CM Revanth Reddy: బడి.. పెట్టుబడి
ABN, Publish Date - Dec 15 , 2024 | 03:13 AM
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలను బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు.
బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా గురుకులాలు!
విద్యాశాఖను నేనే చూస్తున్నా.. గాడిన పెడతా
రూ.21 వేల కోట్లు ఇచ్చాం.. మరింత పెంచుతాం
విద్యార్థుల మృతిపై ఆత్మ పరిశీలన అవసరం
పిల్లలతోనే భోజనశాల నిర్వహణ కమిటీలు
చరిత్రలో లేనంతగా డైట్, కాస్మెటిక్ చార్జీల పెంపు
చిలుకూరు సాంఘిక సంక్షేమ గురుకులంలో
ఉమ్మడి ఆహార ప్రణాళిక ప్రారంభంలో సీఎం రేవంత్
రంగారెడ్డి అర్బన్/మొయినాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలను బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. ఈ పెట్టుబడి తెలంగాణను బలోపేతం చేస్తుందని, అభివృద్ధి వైపు నడిపిస్తుందని, రాష్ట్ర ప్రతిష్ఠను నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో కామన్ డైట్ ప్లాన్‌ను (ఉమ్మడి ఆహార ప్రణాళిక) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు కేటాయించామని, భవిష్యత్‌లో ఇంకా నిధులు పెంచుతామన్నారు. విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు ఆ శాఖను తానే స్వయంగా చూస్తున్నానని తెలిపారు. ‘రానున్న రోజుల్లో నేను ఎక్కడికెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను సందర్శిస్తా. పిల్లలతో మాట్లాడుతా.
భోజనాన్ని పరిశీలిస్తా. ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. గురుకులాల విద్యార్థులు అనాథలు కాదు.. వాళ్లు రాష్ట్ర సంపద. వారికి నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యార్థులతో మెస్ మేనేజ్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని, వారు తినే ఆహారాన్ని వాళ్లే పర్యవేక్షించే వీలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 1971లో ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న వాళ్లు ఎంతోమంది గొప్పగా రాణించారని.. ఐఏఎస్, ఐపీఎ్‌సలుగా ఎంపికయ్యారని.. బుర్రా వెంకటేశం ఐఏఎస్, మహేందర్ రెడ్డి ఐపీఎస్.. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులే అని చెప్పారు. విద్యావ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. పెరిగిన ధరలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచుతున్నామని.. దేశ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం పెంచడం ఎక్కడా జరగలేదని రేవంత్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
ప్రభుత్వ టీచర్లకంటే ఎక్కువ అర్హతలున్నాయా?
రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 11 వేల ప్రైవేటు స్కూళ్లలో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో చదువు చెప్పే వారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఎక్కువ అర్హతలున్నాయా అని ప్రశ్నించారు. బహుముఖ ప్రజ్ఞాశాలులుగా విద్యార్థులను మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? ఈ దిశగా మనం ఎందుకు ఆలోచించొద్దు? ఇది మన బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. పిల్లలు మట్టిలో మాణిక్యాలని.. వారిలో ఉన్న బహుముఖ ప్రజ్ఞను గుర్తించాలని సూచించారు.
ఆత్మపరిశీలన అవసరం
‘ఆర్థిక ఇబ్బందుల వల్ల తల్లితండ్రులు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. మనల్ని నమ్మి వారి పిల్లలను ఇక్కడకు పంపిస్తున్నారు. విద్యార్థుల మృతిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఫుడ్ పాయిజన్ జరిగి ఈ మధ్య ఒక బాలిక మరణించింది. ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు? శ్రీమంతుడైనా, పేదవాడైనా కన్నబిడ్డలను ఒకే విధంగా ప్రేమిస్తారు. మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మన గౌరవ ప్రతిష్ఠలను పెంచేదా? తగ్గించేదా? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని సీఎం రేవంత్ అధికారులకు, ఉపాధ్యాయులకు హితవు పలికారు. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహేశ్వరంలో 60 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కిల్ డెవలె్‌పమెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వెల్లడించారు. ఇంజనీరింగ్ కోర్సు నాలుగేళ్లు కాగా రెండేళ్లు థియరీ, రెండేళ్లు శిక్షణ ఉండేలా సిలబ్‌సను మార్చటంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. కుట్టు పనికి ఇచ్చే రుసుం రూ.25 నుంచి రూ.75కు పెంచి వారికి అప్పగించామని తెలియజేశారు.
మీలో టాలెంట్‌కు సాన పెట్టండి
2028 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్స్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిఖత్ జరీన్, సిరాజ్ లాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ‘క్రీడల్లో రాణించండి.. మీలో టాలెంట్‌కు సానపెట్టండి’ అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. వారికి కావాల్సిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.120 కోట్ల పెట్టుబడితో 2 వేల మంది విద్యార్థులు చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థి పాటకు సీఎం ఫిదా
చదువు ప్రాధాన్యతను తెలుపుతూ ఈ కార్యక్రమంలో నందకిశోర్ అనే 9వ తరగతి విద్యార్థి పాట పాడగా.. ఆ విద్యార్థిని సీఎం అభినందించారు. ఆ విద్యార్థితో ఎలా చదువుకుంటున్నావని అడిగారు. హాస్టల్‌లో పెడుతున్న ఆహారం ఎలా ఉంది? మెనూ ప్రకారం పెడుతున్నారా? అని సీఎం విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చిలుకూరు గురుకుల పాఠశాలలో చదువుకుని ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న పలువురు విద్యార్థులకు సీఎం ల్యాప్‌టా్‌పలను అందజేశారు.
వివిధ జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు
తెలంగాణ ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా శనివారం ‘గురుకుల బడి-అమ్మఒడి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సర్కారు బడుల బాట పట్టారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. అనంతరం కొత్త మెనూను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వికారాబాద్ జిల్లా ఎన్నపల్లి చౌరస్తాలోని మైనారిటీ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికల)లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విద్యార్థులకు నూతన డైట్‌ను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురం గిరిజన గురుకుల పాఠశాలలో, వరంగల్ జిల్లా మరిపెడలో సోషల్ వెల్పేర్ గురుకుల స్కూళ్లో కామన్‌డైట్ ప్రోగ్రాంను మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్‌లోని గురుకులంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షేక్‌పేట్ గురుకులంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లోని గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు కామన్‌డైట్ మెనూను ప్రారంభించారు.
హాస్టల్ విద్యార్థుల భోజనమిదీ...
గురుకుల విద్యాలయాల హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నందున... ప్రభుత్వం ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నది. హాస్టళ్లలో విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల(మెనూ)ను నిర్దేశించింది. నాలుగు వారాల పాటు ఒక్కో రోజు అందించాల్సిన ఆహార పదార్థాలను వెల్లడించింది. ఇదే సందర్భంలో విద్యార్థుల కోసం కొత్త మెనూను విడుదల చేసింది. ఒక్కో వారంలో ఎలాంటి పదార్థాలు వండి వడ్డించాలో సూచించింది.
Updated Date - Dec 15 , 2024 | 03:13 AM