ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Schools: ప్రైవేటు స్కూళ్లకే మొగ్గు!

ABN, Publish Date - Jul 30 , 2024 | 03:32 AM

సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి.

  • 2021-22లో ప్రైవేటుకన్నా ప్రభుత్వ స్కూళ్లలో 2 లక్షల పైగా విద్యార్థులు

  • 2023-24లో సర్కారుకన్నా ప్రైవేటు బడుల్లో 7 లక్షల మంది అదనం

  • కేటాయింపు కంటే తక్కువగా వ్యయాలు.. పాఠశాల విద్య పద్దులో స్పష్టం

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య మరింతగా తగ్గిపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. పాఠశాల విద్యకు సంబంధించిన పద్దును ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులోని వివరాలను పరిశీలిస్తే పాఠశాలల్లో ప్రవేశాల తీరు స్పష్టమవుతోంది. పద్దులోని వివరాల ప్రకారం.. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు 30,78,189 ఉండగా.. ప్రైవేట్‌ బడుల్లో 28,67,895 మంది ఉన్నారు.


ఈ ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ప్రైవేటుకన్నా 2 లక్షలకు పైగా ఉన్నాయి. అయితే 2022-23 విద్యా సంవత్సరం వచ్చేసరికి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గి ప్రైవేట్‌లో పెరిగాయి. ఆ ఏడాదిలో సర్కారు బడుల్లో 28,80,809 మంది, ప్రైవేట్‌ స్కూళ్లలో 30,17,877 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు 1.37 లక్షలకు పైగా ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు మరింత తగ్గి 26,36,630 ఉండగా.. ప్రైవేట్‌లో 34,05,430 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థులతో పోలిస్తే ప్రైవేట్‌ పాఠశాలల్లో 7 లక్షలకు పైగా ఎక్కువగా మంది చేరారు. ఇది ప్రైవేటు స్కూళ్లకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.


  • ఇక పాఠశాల విద్యకు కేటాయిస్తున్న నిధుల్లో గత ఐదేళ్లలో ఒక్కసారే కేటాయింపులకన్నా ఎక్కువ ఖర్చు చేశారు. మిగతా నాలుగేళ్లలో కేటాయింపుల కంటే వ్యయం తక్కువుంది. 2019-20లో కేటాయింపులకన్నా ఎక్కువ వ్యయం చేయగా.. తర్వాతి ఏడాది నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేటాయింపులకన్నా తక్కువ వ్యయం చేశారు.

  • సైనిక పాఠశాలలు, జాతీయ సంస్థల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు రూ.170 లక్షల ఉపకార వేతనాలను చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కోరుకొండ, కలికిరి, ఆర్‌ఐఎంసీ డెహ్రాడూన్‌, కొడుగు (కర్ణాటక), చంద్రాపూర్‌ (మహరాష్ట్ర), తిలైయ (ఝార్ఖండ్‌), అంబికాపూర్‌ (ఛత్తీ్‌సగఢ్‌), బీజాపూర్‌ (కర్ణాటక), పురీలియా (పశ్చిమ బెంగాల్‌), మణిపూర్‌, భువనేశ్వర్‌, సతారా (మహారాష్ట్ర), అమరావతి నగర్‌ (తమిళనాడు)వంటి పాఠశాలల్లో చదివే సుమారు 298మంది తెలంగాణ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్టు స్పష్టం చేసింది.

  • ఆదర్శ పాఠశాలల్లో 1,053 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 194 ఆదర్శ పాఠశాలుండగా.. వీటిలో 1,21,346 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలల్లో 3,880 బోధన పోస్టులుండగా, ప్రస్తుతం 2,827 మంది పనిచేస్తున్నారు. 1,053 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • గ్రామ పంచాయతీల్లో పబ్లిక్‌ రీడింగ్‌ రూంలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో పైలట్‌ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ప్రతి జిల్లా గ్రంథాలయాల్లో ఎయిర్‌ కండీషనింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది.

  • రాష్ట్రంలో 15ఏళ్లు దాటిన వారిలో సుమారు 53 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. వివిధ కారణాలతో పఢ్‌నా, లిఖ్‌ నా అభియాన్‌, నవభారత అక్షరాస్యత కార్యక్రమం (న్యూఇండియా లిటరసీ ప్రోగ్రాం)లను అమలు చేయలేకపోయినట్టు తెలిపింది.


మూడేళ్లలో పాఠశాలల్లో నమోదైన విద్యార్థులు

సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేట్‌ స్కూళ్లు మొత్తం

2021-22 30,78,189 28,67,895 59,46,084

2022-23 28,80,809 30,17,877 58,98,686

2023-24 26,36,630 34,05,430 60,42,060


ఐదేళ్లలో పాఠశాల విద్యకు కేటాయింపులు.. వ్యయాలు (రూ.కోట్లలో)

సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపు వ్యయం

2019-20 7,781.57 9,196.96

2020-21 9,486.59 8,688.55

2021-22 10,205.40 8,999.27

2022-23 12,528.51 11,115.01

2023-24 14,488.25 14,333.88

Updated Date - Jul 30 , 2024 | 03:32 AM

Advertising
Advertising
<