Hyderabad: హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ..
ABN, Publish Date - Jul 02 , 2024 | 04:53 AM
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
విద్యుత్తు కమిషన్‌పై వేసిన పిటిషన్ డిస్మిస్
కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు సమర్థన
అప్పగించిన అంశాలు విస్తృతమైనవి..
చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేశారు
తన వద్ద ఉన్న విషయాలనే వెల్లడించారు
పక్షపాతం అనడం కాదు.. నిరూపించాలి
తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే పరిధి ప్రభుత్వానికి లేదని, తనకు కమిషన్ ఇచ్చిన నోటీసులు కొట్టేయాలని, కమిషన్ ప్రెస్‌మీట్ పెట్టడం ద్వారా పక్షపాతం చూపించిందంటూ కేసీఆర్ పేర్కొనడాన్ని తప్పుబట్టింది. కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. విద్యుత్తు నియంత్రణ కమిషన్ (ఈఆర్సీ) ఇప్పటికే విచారించినప్పటికీ.. విద్యుత్తు కమిషన్‌కు ప్రభుత్వం అప్పగించిన అంశాలు (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) చాలా విస్తృతమైనవని పేర్కొంది.
అందుకే ఆ అంశాలపై విచారణ చేపట్టే అధికారం కమిషన్‌కు ఉందని స్పష్టం చేసింది. కమిషన్ చైర్మన్.. చీఫ్ జస్టి్‌సగా ఒక ఉన్నతమైన రాజ్యాంగబద్ధ పదవిని నిర్వహించారనే విషయాన్ని మరువరాదని హితవు పలికింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి తన ఎదుట విచారణలో ఉన్న అంశాలను మాత్రమే మీడియా సమావేశంలో వెల్లడించారని, అందులో పక్షపాతం ఏమీ లేదని పేర్కొంది. పక్షపాతం అంటే కేవలం ఆరోపణ లేదా ఊహించుకోవడం కాదని, దానిని నిరూపించాలని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కీలక అంశాలను స్పృశిస్తూ తీర్పు వెలువరించడానికి వీలుగా ధర్మాసనం పలు ప్రశ్నలను రూపొందించి.. వాటికి సమాధానాలిచ్చింది.
ఛత్తీ్‌సగఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయాలన్న అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికే ఈఆర్సీ విచారించింది కదా? మళ్లీ దానిపై విచారణ చేపట్టే పరిధి కమిషన్ ఉందా? అనే ప్రశ్నకు ధర్మాసనం బదులిస్తూ, ‘2015లో తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్ రాష్ర్టాల విద్యుత్తు సంస్థల మధ్య పీపీఏలు జరిగాయి. ఈ ఒప్పందాలను, టారి్‌ఫలను వ్యతిరేకిస్తూ పలువురు ఈఆర్సీని ఆశ్రయించారు. ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టి 2017లో తీర్పు వెల్లడించింది. అలాగే ఛత్తీ్‌సగఢ్ ఈఆర్సీ సైతం 2018లో టారి్‌ఫలను నిర్ధారించింది. ఈ తీర్పులపై అప్పీళ్లు దాఖలు కాగా.. అవి అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్ ఈఆర్సీలు ఇచ్చిన తీర్పు కాపీలను పిటిషనర్ సమర్పించకపోయినా.. అఫిడవిట్ ద్వారా ఈ వ్యవహారంపై రెండు రాష్ర్టాల ఈఆర్సీలు విచారణ చేపట్టినట్లు స్పష్టమవుతోంది.
ప్రభుత్వం విద్యుత్తు కమిషన్‌కు అప్పగించిన అంశాల్లో ఈఆర్సీ విచారించిన అంశాల కంటే విస్తృతమైన అంశాలున్నాయి. కమిషన్ గుర్తించిన లోపాలకు, ఆర్థికపరమైన నష్టాలకు బాధ్యులు ఎవరో గుర్తించే బాధ్యతను సైతం కమిషన్‌కు అప్పగించారు. మరోవైపు ఈఆర్సీ ఇప్పటికే విచారించిన అంశాలపై టారిఫ్ నిర్ధారణ వంటి విషయాలు ప్రస్తుత విద్యుత్తు కమిషన్‌కు అప్పగించిన బాధ్యతల్లో లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈఆర్సీ విచారించిన అంశాలపై విచారించే అధికార పరిధి ఎంక్వైరీ కమిషన్‌కు లేదనే వాదన ఆమోదయోగ్యం కాదు. ఈఆర్సీ విచారించినవి, కమిషన్‌కు అప్పగించిన అంశాలు వేర్వేరు అయినందున కమిషన్‌కు పరిధి ఉంటుంది’’ అని ధర్మాసనం వివరించింది.
కమిషన్ పక్షపాత, వివక్షాపూరిత ధోరణితో వ్యవహరిస్తోందా? ప్రెస్‌మీట్ పెట్టడం ద్వారా తన ఎదుట ఉన్న వ్యవహారాలపై ముందే ఓ నిర్ణయం ప్రకటించిందా? అనే ప్రశ్నకు ధర్మాసనం సమాధానం ఇస్తూ, ‘పిటిషనర్ (కేసీఆర్) ప్రతివాదిగా చేర్చిన మూడో ప్రతివాది కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డికి నోటీసులు జారీ చేయాలంటే పక్షపాతం అనే అంశంపై ముందుగా ఈ కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. కమిషన్ చైర్మన్ ఏప్రిల్ 14న పిటిషనర్‌కు నోటీసులు జారీచేశారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నందున రాలేనని, సమయం పొడిగించాలని మే 1న పిటిషనర్ సమాధానం ఇచ్చారు. మళ్లీ కమిషన్ పిటిషనర్‌కు లేఖ రాస్తూ మూడు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉందని.. మే 13న ఎన్నికలు ముగుస్తున్నందున మే 31 లేదా జూన్ 15 లోపు మీకు తగిన సమయాన్ని వెల్లడించండని కోరింది.
ఆ తర్వాత జూన్ 11న కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన ఆంగ్ల తర్జుమాను పరిశీలించాం. ఇందులో.. తన ఎదుట కొనసాగుతున్న ప్రొసీడింగ్స్ స్టేట్‌సను కమిషన్ మీడియాకు వెల్లడించింది. కమిషన్ చైర్మన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చేశారని చెప్పడానికి ఇందులో ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదు. తన ముందున్న మెటీరియల్ ఆధారంగా తాను తెలుసుకున్న అంశాలను రికార్డు చేయడం కమిషన్ విధి. కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టి్‌సగా రాజ్యాంగబద్ధమైన పదవి నిర్వహించారనే విషయం మరిచిపోరాదు.
ఆరోపణలకు ఆధారం లేదు..
కేవలం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ చైర్మన్ వ్యక్తిగత పక్షపాతంతో వ్యవహరించారనే ఆరోపణ చేస్తున్నారే తప్ప మరే ఆధారం లేదు. పక్షపాతం చూపించారనే ఆరోపణ కేవలం ఊహించుకోవడం ద్వారా చేయకూడదు.. దానిని నిరూపించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పక్షపాతం అనే ఆరోపణను నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. ఈ మేరకు అన్ని అంశాలకు సమాధానం లభించింది. అలాగే ప్రభుత్వం జారీచేసిన కమిషన్ ఏర్పాటు జీవో, సెక్షన్ 8(బీ) కింద కమిషన్ పిటిషనర్‌కు ఇచ్చిన నోటీసు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ - 1952కు విరుద్ధంగా ఉందన్న వాదన సైతం ఆమోదయోగ్యం కాదు. పిటిషనర్ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పాల్గొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాతే నోటీసు జారీచేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది’ అని ధర్మాసనం తీర్పులో వెల్లడించింది.
ఎంక్వైరీ కమిషన్ అనేది నిజనిర్ధారణ సంఘం మాత్రమేనని, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రభుత్వం అమలు చేయవచ్చు.. చేయకపోనూ వచ్చని తెలిపింది. కమిషన్ ఇచ్చే నివేదికను అపాయింటింగ్ అథారిటీ అయిన ప్రభుత్వం అంగీకరించవచ్చు.. తిరస్కరించవచ్చని, కమిషన్ ఇచ్చే నివేదిక అంతిమమూ కాదు.. దానికి నిర్ణయాత్మక శక్తీ ఉండదని పేర్కొంది. తన నివేదికను అమలు చేసే అధికారం సైతం కమిషన్‌కు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అడ్మిషన్ దశలోనే కొట్టేసింది.
Updated Date - Jul 02 , 2024 | 04:54 AM