ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telugu States: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

ABN, Publish Date - Sep 10 , 2024 | 08:59 PM

తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గతంలో బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన విశ్వప్రయత్నాలు సెప్టెంబర్-10 నాటితో ఫలించాయి. ఇక ఏపీకి కూడా శుభవార్తే వచ్చింది.. ఈ మేరకు మంగళవారం రాత్రి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది...

న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి : తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణాలో నాలుగు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు.. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కొత్త ప్రభుత్వ కాలేజీలకు అనుమతిచ్చింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌లోని మెడికల్ కాలేజీలకు కేంద్ర అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నాలుగు కాలేజీల్లో 2024- 25 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని చెప్పింది. వాస్తవానికి.. కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల అనుమతుల కోసం చాలా కాలంగా తెలంగాణా ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. 8 వైద్య కాలేజీల అనుమతికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నో చెప్పింది. ఆ తర్వాత.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త మెడికల్ కాలేజీల అనుమతి కోసం కొంత కాలంగా రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే.. ఎనిమిది కాలేజీలకు అనుమతి కావాలని ప్రయత్నించినప్పటికీ.. నాలుగింటికి మాత్రమే కేంద్రం అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రంలో వైద్య విద్య మరింత మందికి చేరువ కానుందని చెప్పుకోవచ్చు.


ప్రయత్నాలు ఇలా..

మొత్తం ఎనిమిది వైద్య కళాశాలల కోసం గత బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు గట్టిగానే ప్రయత్నాలు చేశాయి. ఈ కాలేజీల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం 2023లో ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. ఇందులో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీలకు మాత్రమే ఎన్‌ఎంసీ అనుమతినిచ్చింది. దీంతో కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. ఎందుకంటే.. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కళాశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడానికి అవకాశం వచ్చింది. ఇక యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌, మెదక్‌ వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరు చేయలేదు. అయితే.. ఇప్పుడు ఈ నాలుగు కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఇందుకు సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది.


ఏపీలో ఇలా..

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. కడప, పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందుకు సంబంధించి తెలంగాణ కాలేజీలతో పాటుగానే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వాస్తవానికి.. గతేడాది జూన్‌లోనే ఐదు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది మోదీ సర్కార్. గతేడాది దేశవ్యాప్తంగా కొత్తగా మరో 50 మెడికల్ ఏర్పాటునకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కొత్త కాలేజీలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఫలితంగా మెడికల్ సీట్లు భారీగానే పెరిగాయి. నాడు.. ఏపీలోని మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు అయ్యాయి. ఇదంతా వైసీపీ హయాంలో జరిగినది కాగా.. మరో రెండు కాలేజీలు కావాలని కూటమి ప్రభుత్వం కోరడంతో తాజాగా రెండు కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓకే చెప్పింది. సో.. ఇకపై రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా మన రాష్ట్రంలోనే వైద్య విద్యను అభ్యసించే అవకాశం దొరికిందన్న మాట.

Updated Date - Sep 10 , 2024 | 09:50 PM

Advertising
Advertising