ECI: ఎమ్మెల్సీ ‘ఓటర్ల జాబితా’కు త్వరలో షెడ్యూల్
ABN, Publish Date - Aug 06 , 2024 | 02:59 AM
వచ్చే ఏడాది జరగనున్న మూడు శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
గతంలో పేరున్నప్పటికీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి: సీఈవో
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరగనున్న మూడు శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చి 29న పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడతామని అందుకోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం వెల్లడించారు.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలతోపాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీకి కూడా త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఈవో తెలిపారు. నవంబరు 6 వరకు ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని, అదే నెల 23న ముసాయిదా ప్రకటిస్తామని చెప్పారు. డిసెంబర్ 25 వరకు అభ్యంతరాలను స్వీకరించి 30వ తేదిన తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. అయితే గతంలో ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.
Updated Date - Aug 06 , 2024 | 02:59 AM