Cybersecurity: సైబర్ నేరాల కట్టడికి ముందుకు రండి
ABN, Publish Date - Aug 10 , 2024 | 03:43 AM
ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ సెక్యూరిటీ అత్యంత కీలకంగా మారిందని డీజీపీ డా. జితేందర్ అన్నారు. సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేయండి
యువతకు డీజీపీ జితేందర్ పిలుపు
బాధితుల్లో 70 శాతం మంది విద్యావంతులే..
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖాగోయల్
దేశంలో ప్రతి నిమిషానికి 2 సైబర్ నేరాలు
ఐటీ ఎలకా్ట్రనిక్స్ విభాగం డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా
హ్యాకథాన్ ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ సెక్యూరిటీ అత్యంత కీలకంగా మారిందని డీజీపీ డా. జితేందర్ అన్నారు. సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ అంశాల్లో నైపుణ్యం ఉన్న యువకులు సమాజం, పౌరుల సైబర్ భద్రతకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేయాలని డీజీపీ ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘‘ది గ్రేట్ యాప్‌సెక్ హ్యాకథాన్-2024’’ను నిర్వహిస్తోంది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ హాజరై ఈ హ్యాకథాన్‌ను ప్రారంభించారు.
పోలీసులతోపాటు యువత సైబర్ నేరాల కట్టడిలో ముందుండాలని డీజీపీ సూచించారు. సైబర్ భద్రతలో భాగంగా టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘ది గ్రేట్ యాప్‌సెక్ హ్యాకథాన్-2024’ నిర్వహిస్తోందన్నారు. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల నుంచి పది వేల మంది ఈ హ్యాకథాన్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సైబర్ నేరాల బారిన పడుతున్నవారిలో 70 శాతం మంది చదువుకున్న వారే ఉన్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ షిఖాగోయల్ తెలిపారు.
బాధితుల్లో 56 శాతం మంది ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉండడం విశేషమన్నారు. దేశంలో ప్రతి నిమిషానికి రెండు సైబర్ నేరాలు నమోదు అవుతున్నాయని ఐటీ ఎలకా్ట్రనిక్స్ విభాగం డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా తెలిపారు. చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదన్నారు. గత సంవత్సరం దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ. 7500 కోట్లు కొల్లగొట్టారని ఆయన చెప్పారు. సైబర్ నేరగాళ్లు దోచిన సొమ్మును ఈ సందర్భంగా డీజీపీ చేతుల మీదుగా బాధితులకు రీ ఫండ్ ఆర్డర్లను అందజేశారు.
బంగ్లా దేశీయులపై నిఘా
బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాజధానిలోని బంగ్లాదేశీయుల కదలికలపై నిఘా ఉంచామని డీజీపీ తెలిపారు. ఎవరైనా బంగ్లాదేశీయులు అక్రమంగా వస్తేచట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - Aug 10 , 2024 | 03:43 AM