Share News

CM Revanth Reddy: ఎకరాకు పదివేలు..

ABN , Publish Date - Sep 03 , 2024 | 04:12 AM

వానలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: ఎకరాకు పదివేలు..

  • పంట నష్టపోయిన రైతులకు పరిహారం

  • ఆందోళన వద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

  • వరద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్‌ హామీ

  • వర్షంలోనే ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పర్యటన

  • గండిపడిన సాగర్‌ ఎడమకాలువ సందర్శన

  • మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా 5 లక్షలు

  • బాధిత జిల్లాలకు రూ.5 కోట్ల తక్షణ సాయం

  • ఇల్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు

  • ప్రధాని రావాలి.. తక్షణం రూ.2వేల కోట్లు ఇవ్వాలి

  • కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రేవంత్‌

  • ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తరహాలో టీజీ-డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): వానలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, రహదారులు, కాలువలు, చెరువులకు గండ్లు పడడంతోపాటు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, స్తంభాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల్లో రూ.5,438 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిపారు. అయితే ఇంకా వర్షాలు కురుస్తున్నాయని, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయని సమాచారం వస్తోందని అన్నారు.


ప్రస్తుతం అధికార యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమయిందని, వర్షం తెరిపి ఇవ్వగానే పూర్తి స్థాయి నష్టం అంచనాలు వేస్తామని చెప్పారు. వరదల్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. దీంతోపాటు పాడి పశువుల పరిహారం రూ.30 వేల నుంచి రూ.50 వేలకు, మేకలు, గొర్రెల పరిహారం రూ.5 వేలకు పెంచి ఇస్తామన్నారు. ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి.. బాధితులతో మాట్లాడారు. వారిని ఓదార్డారు.


  • కంటిపై కునుకు లేకుండా...

తొలుత హైదరాబాద్‌లోనిపోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ తరువాత వరద బాధిత ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. తొలుత సూర్యాపేట జిల్లాలో నష్టాన్ని పరిశీలించి.. మోతెలో అధికారులతో సమీక్షించారు. అనంతరం ఖమ్మం జిల్లాకు చేరుకొని.. నాయకన్‌గూడెం వద్ద పాలేరు కాలువ పొంగి రహదారి తెగిపోవడం, పాలేరు ఎడమ కాలువకు గండి పడడంతో వాటిని పరిశీలించారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకుని, మున్నేరు వరదతో మునిగి తీవ్రంగా నష్టపోయిన పోలేపల్లి, పెద్ద తండా, బొక్కలగడ్డ కాలనీలను పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి, బాధితులను ఓదార్చారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.


ఆయా సందర్భాల్లో సీఎం మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం వర్షాలు ప్రారంభమైన దగ్గర్నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ కమిషనర్‌, కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని, కంటిపై కునుకు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం అండగా ఉందనే విశ్వాసం బాధితులకు కల్పించేందుకు స్వయంగా వచ్చానన్నారు. మంత్రులు, అధికారులు అద్భుతంగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో విశ్రాంతి తీసుకుంటూ మౌనముద్రలో ఉన్నారని విమర్శించారు. ేస్నహితులతో కలిసి అమెరికాలో ఎంజాయ్‌ చేస్తున్న కేటీఆర్‌.. క్షేత్రస్థాయిలో ఉన్న తమ మంత్రులపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.


  • జాతీయ విపత్తుగా ప్రకటించాలి..

రాష్ట్రంలో సంభవించిన విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని, రూ.5వేల కోట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌ కోరారు. తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు విడుదల చేసేలా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చొరవ తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని చూడాలన్నారు. రాష్ట్రంలో వరద కష్టాలకు చలించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొంత సహాయం ప్రకటించారని, కల్వకుంట్ల కుటుంబం మాత్రం రూ.లక్షల కోట్లు సంపాదించి కూడా చిల్లిగవ్వ సహాయం చేయరని విమర్శించారు.


వరదలతో అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, వైద్యారోగ్య శాఖాధికారులు మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. పని చేయని ఉద్యోగులపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, తాము ఆ విధులు నిర్వహిస్తున్నామని, వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


  • బాధిత జిల్లాలకు రూ. 5 కోట్ల తక్షణ సాయం..

భారీ వర్షాలకు నష్టపోయిన బాధిత జిల్లాలకు రూ. 5 కోట్ల చొప్పున తక్షణ సహాయాన్ని విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్‌ చెప్పారు. సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌కు వెళ్లి ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. వివిధ జిల్లాల్లో జరిగిన విధ్వంసాన్ని వీడియో ఫుటేజీ ద్వారా వీక్షించారు. కాగా, మంగళవారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అఽధికారులు చెప్పగా.. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.


  • వర్షంలో తడుస్తూనే సీఎం పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరద ప్రాంతాల్లో జోరువానలో పర్యటించి వరద బాదితులకు భరోసా ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించి సమీక్ష నిర్వహించిన అనంతరం పాలేరు చేరుకుని అక్కడ వరద కారణంగా పాలేరు-నాగార్జునసాగర్‌ కాలవకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. సాయంత్రం వర్షంలోనే ఖమ్మంరూరల్‌ మండలం కరుణగిరిలో వరద ప్రాంతాన్ని సందర్శించారు. మున్నేరు నది ఉధృతి, బీభత్సాన్ని స్వయంగా పరిశీలించారు. ఓపెన్‌టా్‌ప జీపులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రాజీవ్‌గృహకల్ప కాలనీకి వెళ్లారు. అక్కడ ఒక ఇంటిలోకి వెళ్లి మహిళతో మాట్లాడి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. అక్కడినుంచి ఖమ్మం చేరుకున్నారు.


మంత్రి తుమ్మలతో కలిసి ఖమ్మంలోని బొక్కలగడ్డ ప్రాంతానికి వెళ్లి వరద బాధితులను కలిశారు. అనంతరం వర్షంలోనే ఓపెన్‌టా్‌ప జీపుపై ఖమ్మం నగరంలో నష్టాన్ని పరిశీలిస్తూ కలెక్టరేట్‌కు చేరుకుని వరదనష్టంపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మంలో మున్నేరుకు రెండువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించి ఖమ్మం పట్టణంతోపాటు, ఖమ్మం రూరల్‌ మండలానికి వరద బెడద లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.650 కోట్లతో టెండర్లు పూర్తిచేయించి పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో సీఎం రేవంత్‌ బస చేశారు. కాగా, భారీ వర్షాలతో అతలాకుతలమైన మహబూబాబాద్‌ జిల్లాకు సీఎం మంగళవారం వెళ్లనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం రావడంతో మరిపెడ, నెల్లికుదురు మండలాల్లో సీఎం సందర్శించే ప్రాంతాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.


  • జీహెచ్‌ఎంసీ పరిధిలో జాగ్రత్త !

హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్తు, ట్రాఫిక్‌, తాగునీరు, శానిటేషన్‌ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. నిత్యం రెక్కాడితే గాని డొక్కాడని కూలీలకు ఈ సమయంలో పనులు దొరకవని, వారికి రేషన్‌ అందజేయాలని అన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 04:14 AM