Flood Relief: ‘ఎస్‌డీఆర్‌ఎఫ్’కు నిధులిస్తున్నాం..
ABN, Publish Date - Sep 05 , 2024 | 03:32 AM
తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణకు తమ వాటా కింద ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్రం వద్ద రూ.1,345 కోట్లున్నాయి
‘యూసీ’లు లేక రూ.208 కోట్లు ఇవ్వలేదు
ఇప్పటికైనా యూసీలిస్తే.. మా వాటా నిధులిస్తాం
సీఎస్‌కు కేంద్ర హోం శాఖ లేఖ
హైదరాబాద్, న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణకు తమ వాటా కింద ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ‘రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్)’ కింద ఇప్పటికే రాష్ట్రం వద్ద రూ.1,345 కోట్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ‘యుటిలైజేషన్ సర్టిఫికెట్ (యూసీ)’ను సమర్పించకపోవడం వల్ల జూన్‌లో ఇవ్వాల్సిన రూ.208.40 కోట్లను విడుదల చేయలేదని కేంద్ర హోం శాఖ వివరించింది. తెలంగాణకు ఎస్‌డీఆర్‌ఎఫ్ వాటా నిధుల విడుదల, వినియోగం అంశాలను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. తగిన చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ మేరకు జాతీయ విపత్తుల విభాగం డైరెక్టర్ ఆశిష్ వి.గవాయ్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల విడుదలపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చారు. ఆగస్టు 31 నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తుతుందంటూ తెలంగాణ ‘స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్‌ఈవోసీ)’ ఫోన్ ద్వారా తెలియజేసిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపింది. కానీ, ఈ వరద పరిస్థితికి సంబంధించి రాష్ట్రం నుంచి నిర్దేశిత పద్ధతిలో ఎలాంటి నివేదికా కేంద్ర హోంశాఖలోని కంట్రోల్ రూమ్‌కు రాలేదని స్పష్టం చేసింది.
అయినా, వరద పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి సహకరించడానికి ఏడు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలను, బోట్లు, ప్రాణ రక్షక పరికరాలను కూడా పంపించామని వివరించింది. రెండు వైమానిక హెలికాప్టర్లను కూడా పంపినట్లు తెలిపింది. ‘‘రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రం వద్ద రూ.1,345 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు అందుబాటులో ఉన్నాయి. 2024-25లో సంభవించే వరదలు, ఇతర నోటిఫైడ్ ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం వీటిని వినియోగించుకోవచ్చు. ఎస్‌డీఆర్‌ఎ్‌ఫకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర వాటా నిధులను విడుదల చేయడానికి అవసరమైన వివరాలు, సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదు. రాష్ట్ర వాటా నిధులతో పాటు కేంద్రం పంపించిన నిధులను ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏప్రిల్, అక్టోబరు నెలల్లో కేంద్ర హోం, ఆర్థిక శాఖలకు సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఖాతా నుంచి వినియోగించిన నిధులు, అందుబాటులో ఉన్న నిధుల వివరాలను తెలపాల్సి ఉంటుంది. 2022-23కు సంబంధించి కేంద్రం తన రెండో వాయిదా వాటా కింద రూ.188.80 కోట్లను 2023 జూలై 10న ఎస్‌డీఆర్‌ఎఫ్ కోసం విడుదల చేసింది. 2023-24కు సంబంధించి ఒక్కో వాయిదా కింద రూ.198 కోట్ల చొప్పున రెండు వాయిదాల నిధులను 2024 మార్చిలో విడుదల చేసింది. 2024 మొదటి వాయిదా నిధులు రూ.208.40 కోట్లను ఎస్‌డీఆర్‌ఎ్‌ఫకు జూన్ 1న విడుదల చేయాల్సి ఉంది. కానీ, దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదు. గతంలో విడుదల చేసిన నిధుల యూసీలనూ సమర్పించలేదు’’ అని కేంద్ర హోంశాఖ వివరించింది. ఇప్పటికైనా పాత నిధుల యూసీలను సమర్పించాలని రాష్ట్రానికి సూచించింది.
Updated Date - Sep 05 , 2024 | 03:32 AM