Share News

Hanumakonda: కొడుకులు తిండి పెట్టట్లేదు.. మా భూమిని తిరిగి ఇప్పించండి సారూ!

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:13 AM

ఆ వృద్ధ దంపతులకు ముగ్గురు కొడుకులు. తాము సంపాదించిన భూమిని ఆ ముగ్గురికి పంచారు. వృద్ధాప్యంలో కొడుకుల దగ్గర ఉంటూ బతుకు వెళ్లదీద్దాం అనుకున్నారు.

Hanumakonda: కొడుకులు తిండి పెట్టట్లేదు.. మా భూమిని తిరిగి ఇప్పించండి సారూ!

  • హన్మకొండ కలెక్టరేట్‌లో ఫిర్యాదు

శాయంపేట, సెప్టెంబరు 23: ఆ వృద్ధ దంపతులకు ముగ్గురు కొడుకులు. తాము సంపాదించిన భూమిని ఆ ముగ్గురికి పంచారు. వృద్ధాప్యంలో కొడుకుల దగ్గర ఉంటూ బతుకు వెళ్లదీద్దాం అనుకున్నారు. కానీ, భూముల కొలతల్లో తేడాలున్నాయని ముగ్గురు అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చాయి. ఆ ముగ్గురూ తల్లిదండ్రుల బాగోగులు మరిచారు. దీంతో, ఆ వృద్ధ దంపతులు.. తాము కొడుకులకు ఇచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలని వేడుకుంటూ హనుమకొండ కలెక్టరేట్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా పెద్దకోడెపాకకు చెందిన చెక్క చంద్రయ్య, సారమ్మ దంపతులకు భద్రయ్య, దామోదర్‌, ప్రసాద్‌ అనే ముగ్గురు కుమారులున్నారు.


ఆ దంపతులు సంపాదించిన 10.05 ఎకరాల భూమిలో 1.11 ఎకరాల భూమిని తమ పేరుపై ఉంచుకుని మిగతా 8.94 ఎకరాల భూమి, పరకాలలో 3 గుంటల స్థలంలో ఇల్లును ముగ్గురికి పంచి, రిజిస్ట్రేషన్‌ చేయించారు. పెద్దకుమారుడు భద్రయ్యకు జ్యేష్ఠ భాగంగా 24 గుంటల వ్యవసాయ భూమి ఎక్కువగా ఇచ్చారు. అయితే, కొలతల్లో వ్యత్యాసం ఉందని అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భద్రయ్య, ప్రసాద్‌ కనీసం తిండి పెట్టకుండా, అకారణంగా కొడుతూ వేధిస్తున్నారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను పట్టించుకోని కుమారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్‌, ఆర్డీవోలను కోరారు.

Updated Date - Sep 24 , 2024 | 03:13 AM