Medication Stock: ఔషధాల కొనుగోలులో ఇష్టారాజ్యం!
ABN, Publish Date - Jul 11 , 2024 | 04:17 AM
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొందరు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సర్కారీ దవాఖానాల్లో అత్యవసర, ప్రాణాపాయ మందులు సరిపడా లేని పరిస్థితి ఉంటే.. అన్ని ఆస్పత్రుల్లో వినియోగించని ఓ ఔషధాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
1.31కోట్ల టీకాగ్రేలార్ మాత్రలకు ఇండెంట్.. గత మార్చి 21న పర్చేస్ ఆర్డర్ జారీ
రూ.4.71కోట్ల వ్యయంతో 32.76 లక్షల మాత్రల కొనుగోలు
రూ.9కు దొరికే ఔషధానికి రూ14.39 వెచ్చించిన టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ
‘యూనివర్సల్’లోకి స్పెషాలిటీ ఔషధం
1.46 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
ఐరన్ ఇంజక్షన్లతో 5.89 కోట్ల భారం
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కొందరు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు సర్కారీ దవాఖానాల్లో అత్యవసర, ప్రాణాపాయ మందులు సరిపడా లేని పరిస్థితి ఉంటే.. అన్ని ఆస్పత్రుల్లో వినియోగించని ఓ ఔషధాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని బోధన ఆస్పత్రులు, జిల్లా-ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు వేర్వేరుగా విభాగాధిపతులు ఉంటారు. ఈ ముగ్గురిలో ఓ విభాగాధిపతి 1.31 కోట్ల టీకాగ్రేలార్ మాత్రలు కావాలని గత మార్చిలో టీఎ్‌సఎంఎ్‌సఐడీసీకి ఇండెంట్ పెట్టారు. దీన్ని చూసి అప్పుడు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండీగా ఉన్న కర్ణన్ ఆశ్చర్యపోయారు. అసలు ఆ ఔషధాన్ని అన్ని ఆస్పత్రుల్లో వినియోగించరు. అలాంటి డ్రగ్‌కు భారీగా ఇండెంట్ పెట్టడంపై అనుమానంతో కేవలం 25శాతం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ మేరకు మార్చి 21న పర్చేజ్ ఆర్డర్ నంబరు 10282400404 (2392/2కే2304/212/878) ద్వారా సిగ్నేచర్ ఫైటో కెమికల్ ఇండ్రస్ట్రీస్ నుంచి టీకాగ్రేలార్ 90 ఎంజీ మాత్రలను కొన్నారు. 32,76,600 మాత్రలకు రూ.14.39 చొప్పున రూ.4,71,56,827 వెచ్చించారు. వాస్తవానికి టీకాగ్రేలార్ అనేది స్పెషాలిటీ డ్రగ్. రక్తాన్ని పలుచన చేసేందుకు వినియోగిస్తారు. మందు పూసిన స్టంట్ వేయించుకున్న రోగులకు దీన్ని కార్డియాలజిస్టులు సిఫారసు చేస్తారు. అత్యవసరం కాని ఈ ఔషధాన్ని సదరు విభాగాఽధిపతి యూనివర్సల్ జాబితాలో చేర్చి మరీ.. భారీగా ఇండెంట్ పెట్టారు. తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఈ డ్రగ్ స్పెషాలిటీ జాబితాలోనే ఉంది. ఇదే ఔషధాన్ని ఆ రాష్ట్ర వైద్యశాఖ యూనిక్యూర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నుంచి రూ.9కే కొనుగోలు చేసింది. మన దగ్గర దాన్ని రూ.14.39 పెట్టి కొన్నారు. అంటే ఒక్కో మాత్రకు అదనంగా రూ.5 చెల్లించారు. దీంతో రూ.1.46 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో సదరు విభాగాధిపతితోపాటు వైద్య ఆరోగ్యశాఖకే చెందిన మరి కొందరు పెద్దలు, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీలోని కొందరు ఉద్యోగులు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆ ఇండెంట్ పెట్టించేందుకు పెద్దఎత్తున డబ్బులు చేతులు మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ నుంచి వెళ్లిపోయిన రెగ్యులర్ ఉద్యోగుల హస్తం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐరన్ ఇంజక్షన్ల కొనుగోలులోనూ ఇంతే...
ఇదొక్కటే కాదు.. ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్ ఇంజక్షన్లను సైతం భారీ ధరకు కొనుగోలు చేశారు. రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఈ ఇంజక్షన్లు వాడతారు. కాగా, ఈ ఇంజక్షన్లకు సంబంధించిన పేటెంట్ ముగిసి.. జనరిక్ డ్రగ్‌గా ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. పేటెంట్ ఉన్న సమయంలో ఈ ఇంజక్షన్ ఒక్కోటి రూ.1485 పెట్టి టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇది జనరిక్ డ్రగ్‌గా మారడంతో మార్కెట్లో కేవలం రూ.178కే లభిస్తోంది. సరిగ్గా ఇదే ధరకు మధ్యప్రదేశ్ మెడికల్ కార్పొరేషన్ కోనుగోలు చేసింది. కానీ, పేటెంట్ సమయం ముగుస్తుందనగా టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ అధికారులు హడావుడిగా 46వేల ఇంజక్షన్లను రూ.1,485 చొప్పున ఎంక్యూర్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ వద్ద 50వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని కొన్నారు. కొన్ని రోజులు ఆగి ఉంటే కేవలం రూ.92లక్షలకు వచ్చే 46వేల ఇంజక్షన్లకు ఏకంగా రూ.6.81కోట్లు ఖర్చు చేశారు. ఈ నెల 3వ తేదీనే ఇందుకు సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ నంబరు 10282401042 (4282/2కే24-క్యూ1/ఎంహెచ్‌ఎన్-ఎఎంబీ/1)ను జారీ చేశారు. దీంతో అదనంగా రూ.5.89కోట్లు సర్కారుపై భారం పడింది. అత్యవసరం కాని ఈ ఔషధాన్ని కూడా పెద్ద తలకాయల ఒత్తిడితో టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వైద్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
Updated Date - Jul 11 , 2024 | 04:17 AM