ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T. Harish Rao: ఏపీలో ఇచ్చారు.. మీరెందుకివ్వరు?

ABN, Publish Date - Jun 18 , 2024 | 05:48 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మొదటి సంతకంతోనే పింఛను మొత్తాన్ని రూ.4వేలకు పెంచారని.. తెలంగాణలో ఆరు నెలలైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మొదటి సంతకంతోనే పింఛను మొత్తాన్ని రూ.4వేలకు పెంచారని.. తెలంగాణలో ఆరు నెలలైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదని మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు పింఛను ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకుని.. వాటిని ఇంతవరకు పరిష్కరించలేదని, పేదల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. కాంగ్రెస్‌ హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6వేలు, ఇతరులకు రూ.4వేల పింఛను తక్షణం అందజేయాలని డిమాండ్‌ చేశారు. పింఛను మొత్తం పెరగకపోగా, రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన పింఛను రాలేదని వృద్ధులు ఆవేదన చెందుతున్నారన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. అధికారం చేపట్టగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఆరు నెలలయినా జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయకుండా నిరుద్యోగ, యువతీ యువకులను మోసం చేసిందన్నారు.


మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. 11 వేల పోస్టులే ప్రకటించారని, హామీ ప్రకారం 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని, ఇతర ఉద్యోగాలకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో పాసయిన అభ్యర్థులను ఒక పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్నారని.. దీనిని ఒక పోస్టుకు వందమంది చొప్పున పెంచాలని, తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 1:100 విధానం అమలు చేస్తామని ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పారని హరీశ్‌ గుర్తు చేశారు. గ్రూప్స్‌ పరీక్షలకు మధ్య కనీసం రెండు నెలల వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని, నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందన్నారు.


ఒకటో తేదీన జీతాలిస్తే.. నిరసనలెందుకు?

ప్రతీ నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలిస్తున్నామని మంత్రులు చెబుతున్నారని, అలా జీతాలిస్తే.. ఆశావర్కర్లు వైద్యవిధాన పరిషత్‌ వద్ద ధర్నా ఎందుకు చేస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు సహా... ఎన్‌హెచ్‌ఎం కింద పని చేసే 17వేల మందికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో పని చేసే కార్మికులకు 5 నెలలుగా వేతనాలు రావడంలేదన్నారు. రాష్ట్రంలోని 60 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది జీతాల కోసం రోడ్డెక్కుతున్నారని గుర్తు చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులపై కేసీఆర్‌ బొమ్మ ఉందని, గత ప్రభుత్వ హయాంలో మంజూరైన చెక్కులను సైతం ఇవ్వకుండా పేదప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. లక్షన్నర మంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు.


వారికి లీగల్‌ నోటీసులు పంపిస్తా

తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో వ్యూస్‌ పెంచుకోవడం కోసం కొందరు వ్యక్తులు, రేటింగ్‌ల కోసం కొన్ని టీవీ ఛానళ్లు తనపై బురద చల్లేయత్నం చేస్తున్నాయన్నారు. వాళ్ల స్వలాభం కోసం తనను, బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజల్లో దిగజార్చే యత్నం చేస్తే ఊరుకోనని.. లీగల్‌ నోటీసులు ఇచ్చి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jun 18 , 2024 | 05:48 AM

Advertising
Advertising