CM Revanth Reddy: స్కిల్ వర్సిటీ కులపతిగా సీఎం!
ABN, Publish Date - Aug 02 , 2024 | 03:15 AM
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (యువ భారత నైపుణ్యాల విశ్వవిద్యాలయం)’కి ముఖ్యమంత్రే కులపతిగా వ్యవహరించనున్నారు.
ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.25 లక్షల ఖర్చు
నిధుల సమీకరణ బాధ్యత వర్సిటీదే
‘స్కిల్ వర్సిటీ’ బిల్లులో కీలకాంశాలు
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (యువ భారత నైపుణ్యాల విశ్వవిద్యాలయం)’కి ముఖ్యమంత్రే కులపతిగా వ్యవహరించనున్నారు. సాధారణంగా ప్రతి ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర గవర్నర్ కులపతిగా ఉంటారు. అయితే రేవంత్ సర్కారు ప్రవేశపెట్టిన స్కిల్ వర్సిటీ బిల్లులో కులపతిగా రాష్ట్ర గవర్నర్/ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. ఇద్దరిలో ఎవరైనా ఉండవచ్చని బిల్లులో పేర్కొన్నప్పటికీ వర్సిటీ ఆలోచన సీఎం రేవంత్‌రెడ్డిదే కావడం, దాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కులపతిగా ఆయనే ఉంటారని తెలిసింది. స్కిల్ యూనివర్సిటీలో చేరాలనుకున్న వారికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మార్కుల ఆధారంగా కూడా ప్రవేశాలు కల్పిస్తారు.
పరిశ్రమలే ఈ విశ్వవిద్యాలయానికి నిధులు అందిస్తాయి. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో కూడా వర్సిటీ నిధులు సమకూర్చుకుంటుంది. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలపై ఇక్కడ శిక్షణ ఇచ్చేలా కోర్సులను డిజైన్ చేస్తారు. ఈ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులకు పరిశ్రమలు ఇంటర్న్‌షిప్, అప్రెంటి్‌సషి్‌పలు అందించాలి. కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు నియామకాలకు తోడ్పాటునివ్వాలి. మరోవైపు వర్సిటీలో నిర్మించే భవనాలకు విరాళాలిచ్చిన వ్యక్తులు, సంస్థల పేర్లు పెడతారు. వర్సిటీకి నిధులు అప్పుగా తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
వర్సిటీకి అనుబంధంగా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే కేంద్రాల్లో కల్పించే ప్రవేశాల్లో మహిళలు, ఇతర వెనకబడిన వర్గాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ వర్సిటీలో ఇచ్చే డిగ్రీలకు ఇతర వర్సిటీల సర్టిఫికెట్లతో సమాన గుర్తింపు కల్పిస్తారు. ఇక్కడ ఒక్కో విద్యార్థికి నైపుణ్యాల శిక్షణకయ్యే ఖర్చు రూ.1.25 లక్షలు. ఇందులో రూ.75 వేలను వర్సిటీయే భరిస్తుంది. విద్యార్థి నుంచి రూ.50వేలు వసూలు చేస్తుంది. ఇందులో మళ్లీ 30 శాతం రీయింబర్స్‌మెంట్‌గా ఇవ్వనున్నారు.
Updated Date - Aug 02 , 2024 | 03:15 AM