Congress Guarantees: ఆరింటిలో.. కొన్నింటికి గ్యారెంటీ లేదు!
ABN, Publish Date - Jul 26 , 2024 | 05:17 AM
ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు తాజా బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదు. దాంతో ఈ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
బడ్జెట్‌లో కేటాయింపులను చూపలేదు
బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి రూ.4,084 కోట్లు
రైతు భరోసాకు 15 వేల కోట్లు
గృహజ్యోతికి రూ.2,418 కోట్లు.. ఇళ్లకు రూ.7,740 కోట్లు
పింఛన్లకు రూ.14,861 కోట్లు
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు తాజా బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదు. దాంతో ఈ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి. ఈ స్కీమ్‌లో మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. మహాలక్ష్మిలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం మాత్రం ప్రారంభమైంది. ఈ పథకానికి రూ.723 కోట్లను కేటాయించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకానికి రూ.4,084 కోట్ల కేటాయింపులు జరిగాయి.
రెండో గ్యారెంటీ అయిన రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇంకా అమల్లోకి రావాల్సి ఉన్న ఈ పథకానికి రూ.15,075 కోట్లను కేటాయించారు. గతంలో అమలైన రైతుబంధుకు ఇంతే మొత్తంలో కేటాయింపులు ఉండేవి. రైతు భరోసాలోని మరో పథకం ‘వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు’ స్కీమ్‌కు రూ.1,200 కోట్లను కేటాయించారు. ఈ పథకం కూడా ఇంకా ప్రారంభం కావాల్సి ఉండగా.. వరికి బోనస్ పథకానికి రూ.1,800 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి.
మూడో గ్యారెంటీ అయిన గృహజ్యోతి ఇప్పటికే అమల్లోకి వచ్చింది. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తును అందించే ఈ పథకానికి రూ.2,418 కోట్లను ప్రకటించారు.
నాలుగో గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఈ పథకానికి రూ.7,740 కోట్లను కేటాయించారు.
విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డులు ఇచ్చే ఐదో గ్యారెంటీ అయిన యువ వికాసాన్ని గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.
చేయూత పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ఆరో గ్యారెంటీ ఇచ్చారు. గత బడ్జెట్‌లో ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్లను కేటాయించగా.. ఈ సారి రూ.14,861 కోట్లను కేటాయించారు. అయితే.. పింఛన్లను రూ.4 వేలకు పెంచాలంటే.. ఈ కేటాయింపులు సరిపోవని తెలుస్తోంది. మొత్తమ్మీద ఆరు గ్యారెంటీలకు రూ.47,167 కోట్లను కేటాయించారు.
Updated Date - Jul 26 , 2024 | 05:17 AM