ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nitin Gadkari: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి..

ABN, Publish Date - Jun 27 , 2024 | 03:45 AM

రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ రహదారి నిర్మాణం కోసం ఈ ఏడాది ఎన్‌హెచ్‌ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని కోరారు.

  • దానికి ఈ ఏడాది ప్రణాళికలో నిధులు మంజూరు చేయండి

  • హైదరాబాద్‌-విజయవాడ హైవేను 6 లేన్లుగా విస్తరించండి

  • కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ రహదారి నిర్మాణం కోసం ఈ ఏడాది ఎన్‌హెచ్‌ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే.. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలని అభ్యర్థించారు. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తదితరులు బుధవారం, ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర అంశాలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు.


సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-జగదేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూసేకరణకు అయ్యే ఖర్చులో సగభాగాన్ని తమ ప్రభుత్వమే భరిస్తోందని సీఎం గుర్తుచేశారు. చౌటుప్పల్‌ నుంచి అమన్‌గల్‌-షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకూ (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు. హైదరాబాద్‌ (ఓఆర్‌ఆర్‌ గౌరెల్లి జంక్షన్‌) నుంచి వలిగొండ-తొర్రూర్‌-నెల్లికుదురు-మహబూబాబాద్‌-ఇల్లెందు- కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్‌హెచ్‌-930పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని, ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి భద్రచలానికి 40 కి.మీ. దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్‌ రోడ్‌గా వరంగల్‌ సభలో నితిన్‌ గడ్కరీ పేర్కొన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌ 65) రహదారిని 2024 ఏప్రిల్‌లోగా 6 వరుసలుగా విస్తరించాల్సి ఉండగా.. తమకు సరైన ఆదాయం రావడం లేదంటూ కాంట్రాక్ట్‌ సంస్థ పనులు ప్రారంభించలేదని గడ్కరీకి రేవంత్‌ తెలియజేశారు.


ఐకానిక్‌ బ్రిడ్జ్‌.. ఎలివేటెడ్‌ కారిడార్‌

కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌-సోమశిల-కరివెన-నంద్యాల (ఎన్‌హెచ్‌-167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కి.మీ. పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీకి సీఎం రేవంత్‌ తెలియజేశారు. మిగిలిన 32 కి.మీ.పనులకు, ఐకానిక్‌ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. కల్వకుర్తి-నంద్యాల రహదారి.. హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్‌హెచ్‌ 765కే) 67 కిలోమీటర్‌ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుందని, ఎన్‌హెచ్‌ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున, హైదరాబాద్‌- కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్‌హెచ్‌ 765కే) రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించాలని కోరారు. కల్వకుర్తి-కరివెన వరకు జాతీయ రహదారి పూర్తయ్యేలోపు హైదరాబాద్‌-కల్వకుర్తి రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌-శ్రీశైలం మార్గంలో 62 కిమీ ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని, అటవీ అనుమతులు లేక పనులు చేపట్టలేదని తెలిపారు.ఆమ్రాబాద్‌ ప్రాంతంలో 4 వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు.


మంథనికి జాతీయ రహదారి ప్రకటించండి

మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు మంథని నుంచి ప్రాతినిధ్యం వహించనప్పటికీ ఇప్పటి వరకూ జాతీయ రహదారుల చిత్రంలో మంథనికి చోటు దక్కలేదని.. ఈ నేపథ్యంలో జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తగిన నిధులు మంజూరు చేయాలని గడ్కరీని సీఎం కోరారు. అలాగే.. తెలంగాణను కర్ణాటక, మహారాష్ట్రను అనుసంధానించే హైదరాబాద్‌-మన్నెగూడ నాలుగు వరుసల రోడ్డును జాతీయ రహదారిగా (ఎన్‌హెచ్‌-163) ప్రకటించడంతో భూసేకరణ పూర్తిచేశామని గడ్కరీకి సీఎం వివరించారు. టెండర్లు పిలవడం పూర్తయినా ఎన్జీటీలో కేసు వలన పనులు ప్రారంభం కాలేదని.. ఆ మార్గంలో ఉన్న మర్రి చెట్లను కేంద్ర పర్యావరణ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌లోకేషన్‌ చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించిందని వెల్లడించారు. ఈ మార్గం పనులు ప్రారంభించాలని కోరారు.


టెండర్లు పిలవాలన్నారు: భట్టి

రాష్ట్రానికి పెద్ద వరంగా మారబోయే ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని కేంద్రమంత్రి గడ్కరీకి అందజేసి.. సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు. గడ్కరీతో భేటీ అనంతరం భట్టి , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌- విజయవాడ రహదారిని 6 లేన్లుగా విస్తర్తించేందుకు టెండర్లు పిలవాలని అధికారులను గడ్కరీ ఆదేశించినట్టు తెలిపారు. హైదరాబాద్‌- కల్వకుర్తి రోడ్డు నిర్మాణానికి అంగీకరించారని చెప్పారు. కేంద్రం నుంచి గత ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి మిగతా రాష్ట్రాల కంటే అతితక్కువ నిధులు తెలంగాణకే వచ్చాయని కోమటిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. రోడ్ల నిర్మాణానికి భూసేకరణ, నిధుల పట్ల కేసీఆర్‌ సర్కారు నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌- విజయవాడ రహదారి నిర్మాణం కోసం జూలైలో టెండర్లు పిలిచి.. రూ.4 వేల కోట్లతో రెండేళ్లలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయనున్నట్లు తెలిపారు.


సీఎం రేవంత్‌ చేసిన అభ్యర్థనలు

  • సేతు బంధన్‌ స్కీం కింద 2023-24లో రాష్ట్రప్రభుత్వం సమర్పించిన 12 ఆర్వోబీలు, ఆర్‌యూబీలను వెంటనే మంజూరు చేయాలి.

  • జగిత్యాల-కాటారం (130 కి.మీ.), దిండి-నల్గొండ (100 కి.మీ.), భువనగిరి-చిట్యాల (44 కి.మీ), చౌటుప్పల్‌-సంగారెడ్డి (182 కి.మీ), మరికల్‌-రామసముద్రం (63 కి.మీ.), వనపర్తి-మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ-బీదర్‌ (134 కి.మీ.), కరీంనగర్‌-పిట్లం (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్‌ రోడ్‌-రాయచూర్‌ (67 కి.మీ.), కొత్తపల్లి-దుద్దెడ (75 కి.మీ.), సారపాక-ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ-రాయగిరి క్రాస్‌ రోడ్‌ (63 కి.మీ.), జగ్గయ్యపేట-కొత్తగూడెం (100 కి.మీ.), సిరిసిల్ల-కోరట్ల (65 కి.మీ.), భూత్పూర్‌-సిరిగిరిపాడు (166 కి.మీ.), కరీంనగర్‌-రాయపట్నం (60 కి.మీ.) మొత్తం 1617 కి.మీ. రోడ్లను జాతీయ రహదారులను అప్‌గ్రేడ్‌ చేయాలి.

Updated Date - Jun 27 , 2024 | 03:45 AM

Advertising
Advertising