఆ పార్టీ కుట్రలను ప్రజలు మరిచిపోలే: భట్టి
అరికెపూడి గాంధీ ఏ పార్టీ ఎమ్మెల్యేనో..ఇటీవల అసెంబ్లీలో సభాపతి చెప్పారు
గతంలో నన్ను సీఎల్పీ నేతగా లేకుండా చేశారు
పీఏసీ చైర్మన్ పదవి కూడా నాకు ఇవ్వలేదు
ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించింది బీఆర్‌ఎస్సే: భట్టి
పెద్దపల్లి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ అనిపిస్తోందని, అతిగా ముందుకు పోతే ఎలా నియంత్రించాలో ప్రభుత్వానికి తెలుసని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య జరుగుతున్న వివాదంపై నందిమేడారంలో మీడియా అడిగిన ప్రశ్నలకు భట్టి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలి కాబట్టి, వాళ్లు బజారున తన్నుకుంటూ ఉంటా ఉంటే కొంత ఉపేక్షించామన్నారు.
గాంధీ ఏ పార్టీకి చెందిన వారు అనే విషయమై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో పార్టీల వారీగా సభాపతి చెప్పారని, ఆయన తమ పార్టీ నేత కాదంటే ఎలా అని ఆయన బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. ఎందుకు ఈ గందరగోళమని అన్నారు. గతంలో తనను సీఎల్పీ నేతగా లేకుండా చేశారని, పీఏసీ చైర్మన్ పదవి తనకు ఇవ్వకుండా వేరే వాళ్లకు ఇచ్చారని, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువల గురించి బీఆర్‌ఎస్ ఇప్పుడు మాట్లాడవద్దని సూచించారు. సీఎల్పీ లేకుండా ఆనాడు బీఆర్‌ఎస్ చేసిన కుట్రలను ప్రజలు మరిచిపోలేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టిపోవడానికి కారణం బీఆర్‌ఎస్ పార్టీ అని మండిపడ్డారు.
ఎమ్మెల్యేల వివాదం వెనుక ఒక పెద్ద తల ఉందంటున్న బీజేపీ నాయకులు రాజకీయ ఉనికి కోసం తహతహలాడుతున్నారని, వారిని ప్రజలు పట్టించుకోరని భట్టి అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, మోటార్లు నడువవని అన్న బీఆర్‌ఎస్ నాయకులకు చెంప దెబ్బ కొట్టేలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. భవిష్యత్తులో తెలంగాణను పవర్ మోడల్ రాష్ట్రంగా చూడబోతున్నామని, 2029-30 నాటికి రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ధర్మారం, పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.
వ్యవసాయ రంగానికి భవిష్యత్తులో సౌర విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీఽధర్ బాబు మాట్లాడుతూ.. హైదారాబాద్‌లో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటుంటే ఆ నెపాన్ని కాంగ్రె్‌సపై రుద్దడం సరైంది కాదన్నారు. అభివృద్ధి, సంక్షేమం తమకు రెండు కళ్ల లాంటివన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం సృష్టిస్తుంది బీఆర్‌ఎస్ పార్టీయేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ధర్నాలు చేసుకునేందుకు ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చినా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోన్న బీఆర్‌ఎస్ నేతలు భౌతిక దాడులను ప్రోత్సహిస్తున్నారని హైదరాబాద్‌లో మండిపడ్డారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. పదేళ్లు పాలించినోళ్లు పది నెలలు కూడా ఓపికగా ఉండలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
Updated Date - Sep 15 , 2024 | 04:33 AM