ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Education system: 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్‌

ABN, Publish Date - Jul 20 , 2024 | 04:07 AM

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

  • రెసిడెన్షియల్‌ బడులు కూడా.. విద్యార్థులకు ఉచిత రవాణా!

  • ప్రీ స్కూళ్లుగా అంగన్‌వాడీలు!.. త్వరలో విద్యా కమిషన్‌ ఏర్పాటు

  • వర్సిటీలకు వీసీలు, సిబ్బంది నియామకం.. విద్యావేత్తలతో సీఎం

  • విద్యారంగ బడ్జెట్‌ను గణనీయంగా పెంచుతామని వెల్లడి

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన బోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అంగన్‌వాడీలను ప్రీస్కూళ్లుగా మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. మూడో తరగతి వరకు ప్రీస్కూళ్లలో; 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్‌, రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి పలువురు విద్యావేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలుతెరిచిన రోజే పిల్లలందరికీ యూనిఫాంలు, పాఠ్య పుస్తకాల అందజేయడంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా బడుల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యావేత్తలు ఇచ్చే మంచి సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.


ఈ సందర్భంగా ప్రొఫెసర్లు హరగోపాల్‌, కోదండరాం, పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, శాంతా సిన్హా, ఆల్దాస్‌ జానయ్య, పద్మజా షా, లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి విద్యా వ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల్లో కార్యకర్తలకు బోధించే నైపుణ్యం ఉండడం లేదని, సరైన వసతులు లేవని చెప్పారు. వాటిని ప్రీ స్కూళ్లుగా మార్చి, వలంటీర్లను తీసుకొని వారికి అవసరమైన శిక్షణ ఇచ్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇక నాలుగో తరగతి నుంచి 12వ తరగతి దాకా సెమీ రెసిడెన్షియల్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. సెమీ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు ప్రభుత్వమే ఉచిత రవాణా సదుపాయం కల్పించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు.


నేను, భట్టి సర్కారీ బడిలోనే చదివాం..

పదేళ్లుగా యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని ప్రొఫెసర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం.. ఇప్పటికే సెర్చ్‌ కమిటీలు వేశామని, త్వరలోనే వీసీల నియామకం పూర్తవుతుందని తెలిపారు. యూనివర్సిటీలకు డెవల్‌పమెంట్‌ గ్రాంట్లు ఇవ్వాలని, ప్రతి వర్సిటీలో వివిధ అంశాలపై లోతైన చర్చ జరగాలని, అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్‌ జానయ్య ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. విద్యా సూచికలో తెలంగాణ అట్టడుగున ఉందని, తామంతా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నామని, ప్రస్తుతం అక్కడా విద్యా ప్రమాణాలు పడిపోయాయని ప్రొఫెసర్లు హరగోపాల్‌, శాంతా సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి తాము ఇప్పటికే మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.


విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై విధాన పత్రం రూపొందిస్తే.. దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆయా అంశాలపై మంత్రివర్గ ఉపసంఘంతోనూ చర్చించాలని వారికి సూచించారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు అతి తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయని, ఇప్పటికే పలు రాష్ట్రాలు వాటి సాధనకు ప్రయత్నిస్తున్నాయని ప్రొఫెసర్‌ జానయ్య సీఎంకు చెప్పగా.. ఆ అంశాన్ని పరిశీలిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 11 శాతంగా ఉన్న విద్యా శాఖ బడ్జెట్‌ తెలంగాణ ఏర్పడిన తర్వాత 6.4 శాతానికి పడిపోయిందని, విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్‌ పెంపు అవసరమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తెలిపారు. తాను, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, కచ్చితంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి బడ్జెట్‌ పెంచుతామని సీఎం అన్నారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలని సీఎం నిర్ణయించారని, బడ్జెట్‌ కేటాయింపులు తప్పకుండా పెంచుతామని భట్టి తెలిపారు. భేటీలో ప్రభుత్వ సలహాదారు కేకే, సీఎం ప్రధాన కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్‌రాజ్‌, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.


ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి: సీఎం రేవంత్‌

రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని ఆదేశించారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు అధికారులతో కలిసి ఆయన విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. సమీకృత రెసిడెన్షియళ్లతో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు కొనసాగేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.


3వ తరగతి వరకు సొంత గ్రామాల్లోని అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో చదివిన అనంతరం 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. 3వ తరగతి వరకు అంగన్‌వాడీల్లోనే విద్యాబోధన అందించేందుకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలించాలని, అంగన్‌వాడీల్లో అదనంగా మరో టీచర్‌ను నియమించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని తెలిపారు. ఆయా ప్రణాళికలను రూపొందించడానికి ముందే విద్యావేత్తలతో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పారు. వారి సూచనల మేరకు ఒకటి, రెండు మండలాల్లో ప్రీ స్కూల్‌, సెమీ రెసిడెన్షియల్స్‌ విధానాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టాలని సూచించారు.

Updated Date - Jul 20 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<