CM Revanth Reddy: నడ్డా.. అడ్డగోలు మాటలొద్దు
ABN, Publish Date - Dec 08 , 2024 | 03:08 AM
‘‘అడ్డగోలుగా మాట్లాడొద్దు నడ్డా..’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని హెచ్చరించారు. కేసీఆర్ తరహాలో మాట్లాడొద్దంటూ హితవు పలికారు. ‘‘నడ్డా తెలంగాణ గడ్డ మీద అడ్డగోలుగా మాట్లాడవద్దు.
కేసీఆర్ తరహాలో మీరూ నోరు జారొద్దు
బీజేపీ అధ్యక్షుడికి సీఎం రేవంత్ హితవు బీజేపీ రాష్ట్రాల్లో ఏడాదిలో 55,413
ఉద్యోగాలిస్తే ఢిల్లీలో క్షమాపణ చెబుతా
ప్రధాని మోదీకి ఇదే నా సవాల్
బీఆర్‌ఎస్, కేసీఆర్‌ని నకలు కొడుతున్న ఈటల, కిషన్‌రెడ్డి
దొంగల సోపతితో దొంగల బండి ఎక్కొద్దు
కేసీఆర్.. అధికారం ఉంటే ఉప్పొంగడం లేకుంటే కుంగిపోవడం తగదు
మేం మీలా కాదు.. విపక్షంగా పోరాడాం
దుష్ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలి
నల్లగొండ బహిరంగ సభలో సీఎం రేవంత్
మూసీని ప్రక్షాళన చేయకపోతే నల్లగొండలో ఎవరూ బతకరని వ్యాఖ్య
నల్లగొండ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘అడ్డగోలుగా మాట్లాడొద్దు నడ్డా..’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని హెచ్చరించారు. కేసీఆర్ తరహాలో మాట్లాడొద్దంటూ హితవు పలికారు. ‘‘నడ్డా తెలంగాణ గడ్డ మీద అడ్డగోలుగా మాట్లాడవద్దు. ఆయన్నే కాదు.. ప్రధాని మోదీనీ సవాల్ చేస్తున్నా. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. మీ పార్టీ 23 ఏళ్లుగా అధికారంలో ఉన్న, మీరే స్వయంగా 13 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న గుజరాత్‌లో ఇలా ఇచ్చారా? మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక్క ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలిచ్చినట్లు నిరూపించగలరా? అలా నిరూపిస్తే, నేను ఢిల్లీ నడిబొడ్డున నిలబడి మీకు క్షమాపణ చెబుతా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానికి సవాల్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో బ్రాహ్మణవెల్లంల-ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని, దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ యూనిట్-2లో విద్యుత్తు ఉత్పత్తిని రేవంత్ ప్రారంభించారు. నల్లగొండలో వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నల్లగొండలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఈటల.. కేసీఆర్, బీఆర్‌ఎ్‌సని నకలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ఈటల, కిషన్‌రెడ్డీ.. మీరు మారండి. దొంగల సోపతి పట్టి దొంగల బండి ఎక్కకండి.. మీకున్న గౌరవం పోగొట్టుకోకండి’’ అని రేవంత్ పేర్కొన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్క ఏడాదిలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పథకం ఒక్కటి అమలు చేసినట్లు నిరూపిస్తే, తనతోపాటు తన మంత్రివర్గ సహచరులందరితో కలిసి ఢిల్లీ వెళ్లి క్షమాపణ చెబుతామని సవాల్ చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని, వారి హయాంలో చేసిన అప్పులను క్రమపద్ధతిలో తీర్చు తూ, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. అధికారంలో ఉంటే ఉప్పొంగడం, లేకపోతే కుంగిపోవడం తగదని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా.. తాము జనంలోనే ఉన్నామని, ప్రజల తరఫున పోరాడామని.. కేసీఆర్‌లా ఫాంహౌ్‌సలో విశ్రాంతి తీసుకోలేదని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన పాత్ర పోషించాలని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. పాలనలో లోపాలుంటే విమర్శించాలని సీఎం ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ ఇలా సభకు రాకుండా పోలేదన్నారు. నాడు ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి సభలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సూచనలు, సలహాలిచ్చారని.. దారితప్పిన రోజు నిలదీసి పోరాడారని గుర్తుచేశారు. మా ఎమ్మెల్యేలను గుంజుకున్నా మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా పంచపాండవులను వెంటబెట్టుకొని మీపై ధైర్యంగా పోరాడారని, నిలదీశారని, సలహాలిచ్చారని రేవంత్ చెప్పారు.
గాలి బ్యాచ్‌ని తయారు చేసి వదిలారు
‘మీరు మీ పాత్రని పోషించకపోగా, గాలి బ్యాచ్‌ని తయారు చేసి వదిలారు. వారేం మాట్లాడుతున్నారో మీరు వింటున్నారా?’ అని కేసీఆర్‌ని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం చేసినా వాళ్లు వద్దంటున్నారని, ప్రాజెక్టులకు భూసేకరణ వద్దంటున్నారని, కంపెనీలు వద్దంటున్నారని, పెట్టుబడులు వద్దంటున్నారని, గ్రూప్-4, గ్రూప్-1 వేస్తామంటే వ ద్దంటున్నారని.. వద్దనడం తప్ప వాళ్లకేమీ తెలియడం లేదన్నారు. వారి తీరు సరైందో కాదో తెలంగాణ సమాజం ఆలోచించాలని పిలుపునిచ్చారు. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం కాదా? అని రేవంత్ నిలదీశారు. 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నది భవిష్యత్ తరాల బాగు కోసమే కానీ, ఆ కుటుంబంలో నలుగురి కోసం కాదు కదా? అని ప్రశ్నించారు. ఇదే నల్లగొండ గడ్డకు చెందిన శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్నది, ఇషాన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, పోలీస్ కిష్టయ్యలు ఆత్మార్పణలు చేసుకున్నది భవిష్యత్ తరాల కోసం కాదా? అని నిలదీశారు.
యాసంగిలోనూ సన్నాలే వేయండి
యాసంగిలోనూ రైతులు సన్న ధాన్యమే సాగు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎంత సన్న ధాన్యం పండించినా ప్రభుత్వమే కొంటుందని, అంతేకాకుండా క్వింటాకు రూ.500 బోనస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో వరి వేస్తే ఉరేనని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టారని, కానీ తాము వరి వేయాలని, సన్న వడ్లే పండించాలని చెబుతున్నామని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి హాస్టళ్లలో, గురుకులాల్లో పిల్లలకు సన్న బియ్యమే పెడతామని చెప్పారు. ఇక్కడ పండిన సన్న బియ్యమే మన పిల్లలకు పెడదామని అన్నారు.
సంక్రాంతి తర్వాత రైతుభరోసా
సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడుతుంటే బీఆర్‌ఎస్ నేతల గుండెలు గుభేలుమంటాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్తును కొనసాగించడమేగాక, 50 లక్షల కుటుంబాలకు 200 యూ నిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలపై భారం తగ్గించేందుకు రూ.1200 గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యశ్రీని గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల పరిమితితో అమలు చేస్తే, కే సీఆర్ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక రూ.10 లక్షలకు పెంచామన్నారు. హామీల అమలు, రాష్ట్ర ప్రగతి కోసం తాము 18 గంటలు పనిచేస్తుంటే, గాలిబ్యాచ్ గాలి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ గాలి బ్యాచ్ సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తోందని, కాంగ్రెస్ సైనికులంతా దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన పనులను ఊరూరా చాటిచెప్పాలన్నారు.
ఇక్కడి గాలి పీలిస్తేనే పోరాట స్ఫూర్తి..
నల్లగొండ గడ్డమీద గాలి పీలిస్తేనే సాయుధ పోరాట స్ఫూర్తి రగులుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తన పదవికి రాజీనామా చేసి రాష్ట్రం వచ్చాకే మళ్లీ పదవులని ప్రతిన బూనిన కొండా లక్ష్మణ్ బాపూజీ నడయాడిన నేల ఇదని అన్నారు. మలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి, తెలంగాణ ఏర్పడి, ఇందరిమ్మ రాజ్యం వచ్చాకే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఇదని ప్రశంసించారు. సాయుధ పోరాటం లో నిజాం, రజాకార్లను తరిమికొట్టిన మల్లు స్వరాజ్యం, బీఎన్ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రాంచంద్రారెడ్డి, ధర్మభిక్షం వంటి నేతలను ఆదరించిన గడ్డ ఇదని చెప్పారు. ఎందరో యోధులున్న గడ్డపై ప్రజాప్రభుత్వం ఏడాది ఉత్సవాలను జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. జూన్ 2, 2014కి ఎంత ప్రాధాన్యం ఉందో, డిసెంబరు 7, 2023, 2024కి కూడా అంతే ప్రాధాన్యం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నల్లగొండ జిల్లా ఎంత వివక్షకు గురైందో, స్వరాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోనూ అంతే వివక్షకు గురైందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఈ వివక్షను సరిచేసేందుకే ఈ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డికే నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇచ్చినట్లు చెప్పారు. ఈ జిల్లా ప్రాజెక్టులకు ఎవరినీ అడగాల్సిన అవసరం లేకుండా, కావాల్సినన్ని నిధులు వాడుకోవచ్చని, జిల్లా ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని తెలిపారు. వైఎస్ సీఎంగా, జానారెడ్డి, కోమటిరెడ్డి మంత్రులుగా ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు, సాగు నీరిచ్చేందుకు గాను ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని చేపట్టారని గుర్తుచేశారు. ఈ పనులను పూర్తిచేస్తే జిల్లాలో 3.50 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. కానీ, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టుని పడావు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
మూసీ ప్రక్షాళన చేసి తీరతాం
నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలకు కారణమైన మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మూసీని ప్రక్షాళన చేయకపోతే నల్లగొండలో భవిష్యత్‌లో ఎవరూ బతకరని అన్నారు. ‘ప్రజలు వెళ్లి ఈ జిల్లాలో ఉన్న ఏకలింగాన్ని నిలదీయండి, మూసీ ప్రక్షాళన కావాలో వద్దో అడగండి. వద్దంటే ఈ నీళ్లలోనే ముంచండి’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. మూసీని ప్రక్షాళన చేసే బాధ్యత తనదని, అడ్డుకునే వారి సంగతి జిల్లా ప్రజలు చూసుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి జరగాలంటే, ప్రాజెక్టులు రావాలంటే భూసేకరణ అవసరమని, కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గోల్కొండను కుతుబ్‌షాహీలు కడితే, చార్మినార్‌ని అసఫ్ జాహాలు కట్టారని, అ లాగే ఫ్యూచర్ సిటీని తాము కడతున్నామని వివరించారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
సభ విజయవంతం.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగసభ విజయవంతం అయ్యింది. దీంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ వల్లే సభ విజయవంతం అయ్యిందని పేర్కొంటున్నాయి. సుమారు లక్ష మంది సభకు రావడంతో నల్లగొండలో పండుగ వాతావరణం నెలకొంది. కాగా, నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు గంటల 15 నిమిషాల పాటు ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాత్రి 7.25కు రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
ఎస్‌ఎల్‌బీసీని గడువులోగా పూర్తి చేస్తాం : భట్టి
నల్లగొండ, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీశైలం ఎడమ కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నల్లగొండ రాజీవ్ ప్రాంగణంలో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఒక్క ప్రాజెక్టుపై కూడా సమీక్ష నిర్వహించలేదని తెలిపారు. పదేళ్ల కాలంలో ఏడాదికి కిలోమీటరు చొప్పున తవ్వినా.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయి ఉండేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం, డిండి, నక్కలగండి, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు మాత్రమే కాక ఇతర సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రకటించారు. రూ.5వేల కోట్లలో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నామని భట్టి వివరించారు.
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం : ఉత్తమ్
పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులన్నింటినీ పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసి తీరుతామని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేయించేందుకు విదేశాల నుంచి అత్యాధునిక యంత్రాలు తెప్పిస్తున్నామన్నారు. ఆ యంత్రాల కోసం మంత్రి వెంకట్‌రెడ్డి అమెరికా వెళ్లారని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని విమర్శించారు.
ఎస్‌ఎల్‌బీసీని రేవంత్ ప్రారంభించడం ఖాయం : కోమటిరెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం కావడం ఖాయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ తాను డబుల్ ఆర్(రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి) అని పిలుస్తానని తెలిపారు. తన మీద కక్షతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కనపెట్టిందని, ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తామన్నారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టును ప్రారంభించుకోవడంపై ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో మరో దఫా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని, మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కోసం మాట్లాడడం సమయం వృథా అని పేర్కొన్నారు. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నిలిచి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. మూసీ ప్రక్షాళన చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. తన ప్రాణమున్నంత వరకు నల్లగొండ గడ్డకు సేవ చేస్తానని మంత్రి వెంకట్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
Updated Date - Dec 08 , 2024 | 03:08 AM