Private Schools: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వండి
ABN, Publish Date - Aug 08 , 2024 | 03:40 AM
ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
తెలంగాణ సహా 4 రాష్ట్రాలు ఆర్‌టీఈ
నిబంధన అమలు చేయడం లేదు: కేంద్రం
విద్యార్థుల ఫీజును ఉమ్మడిగా భరించాలి
తనవాటాపై కేంద్రం స్పందన లేదు: రాష్ట్రం
తెలంగాణ సహా 4 రాష్ట్రాలు
ఆర్‌టీఈ నిబంధనను అమలు
చేయడంలేదు: కేంద్రం
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) కింద తప్పనిసరిగా పాటించాల్సిన ఈ నిబంధనను తెలంగాణ, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమలు చేయడంలేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కనీసం 12వ తరగతి దాకా తప్పక చదువుకునే అవకాశాన్ని విద్యాహక్కు చట్టం కల్పిస్తుందని, ఇది ఉమ్మడి జాబితాలోని అంశమే అయినా.. దీనిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఎక్కువగా ఉంటుందని అన్నారు. కాగా, ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల అంశంపై కేంద్రంతో సంప్రదింపులు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఆర్‌టీఈ నిబంధన ప్రకారం.. ప్రతి కిలోమీటరుకు ఒక పాఠశాల ఉండాలని, ఈ పరిధిలో ప్రభుత్వ పాఠశాల లేనిచోట ప్రైవేటు స్కూల్‌లో 25 శాతం మంది విద్యార్థులను చేర్పించి.. వారి ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే ఆయా యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ మొత్తం ఫీజులో 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, 60 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ వాటాను తిరిగి రాష్ట్రానికి చెల్లించే అంశంపై కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా స్పందించలేదని, 2010 నుంచి అంశంపై చర్చ జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో సర్కారు ఉందని అంటున్నారు.
Updated Date - Aug 08 , 2024 | 03:40 AM