G.Kishan Reddy: 30లోగా గనులు వేలం వేయండి..
ABN, Publish Date - Jun 17 , 2024 | 02:58 AM
తెలంగాణలోని ఖనిజ గనులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 30వ తేదీలోపు ఖనిజ గనులకు వేలం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ సూచించింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఒక్క మినరల్ బ్లాక్‌కు కూడా తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించని విషయాన్ని గుర్తుచేస్తూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
కనీసం ఆరు బ్లాకులకైనా
ఆక్షన్ నిర్వహించండి
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ
లేదంటే తామే వేలం నిర్వహిస్తామని స్పష్టీకరణ
తొమ్మిదేళ్లుగా ఒక్క బ్లాక్‌కూ వేలం
నిర్వహించకపోవడంపై కేంద్రం అసంతృప్తి!
ఖనిజాల వారీగా రాష్ట్రానికి వివరాల అందజేత
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ఖనిజ గనులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 30వ తేదీలోపు ఖనిజ గనులకు వేలం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ సూచించింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఒక్క మినరల్ బ్లాక్‌కు కూడా తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించని విషయాన్ని గుర్తుచేస్తూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులోగా కనీసం ఆరు బ్లాకులకైనా వేలం నిర్వహించాలని, లేదంటే తామే ఆ ప్రక్రియను పూర్తిచేయాల్సి వస్తుందని తెలిపింది. శనివారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్వంలో సంబంధిత అధికారులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలోని గనులపై చర్చించినట్టు తెలిసింది. సుదీర్ఘ కాలంగా తెలంగాణలోని మైనింగ్ బ్లాక్‌లను వేలం వేయకపోవడం, దీనికి సంబంధించిన కారణాలు, అడ్డంకులు, గత ప్రభుత్వాల తీరు తదితర అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినా స్పందించలేదని అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గనుల వేలంపై రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం. తెలంగాణలోని మొత్తం 11 బ్లాకుల జియలాజికల్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపినట్టు తెలిసింది. ఇందులో ఐదు ఇనుప ఖనిజం బ్లాక్‌లు, ఐదు సున్నపురాయి బ్లాక్‌లు, ఒక మాంగనీస్ బ్లాక్ ఉన్నాయి. ఈ 11 బ్లాకుల్లో కనీసం ఆరు బ్లాకులను ఈ నెల చివరి నాటికి వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం తన లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ వేలం ప్రక్రియను తామే నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. మినరల్ బ్లాకుల వేలం ప్రక్రియ 2015లో ప్రారంభమైంది. అయితే 2021లో నిబంధనలను సవరించారు. వీటి ప్రకారం గనులను నిర్దిష్ట గడువులోగా వేలం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే, ఆ బ్లాకులను విక్రయించే అధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది.
మైనింగ్ యాక్ట్ (వేలం విధానం) అమలులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 354 ప్రధానమైన ఖనిజ బ్లాకులను వేలం వేశారు. ఇందులో 48 మినరల్ బ్లాక్‌లలో ఉత్పత్తి ప్రారంభమైందని, ఈ వేలం ప్రక్రియతో రాష్ర్టాల ఆదాయం గణనీయంగా పెరిగిందని కేంద్ర వర్గాలు తెలిపాయి. అయితే ఈ బ్లాక్‌ల వేలానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన విధానాలు సరిగా లేవన్న ఉద్దేశంతోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేలం నిర్వహించలేదని తెలుస్తోంది. కాగా, తెలంగాణలో మేజర్, మైనర్ మినరల్ బ్లాకులను వేలం పద్ధతిలో తామే కేటాయించాలని కేంద్ర గనుల శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకే ఖనిజాల వారీగా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం రాగానే వేలం ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేలంలో అర్హత సాధించిన వారికి ఆయా గనులను 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం.
Updated Date - Jun 17 , 2024 | 02:58 AM