By-Elections: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ!
ABN, Publish Date - Aug 08 , 2024 | 03:36 AM
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఖాళీ అయిన 12 స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రం నుంచి ఏఐసీసీ కోటా కింద తీసుకునే
యోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం
9 రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాల ఖాళీ
కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి ఒకటి
12 స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు
14న నోటిఫికేషన్.. 21 వరకు నామినేషన్లు
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఖాళీ అయిన 12 స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. దీని ప్రకారం.. ఉప ఎన్నికలకు ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ కానుండగా.. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఉంటుంది. కాగా, ఈ 12 స్థానాల్లో తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ సభ్యుడు కె.కేశవరావు రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానం కూడా ఉంది. కేశవరావు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరడంతో జూలై 5న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆయన స్థానంలో ఎన్నికయ్యే నేత 2026 ఏప్రిల్ 9 వరకు కొనసాగుతారు. కేకే స్థానంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది, అభిషేక్ మనుసింఘ్వీకి అవకాశం దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ స్థానాలకు ఇవి రెండోసారి ఎన్నికలు. ఇంతకుమందు రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రె్‌సకు దక్కగా.. రెండింటినీ తెలంగాణకు చెందిన నేతలకే ఇచ్చారు. వీరిలో ఒకరు సీనియర్ నాయకులు రేణుకాచౌదరి కాగా, మరొకరు యువనేత ఎం.అనిల్‌కుమార్ యాదవ్. అప్పట్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ రెం డు పదవులకు రాష్ట్రానికి చెందిన నేతలనే ఎంపిక చేశారు. తాజాగా భర్తీ చేయనున్న స్థానాన్ని మాత్రం ఏఐసీసీ కోటా కింద తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది.
10 మంది లోక్‌సభకు ఎన్నిక కావడంతో..
రాజ్యసభకు ఉప ఎన్నికలు జరగనున్న 12 స్థానా ల్లో.. 10 స్థానాలు వివిధ రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఇటీవల లోక్‌సభకు ఎన్నికవడంతో ఖాళీ అయ్యాయి. ఇందులో అసోం, హరియాణా, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర నుంచి ఖాళీ అయిన స్థానాలున్నాయి. ఇక తెలంగాణ నుంచి కేశవరావు రాజీనామాతో ఒక స్థానానికి, ఒడిసాకు చెందిన బీజేడీ సభ్యుడు రాజీనామా చేయడంతో మరో స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి.
Updated Date - Aug 08 , 2024 | 03:36 AM