Project Protection: పూడికతీతతో పూర్వస్థితి
ABN, Publish Date - Aug 10 , 2024 | 04:40 AM
ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకుండా పూడికతీత పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది.
ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకుండా పూడిక తీయాలి
వచ్చే ఇసుకతో ప్రభుత్వానికి ఆదాయం
మట్టిని రైతులకు ఉచితంగా ఇవ్వాలి
14లోగా ప్రతిపాదనలు అందించాలి
మంత్రివర్గ ఉపసంఘం ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకుండా పూడికతీత పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ప్రాజెక్టుల రక్షణలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ ఉండరాదని స్పష్టం చేసింది. ప్రాజెక్టులకు ఏటా వచ్చే భారీ వరదతోపాటు పూడిక కూడా వచ్చి చేరుతోందని తెలిపింది. దీంతో ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గుతున్నందున.. పూడికతీతతో పూర్వస్థితిని పునరుద్ధరించాలని సూచించింది. శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఉపసంఘం సమావేశం జరిగింది.
పూడికతీతకు ఏయే చర్యలు తీసుకోవచ్చనే దానిపై నీటిపారుదల, మైనింగ్ శాఖలు సమగ్ర నివేదిక రూపొందించి, 14లోగా అందించాలని మంత్రివర్గం ఆదేశించింది. పూడిక వల్ల డ్యామ్ సేఫ్టీ సమస్యలు తలెత్తడంతోపాటు ఆయకట్టు తగ్గిపోతోందని, తాగునీటి అవసరాలపైనా దీని ప్రభావం పడుతుందని మంత్రులు పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో పూడికతీతకు పర్యావరణ అనుమతి అవసరంలేదని కేంద్రం చెప్పినందున..దానికనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. పూడికలో ఇసుక ఉంటే నిర్మాణ అవసరాలకు వినియోగించుకోవాలని, సారవంతమైన మట్టి ఉంటే రైతాంగానికి ఉచితంగా అందించాలని సూచించారు. పూడికను రైతులే స్వయంగా తీసుకెళ్లేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.
35 టీఎంసీల నిల్వను కోల్పోయాయి!
మహారాష్ట్ర, రాజస్థాన్‌లో వాణిజ్య అవసరాలకు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాజెక్టుల్లోని పూడికను వినియోగించుకుంటున్నారని అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి తెలిపారు. యంత్రాల సహాయంతో డ్రెడ్జింగ్ చేస్తూ పూడిక తీస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌పీ) కింద 14 ప్రాజెక్టుల్లో పూడికపై అధ్యయనం చేయించగా.. 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు 35 టీఎంసీల నిల్వను కోల్పోయినట్లు తేలిందని నివేదించారు. ఏటా పూడిక తీతకు టెండర్లు పిలిచి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తే.. ఇసుక తరలింపుతో ట్యాక్స్, సెస్, జీఎస్టీ, ఇతర రాయల్టీలతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు.
పూడిక వల్ల జలాశయాలు ఏటా 0-5 శాతం నిల్వలను కోల్పోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 25 ఏళ్లకు పైగా నిండిన జలాశయాలున్నాయని, ప్రయోగాత్మకంగా కొన్నింట్లో పూడికతీత చేపట్టి.. ఆ తరువాత మొత్తం 159 జలాశయాల్లో అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని వివరించారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులను మింగుతున్న పూడిక
ఏటా వరదల సమయంలో జలాశయాల్లోకి నీటితోపాటు పూడిక వచ్చిచేరుతుండడంతో ప్రాజెక్టుల సామర్థ్యం ఏయేటికాయేడు తగ్గిపోతోంది. ఈ పూడిక.. ప్రాజెక్టుల ఆయుష్షును కూడా తగ్గిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్‌ను 1923లో అప్పటి నిజాం ప్రభుత్వం నిర్మించగా... ఈ ప్రాజెక్టు 1967 నాటికీ 52.10 శాతం సామర్థ్యం కోల్పోయింది. అప్పట్లో నిజాంసాగర్‌కు ఎగువన ప్రాజెక్టులే లేకపోవడంతో వచ్చే వరద పూడికతో సహా జలాశయంలో చేరడంతో ప్రాజెక్టు సామర్థ్యం సగానికి పైగా తగ్గింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2016లో నిర్మించిన ర్యాలివాగు సామర్థ్యం 43.30 శాతం మేర తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టు 1976లో అందుబాటులోకి రాగా... 45 ఏళ్లలో పూడిక కారణంగా 29.96 శాతం మేర నీటినిల్వ సామర్థ్యం కోల్పోయింది.
ఇక నాగార్జునసాగర్ 23.52 శాతం నిల్వ సామర్థ్యం తగ్గింది. మొత్తంగా రాష్ట్రంలో 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 భారీ రిజర్వాయర్లు ఉండగా.. 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టుల్లో పూడికపై అధ్యయనం చేయించారు. ఇందులో ఈ ప్రాజెక్టుల సామర్థ్యం 35 టీఎంసీల మేర కోల్పోయిందని గుర్తించారు. ప్రాజెక్టుల్లో పూడిక చేరకుండా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, నదీ తీర ప్రాంతాలు కోతకు గురికాకుండా మొక్కల పెంపకం వంటి చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో వాటిని పూడిక మింగుతోంది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎ్‌సవై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మించాలంటే భూసేకరణ, నిర్మాణ ఖర్చులు కలిపి రూ.162 కోట్లు అవుతాయని లెక్క ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో ఎన్‌హెచ్‌పీ కింద అధ్యయనం చేసిన జలాశయాలు రూ.5670 కోట్ల మేర నష్టపోయాయి.
Updated Date - Aug 10 , 2024 | 04:41 AM