KTR: తప్పుంటే.. దగ్గరుండి ఫామ్ హౌస్ కూలగొట్టిస్తా
ABN, Publish Date - Aug 21 , 2024 | 02:44 PM
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కెవిపి రామచంద్రరావు, మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ తదితరులకు ఫామ్ హౌస్‌లున్నాయన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో కూడా తాను చూపిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎలా ఉందని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఆగస్ట్ 21: జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లో స్పందించారు. తన పేరుతో ఫామ్ హౌస్ లేదని ఆయన స్పష్టం చేశారు. తన మిత్రుడికి చెందిన ఫామ్ హౌస్‌ను తాను లీజుకు తీసుకున్నానని తెలిపారు. గత కొన్ని నెలలుగా తాను అక్కడే నివసిస్తున్నట్లు చెప్పారు. జన్వాడలోని ఈ ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారం లేకుంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఈ ఫామ్ హౌస్ నిర్మించి ఉంటే.. దానిని కూల్చివేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కుండ బద్దలు కొట్టారు.
కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, సీనియర్ నేతల పరిస్థితి ఏమిటి..?
కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కెవిపి రామచంద్రరావు, మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ తదితరులకు ఫామ్ హౌస్‌లున్నాయన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో కూడా తాను చూపిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎలా ఉందని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. పొంగులేటి సోదరుడు ప్రస్తుతం అదే ఫామ్ హౌస్‌లో ఉంటున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. తన ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలోనే నిర్మించారా? అంటూ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.
మంత్రులు ఫామ్ హౌస్‌ల కూల్చివేతతో ప్రారంభించాలి..
ముందు మంత్రుల ఫామ్ హౌస్‌ల కూల్చివేతతోనే వీటిని ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కార్‌ను మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ పార్టీ బీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. భారత రైతు సమితి అని కూడా ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే రైతులకు పూర్తిగా రుణమాఫీ జరగలేదని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు..
మరోవైపు జన్వాడలో ఫామ్ హౌస్ కూల్చవద్దంటూ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోని కట్టడాలపై హైడ్రా గత కొన్ని రోజులుగా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆ క్రమంలో జన్వాడలోని ఫామ్ హౌస్.. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండడంతో.. దీనిని కూల్చివేస్తారంటూ ఓ ప్రచారం అయితే సాగుతుంది. అలాంటి వేళ హైకోర్టులో ప్రదీప్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, హైడా కమిషనర్ రంగనాథ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శంకర్‌పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజినీర్ తదితరులను పిటిషనర్ చేర్చారు.
ఐపీఎస్ అధికారి రంగనాథ్ సారథ్యంలో ‘హైడ్రా’
హైదరాబాద్ నగర శివారుల్లో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారు. వీటిపై హైడ్రా ఫోకస్ పట్టింది. ఈ ఫామ్ హౌస్‌లు నిబంధనల మేరకు నిర్మించారా? లేక 111 జీవోను ఉల్లంఘించారా? అనే కోణంలో ఓ వైపు హైడ్రా, మరోవైపు ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించి.. వివరాలు సేకరిస్తున్నారు. ఓ వేళ నిబంధనలు పట్టించుకోకుండా నిర్మిస్తే... వాటిని కూల్చివేసేందుకు ఐపీఎస్ అధికారి ఎ.వి.రంగనాథ్ సారథ్యంలో ‘హైడ్రా’ తన పని తాను చేసుకొంటూ ముందుకు వెళ్తుందనే ఓ చర్చ సైతం సాగుతుంది.
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 21 , 2024 | 03:23 PM