Share News

HMDA: పెద్ద వెంచర్లన్నీ పెండింగ్‌లోనే!

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:25 AM

రాజధాని హైదరాబాద్‌లో భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, పెద్ద లే అవుట్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి!

HMDA: పెద్ద వెంచర్లన్నీ పెండింగ్‌లోనే!

  • 2 వేల చ.గజాలకు పైబడిన స్థలాల్లోభవనాలకు, 5 ఎకరాల పైనున్న లేఔట్లకు అనుమతుల ఆలస్యం

  • భవన నిర్మాణ, లేఅవుట్‌, ఆక్యుపెన్సీకి సంబంధించి 1012 ఫైళ్లు పెండింగ్‌.. డెవలపర్ల పడిగాపులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, పెద్ద లే అవుట్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి! 2వేల చదరపు గజాలలోపు విస్తీర్ణం ఉన్న జాగాలో భవనాల నిర్మాణాలకు, ఐదెకరాలలోపు లే అవుట్లకు అనుమతులు త్వరగానే వస్తున్నాయిగానీ.. అంతకు మించినవాటికి సంబంధించిన దస్త్రాలు మాత్రం మూణ్నెల్లుగా (మే నుంచి) వివిధ దశల్లో అధికారుల వద్దే నిలిచిపోతున్నాయి!! దీంతోడెవలపర్లు, బిల్డర్లు అనుమతుల కోసం పడిగాపులు కాస్తున్నారు. నిజానికి.. దేశంలోని ఇతర రాష్ట్రాలు, మెట్రోపాలిటన్‌ నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో భవన నిర్మాణ అనుమతులు సులువుగా, త్వరగా వస్తాయనే పేరుంది.


దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తొలిసారిగా ఆన్‌లైన్‌లోనే భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులిచ్చేందుకు డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎ్‌స)ను హెచ్‌ఎండీఏ తొమ్మిదేళ్ల క్రితమే అమల్లోకి తేవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ విధానాన్ని అనుసరిస్తూ టీఎ్‌సబీపా్‌సను తీసుకొచ్చారు. సత్వర అనుమతుల విధానం రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకుపోయేందుకు దోహదపడింది. దేశంలోని పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను, డెవలపర్లను ఆకర్షించింది.


రాష్ట్రంలోని డెవలపర్లు, సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నిర్మాణ సంస్థలు కూడా హైదరాబాద్‌లో భారీ నిర్మాణ, లేఅవుట్‌ ప్రాజెక్టులు చేపడుతున్నాయంటే కారణం అదే. అయితే గత ప్రభుత్వ హయాంలో హెచ్‌ఎండీఏ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా అనుమతులిచ్చారనే ఆరోపణల నేపథ్యంలో.. హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో ఏసీబీ అధికారులు వరుసగా సోదాలు జరిపారు. విజిలెన్స్‌ అధికారులు కీలక దస్త్రాలను పరిశీలించారు. దీంతో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.


  • వివిధ దశల్లో..

ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ, లేఅవుట్‌, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌లకు సంబంధించిన 1012 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 788 దరఖాస్తులు టీజీబీపా్‌సలో వచ్చినవి కాగా.. 288 అప్లికేషన్లు హెచ్‌ఎండీఏ డీపీఎంఎస్‌ ద్వారా వచ్చినవి. వీటికి సంబంధించి అత్యధిక ఫైళ్లు ఉన్నతస్థాయి అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. డీపీఎంఎ్‌సలో ఓపెన్‌ లేఅవుట్‌ డ్రాఫ్ట్‌, ఫైనల్‌ లేఅవుట్‌ దస్త్రాలు 87 పెండింగ్‌లో ఉండగా.. అందులో 26 వరకూ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ వద్దే కదలకుండా ఉన్నాయి. పది రోజుల నుంచి 81 రోజుల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక టీజీబీపా్‌సలో 21 రోజులు దాటిన దరఖాస్తులు 525 వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

Updated Date - Sep 28 , 2024 | 04:25 AM