Share News

Amit Shah: కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు..కానీ మోదీ చెప్పింది చేస్తారు

ABN , Publish Date - May 09 , 2024 | 01:18 PM

2024 ఎన్నికలు రాహుల్ గాంధీకి, ప్రధాని మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) వ్యాఖ్యానించారు. హోంమంత్రి యాదాద్రి భువనగిరిలోని బహిరంగ సభలో ప్రసంగించిన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.

Amit Shah: కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు..కానీ మోదీ చెప్పింది చేస్తారు
Amit Shah yadadri bhuvanagiri

2024 ఎన్నికలు రాహుల్ గాంధీకి, ప్రధాని మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) వ్యాఖ్యానించారు. హోంమంత్రి యాదాద్రి భువనగిరిలోని బహిరంగ సభలో ప్రసంగించిన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు. అంతేకాదు ఇవి కుటుంబ అభివృద్ధి, దేశ అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణ(telangana)లో బీజేపీ 2019 ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచింది. కానీ ఈసారి 10 సీట్లు గెలవబోతున్నామని తెలిపారు. మూడు విడతల్లో ఇప్పటికే 200 సీట్లు గెలిచామని, మిగిలిన దశల్లో మొత్తం 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వడంతో షెడ్యూల్ కులాలు, తెగల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అమిత్ షా చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీకి రాష్ట్రంలో పది సీట్లు ఇస్తే ముస్లింల రిజర్వేషన్ తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో రాహుల్ బాబా ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ వాగ్దానాలు ఎప్పటికీ అమలు చేయదని, కానీ ప్రధాని మోదీ చెప్పింది తప్పక అమలు చేస్తారని హో మంత్రి పేర్కొన్నారు.


అంతేకాదు ఇప్పటికే వాగ్దానం చేసినట్లుగానే ప్రధాని మోదీ(pm modi) రామ మందిర నిర్మాణం చేయించి చూపించారని అమిత్ షా గుర్తు చేశారు. ఖర్గే చెప్పినట్టుగా రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు కశ్మీర్‌కు ఏమి సంబంధమని ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 370ని తొలగించి కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం ఎగరేలా చేశామని షా అన్నారు. మోదీ ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి వాటిని రూపుమాపి మావోయిస్టు సిద్ధాంతాలు లేకుండా చేస్తున్నారని హోమంత్రి పేర్కొన్నారు.


అసలు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓవైసీని నిలువరించగలవా అని షా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏబీసీ అనే పదాలకు కొత్త అర్థాలు చెప్పారు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్ అని అమిత్ షా వెల్లడించారు. ఈ పార్టీలు గతంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహించలేదని హోం మంత్రి ప్రస్తావించారు. ఇలాంటి పార్టీలను ప్రజలు నమ్మోద్దని ప్రజలకు సూచించారు.


ఇవి కూడా చదవండి..

Sabita Reddy: కాంగ్రెస్‌ గ్యారెంటీలకు కాలం చెల్లింది..


KCR : చిన్నపాటి వానకే పది గంటలు కరెంట్‌ పోతదా?

Read more Telangana News and Telugu News

Updated Date - May 09 , 2024 | 01:37 PM